YouVersion Logo
Search Icon

2 దినవృత్తాంతములు 9

9
1షేబదేశపు రాణి సొలొమోనునుగూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నలచేత సొలొమోనును శోధింపవలెనని కోరి, మిక్కిలి గొప్ప పరివారమును వెంట బెట్టుకొని, గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోనునొద్దకు వచ్చి తన మనస్సు లోని విషయములన్నిటిని గురించి అతనితో మాటలాడెను. 2సొలొమోను ఆమె ప్రశ్నలన్నియు ఆమెకు విడదీసి చెప్పెను; సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట యేదియు లేకపోయెను. 3షేబదేశపు రాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, 4అతని బల్లమీది భోజనపదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని యుపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను, అతనికి గిన్నెల నందించువారిని వారి వస్త్రములను, యెహోవామందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచినప్పుడు, ఆమె విస్మయ మొంది రాజుతో ఇట్లనెను 5–నీ కార్యములనుగూర్చియు జ్ఞానమునుగూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే గాని, నేను వచ్చి దాని కన్నులార చూచువరకు వారి మాటలను నమ్మకయుంటిని. 6నీ యధిక జ్ఞానమునుగూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్నుగూర్చి నేను వినినదానికంటె నీ కీర్తి యెంతో హెచ్చుగానున్నది. 7నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడును నీ సముఖమున నిలిచి నీ జ్ఞానసంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. 8నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనముమీద ఆసీనుడవై యుండునట్లు నీయందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగియున్నందున నీతిన్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారిమీద రాజుగా నియమించెను అని చెప్పెను. 9ఆమె రాజునకు రెండువందల నలుబది మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను; షేబదేశపు రాణి రాజైన సొలొమోనున కిచ్చిన గంధవర్గములతో సాటియైన దేదియులేదు. 10ఇదియుగాక ఓఫీరునుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములను కూడ కొనివచ్చిరి. 11ఆ చందనపు మ్రానులచేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును సోపానములను, గాయకులకు తంబురలను సితారాలను చేయించెను, అటువంటి పని అంతకుముందు యూదాదేశమందు ఎవ్వరును చూచియుండలేదు. 12షేబ దేశపు రాణి రాజునకు తీసికొనివచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములుగాక ఆమె మక్కువపడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమె కిచ్చెను; తరువాత ఆమె తన సేవకులను వెంట బెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్లిపోయెను.
13గంధవర్గములు అమ్ము వర్తకులును ఇతర వర్తకులును కొని వచ్చు బంగారముగాక సొలొమోనునకు ఏటేట వచ్చు బంగారము వెయ్యిన్ని మూడువందల ముప్పది రెండు మణుగులయెత్తు. 14అరబీదేశపు రాజులందరును దేశాధిపతులును సొలొమోనునొద్దకు బంగారమును వెండియు తీసికొని వచ్చిరి. 15రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులుగల రెండువందల డాళ్లను చేయించెను; ఒక్కొక డాలునకు ఆరువందల తులముల బంగారము పట్టెను. 16మరియు సాగగొట్టిన బంగారముతో మూడు వందల కేడెములను చేయించెను; ఒక్కొక కేడెమునకు మూడువందల తులముల బంగారము పట్టెను; వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరునందుంచెను. 17మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దాని పొదిగించెను. 18ఆ సింహాసనమునకు దానితో కలిసియున్న ఆరు బంగారపు సోపానములును సింహాసనమునకు కట్టి యున్న బంగారపు పాదపీఠమును ఉండెను, కూర్చుండుచోటికి ఇరుప్రక్కల ఊతలుండెను, ఊతలదగ్గర రెండు సింహములుండెను; 19ఆయారు సోపానములమీద ఇరుప్రక్కల పండ్రెండు సింహములు నిలిచియుండెను, ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. 20మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నియును బంగారపువై యుండెను; లెబా నోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నియు బంగారముతో చేసినవి; హీరాముయొక్క పనివారితోకూడ రాజు ఓడలు తర్షీషుకు పోయి మూడు సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, యేనుగుదంతము, కోతులు, నెమళ్లు అను సరకులతో వచ్చుచుండెను గనుక 21సొలొమోను దినములలో వెండియెన్నికకు రానిదాయెను 22రాజైన సొలొమోను భూరాజులందరికంటెను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను. 23దేవుడు సొలొమోనుయొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరును అతని ముఖదర్శనము చేయగోరిరి. 24మరియు ప్రతివాడును ఏటేట వెండివస్తువులను బంగారు వస్తువులను వస్త్రములను ఆయుధములను గంధవర్గములను గుఱ్ఱములను కంచరగాడిదలను కానుకలుగా తీసికొనివచ్చెను.
25రథములు నిలువయుంచు పట్టణములలోను రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనునకు నాలుగువేల గుఱ్ఱపు సాలలును రథములును పండ్రెండువేల గుఱ్ఱపు రౌతులును కలిగి యుండెను. 26యూఫ్రటీసునది మొదలుకొని ఫిలిష్తీయుల దేశమువరకును ఐగుప్తు సరిహద్దువరకునుఉండు రాజులందరి పైని అతడు ఏలుబడి చేసెను. 27రాజు యెరూషలేమునందు వెండి రాళ్లంత విస్తారముగా నుండునట్లును, దేవదారు మ్రానులు షెఫేలా ప్రదేశముననున్న మేడివృక్షములంత విస్తారముగా నుండునట్లును చేసెను. 28ఐగుప్తునుండియు సకల దేశములనుండియు సొలొమోనునకు గుఱ్ఱములు తేబడెను. 29సొలొమోను చేసిన కార్యములన్నిటినిగూర్చి ప్రవక్తయైన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యరొబామునుగూర్చి దీర్ఘదర్శియైన ఇద్దో గ్రంథమందును వ్రాయబడి యున్నది. 30సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిమీద నలుబది సంవత్సరములు ఏలుబడి చేసెను. 31తరువాత సొలొమోను తన పితరులతోకూడ నిద్రించి తన తండ్రియైన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను; అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in