YouVersion Logo
Search Icon

1 కొరింతీ పత్రిక 6

6
విశ్వాసులు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు కోర్టులకు వెళ్ళకూడదు
1మీలో ఒకరితో ఒకరికి వివాదం ఏమైనా ఉంటే అతడు పరిశుద్ధుల ఎదుట కాకుండా అవిశ్వాసి అయిన న్యాయాధిపతి ఎదుట వాదించడానికి పూనుకుంటాడా? 2పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారని మీకు తెలియదా? మీరు ఈ లోకానికి తీర్పు తీర్చవలసి ఉండగా, చిన్న చిన్న విషయాలను పరిష్కరించుకొనే సామర్ధ్యం మీకు లేదా? 3మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు మరి ఈ లోక సంబంధమైన విషయాలను గూర్చి మరి బాగా తీర్పు తీర్చవచ్చు గదా?
4కాబట్టి ఈ లోక సంబంధమైన వివాదాలు మీకు కలిగినపుడు వాటిని పరిష్కరించడానికి సంఘంలో ఎలాటి స్థానం లేని వారి దగ్గరికి వెళ్తారా? 5మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను, తన సోదరీసోదరుల మధ్య వివాదం పరిష్కరించగలిగే బుద్ధిమంతుడు మీలో ఎవరూ లేరా? 6అయితే ఒక సోదరుడు మరొక సోదరుని మీద వ్యాజ్యెమాడుతున్నాడు. అది కూడా అవిశ్వాసి అయిన న్యాయాధికారి ఎదుట!
7అసలు క్రైస్తవుల మధ్య ఒకరితో ఒకరికి వివాదం ఉండడమే మీ అపజయం. దాని కంటే మీరు అన్యాయం సహించడం మంచిది కదా? దానికంటే మీ వస్తువులు పోగొట్టుకోవడం మంచిది కదా? 8అయితే మీరే ఇతరులకు, మీ సోదర సోదరీలకే అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు.
శరీర, వివాహ పవిత్రత
9అవినీతిపరులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోవద్దు. లైంగిక దుర్నీతికి పాలుపడే వారూ, విగ్రహాలను పూజించేవారూ, మగ వేశ్యలు, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులూ, విపరీత సంపర్కం జరిపే వారూ, 10దొంగలూ, దురాశ పరులూ, తాగుబోతులూ, దుర్భాషలాడే వారూ, దోపిడీదారులూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
11గతంలో మీలో కొంతమంది అలాటివారే. అయితే ప్రభు యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మ మిమ్మల్ని కడగడం ద్వారా పవిత్రులై దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు. 12దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు గాని అన్ని విషయాలూ ప్రయోజనకరం కాదు. అన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉంది గాని దేనినీ నన్ను లోపరచుకోనివ్వను.
శరీరం ప్రభువుది
13ఆహార పదార్ధాలు కడుపు కోసమూ, కడుపు ఆహార పదార్ధాల కోసమూ ఉన్నాయి. కానీ దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. శరీరం ఉన్నది లైంగిక దుర్నీతి కోసం కాదు, ప్రభువు కోసమే. ప్రభువే శరీర పోషణ సమకూరుస్తాడు. 14దేవుడు ప్రభువును సజీవంగా లేపాడు. మనలను కూడా తన శక్తితో లేపుతాడు.
15మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? నేను క్రీస్తు అవయవాలను తీసుకుపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా? అలా జరగకూడదు. 16వేశ్యతో కలిసేవాడు దానితో ఏక శరీరం అవుతాడని మీకు తెలియదా? “వారిద్దరూ ఒకే శరీరం అవుతారు” అని లేఖనాలు చెబుతున్నాయి కదా? 17అదే విధంగా, ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకే ఆత్మగా ఉన్నాడు. 18లైంగిక దుర్నీతికి దూరంగా పారిపొండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి గానీ లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.
శరీరం ఆలయం
19మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. 20దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమ పరచండి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in