YouVersion Logo
Search Icon

2 దినవృత్తాంతములు 23

23
1అంతట ఏడవ సంవత్సరమందు యెహోయాదా. ధైర్యము తెచ్చుకొని, శతాధిపతులతోను యెరోహాము కుమారుడైన అజర్యాతోను యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోను ఓబేదు కుమారుడైన అజర్యాతోను అదాయా కుమారుడైన మయశేయాతోను జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతుతోను నిబంధనచేయగా 2వారు యూదా దేశమందంతటను సంచరించి, యూదావారి పట్టణములన్నిటిలోనుండి లేవీయులను ఇశ్రాయేలీయుల పితరులయిండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి. 3జనులందరు సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసికొనినప్పుడు అతడు వారితో ఇట్లనెను–యెహోవా దావీదు కుమారులనుగూర్చి యిచ్చిన సెలవుచొప్పున రాజకుమారుడు రాజ్య మేలవలెను. 4కాబట్టి మీరు చేయవలసినదేమనగా, మీలో యాజకులైనవారేమి లేవీయులైనవారేమి విశ్రాంతిదినమున లోపల ప్రవేశించువారు మూడు భాగములై, యొక భాగము ద్వారపాలకులుగా ఉండవలెను. 5ఒక భాగము రాజనగరునొద్ద ఉండవలెను. ఒక భాగము పునాది గుమ్మము నొద్ద ఉండవలెను, జనులందరు యెహోవా మందిరపు ఆవరణములలో ఉండవలెను. 6యాజకులును లేవీయులలో పరిచారము చేయువారును తప్ప యెహోవా మందిరము లోపలికి మరి ఎవరును రాకూడదు, వారు ప్రతిష్ఠింపబడినవారు గనుక వారు లోపలికి రావచ్చునుగాని జనులందరు యెహోవా ఇచ్చిన ఆజ్ఞచొప్పున బయట ఉండవలెను. 7లేవీయులందరు తమతమ ఆయుధములను చేతపట్టుకొని రాజుచుట్టును ఉండవలెను, మందిరము లోపలికి మరి ఎవరైనను వచ్చినయెడల ఆ వచ్చినవారికి మరణశిక్ష విధించుడి; రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్లునప్పుడేమి మీరు అతనితోకూడ ఉండవలెను. 8కాబట్టి లేవీయులును యూదావారందరును యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ యంతటి ప్రకారము చేసిరి; యాజకుడైన యెహోయాదా వంతులవారికి సెలవియ్యలేదు గనుక ప్రతివాడు విశ్రాంతిదినమున బయటికి వెళ్ల వలసిన తనవారిని ఆ దినమున లోపలికి రావలసిన తనవారిని తీసికొనివచ్చెను.
9మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను కేడెములను డాళ్లను శతాధిపతులకు అప్పగించెను. 10అతడు ఆయుధము చేతపట్టుకొనిన జనులందరిని మందిరపు కుడివైపునుండి యెడమవైపువరకు బలిపీఠము ప్రక్కను మందిరముప్రక్కను రాజుచుట్టును ఉంచెను. 11అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి, అతనిమీద కిరీటముంచి, ధర్మశాస్త్ర గ్రంథమును అతనిచేతికిచ్చి అతనికి పట్టాభి షేకము చేసిరి; యెహోయాదాయును అతని కుమారులును అతనిని అభిషేకించి–రాజు చిరంజీవియగునుగాక యనిరి.
12పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులుచేయు ధ్వని అతల్యా విని యెహోవామందిరమందున్న జనులయొద్దకు వచ్చి 13ప్రవేశస్థలముదగ్గర నున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలువబడియుండుటయు, అధిపతులును బూరలు ఊదువారును రాజునొద్దనుండుటయు, దేశపు జనులందరును సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయు, గాయకులును వాద్యములతో స్తుతిపాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని–ద్రోహము ద్రోహమని అరచెను. 14అప్పుడు యాజకుడైన యెహోయాదా–యెహోవా మందిరములో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు తీసుకొనివెళ్ళి ఆమె పక్షము పూనువారిని కత్తిచేత చంపుడని సైన్యముమీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. 15కాబట్టి వారు ఆమెకు దారియిచ్చి, రాజనగరునొద్దనున్న గుఱ్ఱపు గుమ్మముయొక్క ప్రవేశస్థలమునకు ఆమె వచ్చి నప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. 16అప్పుడు యెహోయాదా జనులందరు యెహోవావారై యుండవలెనని జనులందరితోను రాజుతోను నిబంధనచేసెను. 17అంతట జనులందరును బయలుదేవతయొక్క గుడికి పోయి దాని పడగొట్టి, బలిపీఠములను విగ్రహములను తుత్తునియలుగా విరుగగొట్టి, బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి. 18మరియు మోషే యిచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడినదానినిబట్టి ఉత్సాహముతోను గానముతోను యెహోవాకు అర్పింపవలసిన దహనబలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించునట్లు, లేవీయులైన యాజకుల చేతిక్రింద నుండునట్టియు, యెహోవామందిరమందు దావీదు పనులు పంచివేసినట్టియునైన యెహోవా మందిరపు కావలివారికి యెహోయాదా నిర్ణయించెను. 19యెహోవా మందిరములోనికి దేనిచేతనైనను అంటుతగిలినవారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారములయొద్ద ద్వారపాలకులను ఉంచెను. 20మరియు అతడు శతాధిపతులను ప్రధానులను జనుల అధికారులను దేశపు జనులనందరిని వెంటబెట్టుకొని యెహోవా మందిరములోనుండి రాజును తోడుకొని వచ్చెను; వారు ఎత్తయిన ద్వారముగుండ రాజ నగరుచొచ్చి రాజ్యసింహాసనముమీద రాజును ఆసీనునిచేయగా 21దేశజనులందరు సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in