YouVersion Logo
Search Icon

1 తిమోతికి 5

5
1వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. 2అన్నదమ్ములని యౌవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో యౌవన స్త్రీలను హెచ్చరించుము. 3నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. 4అయితే ఏ విధవరాలికైనను పిల్లలుగాని మనుమలుగాని యుండినయెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవునిదృష్టికనుకూలమైయున్నది. 5అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకియైయుండి, దేవునిమీదనే తన నిరీక్షణనుంచుకొని, విజ్ఞాప నలయందును ప్రార్థనలయందును రేయింబగలు నిలుకడగా ఉండును. 6సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రదుకు చుండియు చచ్చినదైయుండును. 7వారు నిందారహితులై యుండునట్లు ఈలాగు ఆజ్ఞాపించుము. 8ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడైయుండును. 9అరువది ఏండ్ల కంటె తక్కువవయస్సు లేక, ఒక్క పురుషునికే భార్యయై, 10సత్‌క్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు అతిథ్యమిచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, శ్రమపడువారికి సహాయముచేసి, ప్రతి సత్కార్యముచేయ బూనుకొనినదైతే ఆమెను విధవ రాండ్ర లెక్కలో చేర్చవచ్చును. 11-12యౌవనస్థులైన విధవ రాండ్రను లెక్కలో చేర్చవద్దు; వారు క్రీస్తునకు విరో ధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదలుకొనిరను తీర్పుపొందినవారై పెండ్లాడగోరుదురు. 13మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధకురాం డ్రగుటకు మాత్రమేగాక, ఆడరాని మాటలాడుచు, వదరు బోతులును పరులజోలికి పోవువారునగుటకును నేర్చు కొందురు. 14కాబట్టి యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను. 15ఇంతకుముందే కొందరు త్రోవనుండి తొలగి పోయి సాతానును వెంబడించినవారైరి. 16విశ్వాసురాలైన యే స్త్రీ యింటనైనను విధవరాండ్రుండినయెడల, సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దానిమీద భారములేకుండ ఆమెయే వీరికి సహాయము చేయవలెను.
17బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. 18ఇందుకు–నూర్చెడి#5:18 కళ్లము త్రొక్కుచున్న. యెద్దు మూతికి చిక్కము వేయవద్దు
అని లేఖనము చెప్పుచున్నది. మరియు
పనివాడు తన జీతమునకు పాత్రుడు.
19ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనేగాని పెద్దమీద దోషా రోపణ అంగీకరింపకుము. 20ఇతరులు భయపడునిమిత్తము పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము. 21విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమియుచేయక, నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని యెదుటను, క్రీస్తుయేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవదూతలయెదుటను నీకు ఆనబెట్టుచున్నాను.#5:21 లేక, సాక్ష్యమిచ్చుచున్నాను. 22త్వరపడి యెవనిమీదనైనను హస్తనిక్షేపణము చేయకుము. పరులపాపములలో పాలివాడవై యుండకుము. నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము. 23ఇకమీదట నీళ్లేత్రాగక నీ కడుపు జబ్బునిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. 24కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారివెంట వెళ్లుచున్నవి. 25అటువలె మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in