YouVersion Logo
Search Icon

జెఫన్యా 2

2
1సిగ్గుమాలిన జనులారా, కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. 2విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి. 3దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధులననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రతదినమున మీరు దాచబడుదురు. 4గాజాపట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును, మధ్యాహ్నకాలమందు అష్డోదువారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును. 5సముద్రప్రాంతమందు నివసించు కెరేతీయులారా, మీకు శ్రమ; ఫిలిష్తీయుల దేశమైన కనానూ, నిన్నుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా–నీయందు ఒక కాపురస్థుడైననులేకుండ నేను నిన్ను లయముచేతును. 6సముద్రప్రాంతము గొఱ్ఱెల కాపరులు దిగు మేతస్థలమగును, మందలకు దొడ్లు అచ్చట నుండును. 7తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలోనుండి రప్పించగా అచ్చటవారిలో శేషించిన వారికి ఒక స్థలముండును; వారు అచ్చట తమ మందలను మేపుదురు, అస్తమయమునవారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు. 8మోయాబువారు చేసిన నిందయు, అమ్మోనువారు పలికిన దూషణమాటలును నాకు వినబడెను; వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి. 9నా జీవముతోడు మోయాబుదేశము సొదొమ పట్టణమువలెను, అమ్మోనుదేశము గొమొఱ్ఱా పట్టణమువలెను అగును. అవి ముండ్లచెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును; నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు; నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించు కొందురు. కాబట్టి ఇశ్రాయేలీయులదేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవావాక్కు ఇదే. 10వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమునుబట్టి యిది వారికి సంభవించును. 11జనముల ద్వీపములలో నివసించు వారందరును తమతమ స్థానములనుండి తనకే నమస్కారము చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును, యెహోవావారికి భయంకరుడుగా ఉండును. 12కూషీయులారా, మీరును నా ఖడ్గముచేత హతులవుదురు. 13ఆయన ఉత్తరదేశముమీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనముచేయును; నీనెవె పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన యెడారివలె చేయును. 14దానిలో పసుల మందలు పండుకొనును; సకలజాతి జంతువులును గుంపులుగా కూడును; గూడబాతులును తుంబోళ్లును వారి ద్వారముల పైకమ్ములమీద నిలుచును; పక్షుల శబ్దములును కిటికీలలో వినబడును; గడపలమీద నాశనము కనుపించును. వారు చేసికొనిన దేవదారు కఱ్ఱపనియంతటిని యెహోవా నాశనము చేయును. 15–నావంటి పట్టణము మరి యొకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే. –అది పాడైపోయెనే, మృగములు పండుకొను స్థలమాయెనే అని దాని మార్గమున పోవువారందరు చెప్పుకొనుచు, ఈసడించుచు పోపొమ్మని చేసైగ చేయుదురు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in