YouVersion Logo
Search Icon

1 పేతురు పత్రిక 3

3
1భార్యలుగా ఉన్న మీరు మీ భర్తలకు తప్పకుండా లోబడాలి. అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులయినా సరే, మాటలతో కాకుండా, వారి భార్యల ప్రవర్తనే వారిని ప్రభువు కోసం సంపాదిస్తుంది. 2ఎందుకంటే గౌరవ ప్రదమైన మీ పవిత్ర ప్రవర్తన వారు గమనిస్తారు.
3జడలు అల్లుకోవడం, బంగారు ఆభరణాలు, ఖరీదైన బట్టలు అనే బాహ్య అలంకారాలు మీకు వద్దు. 4వాటికి బదులు హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఉండండి. అలాంటి అలంకారం నాశనం కాదు. అది దేవుని దృష్టికి చాలా విలువైనది. 5పూర్వకాలంలో దేవుని మీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు ఈ విధంగా అలంకరించుకున్నారు. వారు తమ భర్తలకు లోబడి ఉంటూ తమ్మును తాము అలంకరించుకున్నారు. 6ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి లోబడి ఉంది. ఏ భయాలకూ లొంగకుండా, మంచి చేస్తూ ఉంటే మీరు ఆమె పిల్లలు.
7అలాగే భర్తలైన మీరు, జీవమనే బహుమానంలో మీ భార్యలు మీతో కూడా వాటాదారులని గ్రహించి, వారు అబలలని ఎరిగి గౌరవపూర్వకంగా వారితో కాపురం చేయండి. ఇలా చేస్తే మీ ప్రార్థనలకు ఆటంకం కలగదు. 8చివరికి మీరంతా మనసులు కలిసి, కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకొంటూ, సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి.
9కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు.
10జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరే వాడు చెడు మాటలు పలకకుండా తన నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి. 11అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి. 12ప్రభువు కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయి. ఆయన చెవులు వారి ప్రార్థనలు వింటాయి. అయితే ప్రభువు ముఖం చెడు చేసేవారికి విరోధంగా ఉంది.
13మీరు మంచి పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేసే వాడెవడు? 14మీరొకవేళ నీతి కోసం బాధ అనుభవించినా మీరు ధన్యులే. వారు భయపడే వాటికి మీరు భయపడవద్దు. కలవరపడవద్దు. 15దానికి బదులు, మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవునిలో మీకున్న ఆశాభావం విషయం అడిగే ప్రతి వ్యక్తికీ సాత్వీకంతో వినయంతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.
16మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో మీకున్న మంచి జీవితాన్ని అపహసించే వారు సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు చెడ్డవారన్నట్టుగా మీకు విరోధంగా వారు మాట్లాడుతున్నారు. 17కీడు చేసి బాధ పడడం కంటే మేలు చేసి బాధ పడటం దేవుని చిత్తమైతే, అదే చాలా మంచిది.
క్రీస్తు ఆత్మ నోవహు దినాల్లో ప్రకటించడం
18క్రీస్తు కూడా పాపాల కోసం ఒక్కసారే చనిపోయాడు. మనలను దేవుని దగ్గరికి తీసుకు రావడానికి, దోషులమైన మన కోసం నీతిమంతుడైన క్రీస్తు చనిపోయాడు. ఆయనను శారీరకంగా చంపారు గానీ దేవుని ఆత్మ ఆయనను బతికించాడు. 19ఇప్పుడు చెరసాల్లో ఉన్న ఆత్మల దగ్గరికి, ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించాడు. 20ఆ ఆత్మలు దేవునికి విధేయత చూపలేదు. పూర్వం నోవహు రోజుల్లో ఓడ తయారవుతూ ఉంటే దేవుడు దీర్ఘశాంతంతో కనిపెట్టిన ఆ రోజుల్లో, ఆ ఓడలో కొద్ది మందినే, అంటే ఎనిమిది మందినే, దేవుడు నీళ్ళ ద్వారా రక్షించాడు.
21దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంది. అది ఒంటి మీద మురికి వదిలించుకున్నట్టు కాదు, అది యేసు క్రీస్తు పునరుత్థానం ద్వారా దేవునికి మనస్సాక్షితో చేసే అభ్యర్ధనే. 22ఆయన పరలోకానికి వెళ్ళాడు. దేవుని కుడి వైపున ఉన్నాడు. దూతలూ, అధికారులూ, శక్తులు, అన్నీ ఆయనకు లోబరచబడినాయి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in