YouVersion Logo
Search Icon

మత్తయి 7

7
1మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. 2మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మునుగూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును. 3నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? 4నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి–నీకంటిలో నున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్ప నేల? 5వేషధారీ, మొదట నీ కంటిలో నున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.
6పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీమీదపడి మిమ్మును చీల్చి వేయును.
7అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును, 8తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును,తట్టువానికి తీయబడును. 9మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా? 10-11మీరు చెడ్డ వారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును. 12కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై యున్నది.
13-14ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.
15అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. 16వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? 17ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కానిఫలములు ఫలించును. 18మంచి చెట్టు కానిఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. 19మంచి ఫలములు ఫలింపని ప్రతిచెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. 20కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు. 21–ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును. 22ఆ దినమందు అనేకులు నన్ను చూచి–ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. 23అప్పుడు –నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమముచేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును. 24కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పునచేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధి మంతుని పోలియుండును. 25వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. 26మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. 27వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూల బడెను; దాని పాటు గొప్పదని చెప్పెను.
28యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. 29ఏలయనగా ఆయన వారి శాస్త్రులవలె కాక అధికారముగలవానివలె వారికి బోధించెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in