YouVersion Logo
Search Icon

2 దినవృత్తాంతములు 5

5
1సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పనియంతయు సమాప్తముచేసి, తన తండ్రియైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటిని దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను. 2తరువాత యెహోవా నిబంధనమందసమును సీయోను అను దావీదు పురమునుండి తీసికొని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయే లీయుల పెద్దలను ఇశ్రాయేలీయుల వంశములకు అధికారులగు గోత్రముల పెద్దలనందరిని యెరూషలేమునందు సమకూర్చెను. 3ఏడవ నెలను పండుగ జరుగుకాలమున ఇశ్రాయేలీయులందరును రాజునొద్దకు వచ్చిరి. 4ఇశ్రాయేలీయుల పెద్దలందరును వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి 5రాజైన సొలొమోనును ఇశ్రాయేలీయుల సమాజకులందరును సమకూడి, లెక్కింప శక్యముకాని గొఱ్ఱెలను పశువులను బలిగా అర్పించిరి. 6లేవీయులును యాజకులును మందసమును సమాజపు గుడారమును గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణములన్నిటిని తీసికొని వచ్చిరి. 7మరియు యాజకులు యెహోవా నిబంధనమందసమును తీసికొని గర్భాలయమగు అతి పరిశుద్ధస్థలమందు కెరూబుల రెక్కలక్రింద దానిని ఉంచిరి. 8మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ రెండు రెక్కలను చాచుకొని మందసమును దాని దండెలను కమ్మెను. 9వాటి కొనలు గర్భా లయము ఎదుట కనబడునంత పొడవుగా ఆ దండెలుంచ బడెనుగాని అవి బయటికి కనబడలేదు. నేటివరకు అవి అచ్చటనే యున్నవి. 10ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి బయలువెళ్లిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానియందు మరేమియులేదు. 11యాజకులు పరిశుద్ధస్థలమునుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడియున్న యాజకులందరును తమ వంతులు చూడకుండ తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. 12ఆసాపు హేమాను యెదూతూనుల సంబంధమైనవారును, వారి కుమారులకును సహోదరులకును సంబంధికులగు పాటకులైన లేవీయులందరును, సన్నపు నారవస్త్రములను ధరించుకొని తాళములను తంబురలను సితారాలను చేతపట్టుకొని బలిపీఠమునకు తూర్పుతట్టున నిలిచిరి; 13వారితోకూడ బూరలు ఊదు యాజకులు నూట ఇరువదిమంది నిలిచిరి; బూరలు ఊదువారును పాట కులును ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానముచేయగా యాజకులు పరిశుద్ధస్థలములోనుండి బయలువెళ్లి, ఆ బూరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తి–యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రముచేసిరి. 14అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండ నిండెను; యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవచేయుటకు యాజకులు ఆ మేఘమున్నచోట నిలువలేకపోయిరి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in