YouVersion Logo
Search Icon

విలాపవాక్యములు 5

5
1యెహోవా, మాకు కలిగినశ్రమ జ్ఞాపకము చేసికొనుము
దృష్టించి మామీదికి వచ్చిన నింద యెట్టిదో చూడుము.
2మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను.
మా యిండ్లు అన్యుల స్వాధీనమాయెను.
3మేము దిక్కులేనివారము తండ్రిలేనివారము
మా తల్లులు విధవరాండ్రయిరి.
4ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి
క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి.
5మమ్మును తరుమువారు మా మెడలమీదికి ఎక్కియున్నారు
మేము అలసట చెందియున్నాము, విశ్రాంతి యనునది
మాకు లేదు.
6పొట్టకూటికై ఐగుప్తీయులకును అష్షూరీయులకును
లోబడియున్నాము.
7మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి
మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము.
8దాసులు మాకు ప్రభువులైరివారి వశమునుండి మమ్మును విడిపింపగలవాడెవడును
లేడు.
9ఎడారిజనుల ఖడ్గభయమువలన ప్రాణమునకు తెగించి
మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము.
10మహాక్షామమువలన మా చర్మము పొయ్యివలె నలు
పెక్కెను.
11శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపిరి
యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి.
12చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి
వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు.
13యౌవనులు తిరుగటిరాయి మోసిరి
బాలురు కట్టెలమోపు మోయజాలక తడబడిరి.
14పెద్దలు గుమ్మములయొద్ద కూడుట మానిరి
యౌవనులు సంగీతము మానిరి.
15సంతోషము మా హృదయమును విడిచిపోయెను
నాట్యము దుఃఖముగా మార్చబడియున్నది.
16మా తలమీదనుండి కిరీటము పడిపోయెను
మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ.
17దీనివలన మాకు ధైర్యము చెడియున్నది.
సీయోను పర్వతము పాడైనది
18నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి
మా కన్నులు దీని చూచి మందగిలెను.
19యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై యుందువు
నీ సింహాసనము తరతరములుండును.
20నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుట ఏల?
మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఏల?
21యెహోవా, నీవు మమ్మును నీతట్టు త్రిప్పినయెడల
మేము తిరిగెదము.
మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము.
22నీవు మమ్మును బొత్తిగా విసర్జించియున్నావు
నీ మహోగ్రత మామీద వచ్చినది.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in