YouVersion Logo
Search Icon

1 సమూ 16

16
సమూయేలు దావీదును అభిషేకించడం
1యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు “ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను తిరస్కరించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్మును నూనెతో నింపు, బేత్లెహేముకు చెందిన యెష్షయి దగ్గరకి నిన్ను పంపిస్తున్నాను. అతని కొడుకుల్లో ఒకడిని నేను రాజుగా ఎంపిక చేశాను.”
2అందుకు సమూయేలు “నేనెలా వెళ్ళగలను? నేను వెళ్లిన సంగతి సౌలుకు తెలిస్తే అతడు నన్ను చంపేస్తాడు” అన్నాడు. యెహోవా “నువ్వు ఒక లేగ దూడను తీసుకువెళ్ళి యెహోవాకు బలి అర్పించడానికి వచ్చానని చెప్పి, 3యెష్షయిని బలి అర్పణ చేసే చోటికి పిలిపించు. అప్పుడు నువ్వు ఏమి చేయాలో నీకు చెబుతాను. ఎవరి పేరు నేను నీకు సూచిస్తానో అతణ్ణి నువ్వు అభిషేకించాలి” అని చెప్పాడు.
4సమూయేలు యెహోవా సెలవిచ్చినట్టు బేత్లెహేముకు బయలుదేరాడు. ఆ ఊరి పెద్దలు అతడు రావడం చూసి భయపడి “నువ్వు శాంతంగానే వస్తున్నావా?” అని అడిగినప్పుడు, 5అతడు “శాంతంగానే వచ్చాను. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని నాతో కలసి బలికి రండి” అని చెప్పి యెష్షయిని, అతని కొడుకులను శుద్ధి చేసి బలి అర్పించాడు.
6వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూసి “నిజంగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడు” అని అనుకున్నాడు. 7అయితే యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు. “అతడి అందాన్నీ ఎత్తునూ చూడవద్దు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతణ్ణి నిరాకరించాను. మనుషులు పైరూపాన్ని చూస్తారు గానీ యెహోవా అయితే హృదయాన్ని చూస్తాడు.”
8యెష్షయి అబీనాదాబును పిలిచి అతణ్ణి సమూయేలు ముందు నిలబెట్టగా, అతడు “యెహోవా ఇతణ్ణి ఎన్నుకోలేదు” అన్నాడు. 9అప్పుడు యెష్షయి షమ్మాను పిలిచి నిలబెట్టినప్పుడు సమూయేలు “యెహోవా ఇతణ్ణి ఎన్నుకోలేదు” అన్నాడు. 10యెష్షయి తన ఏడుగురు కొడుకులనూ సమూయేలు ముందుకి రప్పించాడు. సమూయేలు “యెహోవా వీరిలో ఎవరినీ ఎన్నుకోలేదు” అని చెప్పి, 11“నీ కొడుకులందరూ ఇక్కడే ఉన్నారా?” అని యెష్షయిని అడిగాడు. అతడు “ఇంకా చివరివాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను మేపడానికి వెళ్ళాడు” అని చెప్పాడు. అందుకు సమూయేలు “నువ్వు అతనికి కబురు పంపి ఇక్కడికి రప్పించు. అతడు వచ్చేదాకా మనం కూర్చోలేం కదా” అని యెష్షయితో చెప్పాడు.
12యెష్షయి అతణ్ణి పిలిపించి లోపలికి తీసుకువచ్చాడు. అతడు రూపంలో ఎర్రని వాడు, చక్కని కళ్ళు కలిగి చూపులకు అందమైనవాడు. అతడు రాగానే “నేను కోరుకొన్నది ఇతడే, నీవు లేచి అతణ్ణి అభిషేకించు” అని యెహోవా చెప్పగానే, 13సమూయేలు నూనె కొమ్మును తీసి అతని తలపై నూనె పోసి అతని అన్నల ముందు అతణ్ణి అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదును తీవ్రంగా ఆవహించాడు. తరువాత సమూయేలు లేచి రమాకు వెళ్లిపోయాడు.
సౌలు ఇంటిలో దావీదు
14యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిన తరువాత యెహోవా దగ్గర నుండి ఒక దురాత్మ అతణ్ణి భయపెట్టి, వేధించడం మొదలుపెట్టింది, 15సౌలు సేవకులు “దేవుని దగ్గర నుండి వచ్చిన దురాత్మ నిన్ను భయపెడుతున్నది. 16నీ సేవకులమైన మాతో చెప్పు, దేవుని దగ్గర నుండి దురాత్మ నిన్ను వేధిస్తూ ఉన్నప్పుడు దాని నుండి ఉపశమనం పొందడానికి తంతివాద్యం చక్కగా వాయించగల ఒకణ్ణి వెదుకుతాం. దురాత్మ వచ్చి నిన్ను వేధించినప్పుడల్లా అతడు తంతివాద్యం వాయించడం వల్ల నువ్వు బాగుపడతావు” అని సౌలుతో అన్నారు.
17అప్పుడు సౌలు “బాగా వాయించగల ఒకణ్ణి వెతికి నా దగ్గరికి తీసికురండి” అని వారితో చెప్పాడు. 18వారిలో ఒకడు “బేత్లెహేము వాడైన యెష్షయి కొడుకుల్లో ఒకణ్ణి చూశాను, అతడు చక్కగా వాయించగలడు, అతడు ధైర్యవంతుడు, యుద్ధవీరుడు, మాటకారి, అందగాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కూడా” అని చెప్పాడు. 19సౌలు యెష్షయి దగ్గరకి తన సేవకులను పంపి “గొర్రెలు కాస్తున్న నీ కొడుకు దావీదును నా దగ్గరకి పంపించు” అని కబురు చేశాడు.
20అప్పుడు యెష్షయి ఒక గాడిదపై రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తి, ఒక మేకపిల్లను ఉంచి దావీదు ద్వారా సౌలుకు పంపించాడు. 21దావీదు సౌలు దగ్గరకి వచ్చి అతని ముందు నిలబడినపుడు అతడు సౌలుకు బాగా నచ్చాడు. అతణ్ణి సౌలు ఆయుధాలు మోసే పనిలో పెట్టారు.
22అప్పుడు సౌలు “దావీదు నాకు బాగా నచ్చాడు కాబట్టి అతణ్ణి నా సముఖంలో నిలిచి ఉండడానికి ఒప్పుకో” అని యెష్షయికి కబురు పంపాడు. 23దేవుని నుండి దురాత్మ వచ్చి సౌలును వేధించినప్పుడల్లా దావీదు తంతి వాద్యం వాయించేవాడు. అప్పుడు దురాత్మ అతణ్ణి విడిచిపోయేది. అతడు కోలుకుని నెమ్మది పొందేవాడు.

Currently Selected:

1 సమూ 16: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in