లూకా 15

15
1ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా 2పరిసయ్యులును శాస్త్రులును అది చూచి–ఇతడు పాపులను చేర్చుకొని వారితోకూడ భోజనముచేయుచున్నాడని చాల సణుగుకొనిరి.
3అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను 4–మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱెలుకలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక వెళ్లడా? 5అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసికొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి 6–మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినదని వారితో చెప్పును గదా. 7అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.
8ఏ స్త్రీకైనను పది వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకువరకు జాగ్రత్తగా వెదకదా? 9అది దొరకినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి –నాతోకూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణెము దొరకినదని వారితో చెప్పును గదా. 10అటువలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పు చున్నాననెను.
11మరియు ఆయన ఇట్లనెను–ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. 12వారిలో చిన్నవాడు–తండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. 13కొన్నిదినములైన తరు వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను. 14-15అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడసాగి, వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. 16వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు. 17అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు–నా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను. 18నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; 19ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను. 20వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను. 21అప్పుడు ఆ కుమారుడు అతనితో–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. 22అయితే తండ్రి తన దాసులను చూచి –ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి; 23క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము; 24ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి. 25అప్పుడు అతని పెద్దకుమారుడు పొలములో ఉండెను. వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని 26దాసులలో ఒకని పిలిచి–ఇవి ఏమిటని అడుగగా 27ఆ దాసుడు అతనితో–నీ తమ్ముడు వచ్చియున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెననెను. 28అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను. 29అందుకతడు తన తండ్రితో–ఇదిగో యిన్నియేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేకపిల్లనైన ఇయ్యలేదు. 30అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను. 31అందుకతడు–కుమారుడా, నీ వెల్లప్పుడును నాతోకూడ ఉన్నావు; నావన్నియు నీవి, 32మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను.

المحددات الحالية:

లూకా 15: TELUBSI

تمييز النص

شارك

نسخ

None

هل تريد حفظ أبرز أعمالك على جميع أجهزتك؟ قم بالتسجيل أو تسجيل الدخول