లూకా 6

6
1ఒక విశ్రాంతిదినమున ఆయన పంటచేలలోబడి వెళ్లు చుండగా, ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి, చేతులతో నలుపుకొని, తినుచుండిరి. 2అప్పుడు పరిసయ్యులలో కొందరు–విశ్రాంతిదినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారినడుగగా 3యేసు వారితో ఇట్లనెను–తానును తనతోకూడ ఉన్నవారును ఆకలిగొని నప్పుడు దావీదు ఏమిచేసెనో అదియైనను మీరు చదువ లేదా? 4అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులు తప్ప మరి ఎవరును తినకూడని సముఖపు రొట్టెలు తీసికొని తిని, తనతోకూడ ఉన్నవారికిని ఇచ్చెను గదా అనెను. 5కాగా–మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును యజమానుడని వారితో చెప్పెను.
6మరియొక విశ్రాంతిదినమున ఆయన సమాజమందిరములోనికి వెళ్లి బోధించుచున్నప్పుడు, అక్కడ ఊచ కుడి చెయ్యిగలవాడొకడుండెను. 7శాస్త్రులును పరిసయ్యులును ఆయనమీద నేరము మోపవలెనని, విశ్రాంతిదినమున స్వస్థ పరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి; 8అయితే ఆయన వారి ఆలోచన లెరిగి, ఊచచెయ్యిగలవానితో– నీవు లేచిమధ్యను నిలువుమని చెప్పగా, వాడు లేచి నిలిచెను. 9అప్పుడు యేసు–విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా? అని మిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి 10వారినందరిని చుట్టు కలయజూచి–నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను; వాడాలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను. 11అప్పుడు వారు వెఱ్ఱి కోపముతో నిండుకొని, యేసును ఏమి చేయుదమా అని యొకనితోనొకడు మాటలాడుకొనిరి.
12ఆ దినములయందు ఆయన ప్రార్థనచేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. 13ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను. 14వీరెవరనగా–ఆయన ఎవనికి పేతురు అను మారుపేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, 15మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే#6:15 మతాభిమాని యను. అనబడిన సీమోను, 16యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. 17ఆయన వారితోకూడ దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్పసమూహమును, ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయ దేశమంతటినుండియు, యెరూషలేమునుండియు, తూరుసీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండియు వచ్చిన బహుజనసమూహమును, 18అపవిత్రాత్మల చేత బాధింపబడినవారును వచ్చి స్వస్థతనొందిరి. 19ప్రభావము ఆయనలోనుండి బయలుదేరి అందరిని స్వస్థపరచు చుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలెనని యత్నముచేసెను.
20అంతట ఆయన తన శిష్యులతట్టు పారచూచి ఇట్లనెను–
బీదలైన మీరు ధన్యులు, దేవునిరాజ్యము మీది. 21ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. 22మనుష్యకుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు. 23ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి; ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును; వారి పిత రులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. 24అయ్యో, ధనవంతులారా, మీరు (కోరిన) ఆదరణ మీరు పొంది యున్నారు. 25అయ్యో యిప్పుడు (కడుపు) నిండియున్నవారలారా, మీరాకలిగొందురు. అయ్యో యిప్పుడు నవ్వుచున్నవారలారా, మీరు దుఃఖించి యేడ్తురు. 26మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ; వారి పితరులు అబద్ధప్రవక్తలకు అదే విధముగా చేసిరి.
27వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా–మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలుచేయుడి, 28మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి. 29నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడ త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తి కొనిపోకుండ అడ్డగింపకుము. 30నిన్నడుగు ప్రతివానికిని ఇమ్ము; నీ సొత్తు ఎత్తికొని పోవువానియొద్ద దాని మరల అడుగవద్దు. 31మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి. 32మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించువారిని ప్రేమింతురు గదా 33మీకు మేలుచేయువారికే మేలు చేసినయెడల మీకేమి మెప్పుకలుగును? పాపులును ఆలాగే చేతురు గదా 34మీరెవరియొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తామిచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా. 35మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులైయుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడ లను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు. 36కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కని కరముగలవారై యుండుడి. 37తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు; 38క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.
39మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను–గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు గదా. 40శిష్యుడు తన బోధకునికంటె అధికుడు కాడు; సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును. 41నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల? 42నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో–సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయ నిమ్మని నీవేలాగు చెప్పగలవు? వేషధారీ, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. 43ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. 44ప్రతి చెట్టు తన ఫలములవలన తెలియబడును. ముండ్లపొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు; కోరింద పొదలో ద్రాక్షపండ్లు కోయరు. 45సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.
46నేను చెప్పు మాటలప్రకారము మీరు చేయక– ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు? 47నా యొద్దకు వచ్చి, నా మాటలు విని వాటిచొప్పునచేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియ జేతును. 48వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండమీద పునాది వేసినవాని పోలియుండును. వరదవచ్చి ప్రవాహము ఆ యింటిమీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున#6:48 అనేక ప్రాచీన ప్రతులలో – దాని పునాది బండమీద వేయబడెను గనుక అని పాఠాంతరము. దాని కదలింపలేకపోయెను. 49అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేలమీద ఇల్లు కట్టినవానిని పోలియుండును. ప్రవాహము దానిమీద వడిగా కొట్టగానే అది కూలి పడెను; ఆ యింటిపాటు గొప్పదని చెప్పెను.

المحددات الحالية:

లూకా 6: TELUBSI

تمييز النص

شارك

نسخ

None

هل تريد حفظ أبرز أعمالك على جميع أجهزتك؟ قم بالتسجيل أو تسجيل الدخول