YouVersion Logo
Search Icon

ద్వితీయోపదేశకాండము 25

25
1మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చు నప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషియనియు తీర్పు తీర్చవలెను. 2ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడినయెడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి వాని నేరముకొలది దెబ్బలు లెక్కపెట్టి తనయెదుట వాని కొట్టింపవలెను. 3నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు. వీటి కంటే విస్తారమైన దెబ్బలు కొట్టించినయెడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో.
4నూర్చెడియెద్దు#25:4 కళ్లము త్రొక్కుచున్న. మూతికి చిక్కము వేయకూడదు.
5సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెని మిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను. 6చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలోనుండి తుడిచి వేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠకుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను. 7అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లనియెడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి, అనగా పెద్దలయొద్దకు పోయి– నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవరధర్మము చేయ నొల్లడని తెలుపుకొనవలెను. 8అప్పుడు అతని యూరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాటలాడిన తరువాత అతడు నిలువబడి–ఆమెను పరిగ్రహించుటకు నా కిష్టము లేదనినయెడల అతని సహోదరుని భార్య 9ఆ పెద్దలు చూచుచుండగా, అతని దాపున పోయి అతని కాలినుండి చెప్పు ఊడదీసి అతని ముఖము నెదుట ఉమ్మివేసి–తన సహోదరుని యిల్లు నిలుపని మనుష్యునికి ఈలాగు చేయబడునని చెప్పవలెను. 10అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని యిల్లని వానికి పేరు పెట్టబడును.
11మనుష్యులు ఒకనితో నొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్నవాని చేతిలోనుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వాని మానము పట్టుకొనినయెడల ఆమె చేతిని ఛేదింపవలెను. 12నీ కన్ను కటాక్షింపకూడదు.
13హెచ్చుతగ్గులుగల వేరువేరు తూనికె రాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు. 14హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూములు నీ యింట ఉంచుకొనకూడదు. 15నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘా యుష్మంతుడవగునట్లు తక్కువవికాని న్యాయమైన తూనికె రాళ్లు నీవు ఉంచుకొనవలెను. తక్కువదికాని న్యాయమైన తూము నీకు ఉండవలెను. 16ఆలాగు చేయని ప్రతివాడును, అనగా అన్యాయముచేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు.
17మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసినదానిని జ్ఞాపకము చేసికొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీ కెదురుగా వచ్చి 18నీవు ప్రయాసవడి అలసియున్నప్పుడు నీవారిలో నీ వెనుక నున్న బలహీనులనందరిని హతముచేసెను. 19కాబట్టి నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపెట్లనున్న నీ సమస్త శత్రువులనులేకుండచేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మరచిపోవద్దు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in