YouVersion Logo
Search Icon

న్యాయాధిపతులు 18

18
1ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. మరియు ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినమువరకు దానీయులు స్వాస్థ్యము పొంది యుండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదకు కొనుటకై వారు బయలుదేరియుండిరి. 2ఆ దేశసంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులందరిలోనుండి పరాక్రమవంతులైన అయిదుగురు మనుష్యులను జొర్యానుండియు ఎష్తాయోలునుండియు పంపి –మీరు వెళ్లి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా 3వారు ఎఫ్రాయిమీయుల మన్యముననున్న మీకా యింటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా యింటియొద్ద నున్నప్పుడు, లేవీయుడైన ఆ యౌవనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగియున్నదని యడుగగా 4అతడు మీకా తనకు చేసిన విధముచెప్పి–మీకా నాకు జీతమిచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడనై యున్నానని వారితో చెప్పెను. 5అప్పుడు వారు–మేము చేయబోవుపని శుభమగునో కాదో మేము తెలిసికొనునట్లు దయచేసి దేవునియొద్ద విచారించుమని అతనితో అనగా 6ఆయాజకుడు క్షేమముగా వెళ్లుడి, మీరు చేయబోవుపని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను.
7కాబట్టి ఆ అయిదుగురు మనుష్యులు వెళ్లి లాయిషునకు వచ్చి, దానిలోని జనము సీదోనీయులవలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికారబలముపొందిన వాడెవడును లేకపోవుటయు, ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడును ఆ దేశములో లేకపోవుటయు, వారు సీదోనీయులకు దూరస్థులై యే మనుష్యులతోను సాంగత్యములేకుండుటయు చూచిరి. 8వారు జొర్యాలోను ఎష్తాయోలులోనుఉండు తమ స్వజనులయొద్దకు రాగా వారు–మీ తాత్పర్యమేమిటని యడిగిరి. 9అందుకు వారు–లెండి, వారిమీద పడుదము, ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది, మీరు ఊరకనున్నా రేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి. 10జనులు నిర్భయముగా నున్నారు గనుక మీరు పోయి వారిమీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది, దేవుడు మీ చేతికి దాని నప్పగించును, భూమిలోనున్న పదార్థములలో ఏదియు అచ్చట కొదువలేదనిరి.
11అప్పుడు జొర్యాలోను ఎష్తాయోలులోను ఉన్న దానీయులైన ఆరువందలమంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడనుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి. 12అందుచేతను నేటివరకు ఆ స్థలమునకు దానీయులదండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమట నున్నది. 13అక్కడనుండి వారు ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశమునకు పోయి మీకా యింటికి వచ్చిరి. 14కాబట్టి లాయిషుదేశమును సంచరించుటకు పోయిన ఆ అయిదుగురు మనుష్యులు తమ సహోదరులను చూచి–ఈ యిండ్లలో ఏఫోదును గృహదేవతలును చెక్క బడిన ప్రతిమయు పోతవిగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా? మీరేమి చేయవలెనో దాని యోచన చేయుడనగా 15వారు ఆతట్టు తిరిగి లేవీయుడైన ఆ యౌవనుడున్న మీకా యింటికి వచ్చి అతని కుశలప్రశ్నలడిగిరి. 16దానీయులైన ఆ ఆరువందలమంది తమ యుద్ధాయుధములను కట్టుకొని 17గవినివాకిట నిలుచుండగా, దేశమును సంచరించుటకు పోయిన ఆ అయిదుగురు మనుష్యులు లోపలచొచ్చి ఆ ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోతవిగ్రహమును పట్టుకొనిరి. అప్పుడు ఆయాజకుడు యుద్ధాయుధములు కట్టుకొనిన ఆ ఆరువందలమంది మనుష్యులతోకూడ గవిని యెదుట వాకిట నిలిచియుండెను. 18వీరు మీకా యింటికిపోయి చెక్కబడిన ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోతవిగ్రహమును పట్టుకొనినప్పుడు ఆయాజకుడు–మీరేమి చేయుచున్నారని వారినడుగగా 19వారు–నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతోకూడ వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము, ఒకని యింటివారికే యాజకుడవై యుండుట నీకు మంచిదా, ఇశ్రాయేలీయులలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడవైయుం డుట మంచిదా? అని యడిగిరి. 20అప్పుడు ఆయాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనులమధ్య చేరెను. 21అట్లువారు తిరిగి చిన్నపిల్లలను పశువులను సామగ్రిని తమకు ముందుగా నడిపించుకొనిపోయిరి. 22వారు మీకా యింటికి దూరమైనప్పుడు, మీకా పొరుగిండ్లవారు పోగై దానీయులను వెంటాడి కలిసికొని వారిని పిలువగా 23వారు తమ ముఖములను త్రిప్పుకొని–నీకేమి కావలెను? ఇట్లు గుంపుకూడనేల? అని మీకాను అడిగిరి. 24అందుకతడు–నేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవుచున్నారే, యిక నా యొద్ద ఏమియున్నది? నీకేమి కావలెననుచున్నారే, అదే మన్నమాట అనగా 25దానీయులు–నీ స్వరము మాలో నెవనికిని వినబడనీయకుము, వారు ఆగ్రహపడి నీమీద పడుదురేమో, అప్పుడు నీవు నీ ప్రాణమును నీ యింటివారి ప్రాణమును పోగొట్టుకొందువని అతనితో చెప్పి 26తమ త్రోవను వెళ్లిరి. వారు తనకంటె బలవంతులని మీకా గ్రహించినవాడై తిరిగి తన యింటికి వెళ్లిపోయెను. 27మీకా చేసికొనినదానిని, అతని యొద్దనున్న యాజకునిని వారు పట్టుకొని, సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిషు వారి మీదికి వచ్చి కత్తివాత వారిని హతముచేసి అగ్నిచేత ఆ పట్టణమును కాల్చివేసిరి. 28అది సీదోనుకు దూరమై నందునను, వారికి అన్యులతో సాంగత్యమేమియు లేనందునను వారిలో ఎవడును తప్పించుకొనలేదు. అది బేత్రెహోబునకు సమీపమైన లోయలోనున్నది. 29వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రియైన దానునుబట్టి ఆ పట్టణమునకు దాను అను పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అను పేరు. 30దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనుమడును గెర్షోను కుమారుడునైన యోనాతాననువాడును వాని కుమారులును ఆ దేశము చెరపట్టబడువరకు దానీయుల గోత్రమునకు యాజకులై యుండిరి. 31దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొనియుండిరి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in