YouVersion Logo
Search Icon

2 దిన 1

1
జ్ఞనం కోసం సొలొమోను దేవునికి ప్రార్థన
1:2-13; 1రాజులు 3:4-15
1:14-17; 1రాజులు 10:26-29; 2దిన 9:25-28
1దావీదు కుమారుడు సొలొమోను తన పరిపాలనలో చక్కగా స్థిరపడ్డాడు. అతని దేవుడు యెహోవా అతనికి తోడుగా ఉండి అతణ్ణి చాలా శక్తిశాలిగా చేశాడు.
2సొలొమోను దాని గురించి ఇశ్రాయేలీయులందరికీ అంటే సహస్రాధిపతులతో శతాధిపతులతో న్యాయాధిపతులతో ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలతో మాట్లాడాడు. 3అప్పుడు వారంతా సొలొమోనుతో కలసి గిబియోనులో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళారు. యెహోవా సేవకుడు మోషే అరణ్యంలో చేయించిన దేవుని ప్రత్యక్ష గుడారం గిబియోనులో ఉంది.
4దావీదు రాజుగా ఉన్నప్పుడు అతడు దేవుని మందసాన్ని కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేములో తాను సిద్ధం చేసిన చోట గుడారం వేసి అక్కడ ఉంచాడు. 5అక్కడ యెహోవా నివాసస్థలం ముందు హూరు మనవడు ఊరీ కొడుకు బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠం ఉంది. సొలొమోను, సమాజం వారంతా దాని దగ్గర విచారణ చేశారు. 6సొలొమోను ప్రత్యక్ష గుడారం దగ్గర యెహోవా సన్నిధి లోని ఇత్తడి బలిపీఠం దగ్గరకి వెళ్లి దాని మీద వెయ్యి దహనబలులు అర్పించాడు.
7ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. “నేను నీకు ఏమి ఇవ్వాలో అడుగు” అన్నాడు.
8సొలొమోను దేవునితో ఇలా మనవి చేశాడు. “నీవు నా తండ్రి దావీదు మీద ఎంతో నిబంధన కృప చూపించి అతని స్థానంలో నన్ను రాజుగా నియమించావు. 9కాబట్టి యెహోవా దేవా, నీవు నా తండ్రి దావీదుకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు. నేల ధూళి వలే ఉన్న విస్తారమైన ప్రజలకు నీవు నన్ను రాజును చేశావు. 10ఇంత గొప్ప జన సమూహానికి న్యాయం తీర్చే శక్తి ఎవరికుంది? నేను ఈ ప్రజల మధ్య పనులు చక్కపెట్టడానికి సరిపడిన జ్ఞానమూ తెలివీ నాకు దయచెయ్యి.”
11అందుకు దేవుడు సొలొమోనుతో ఇలా అన్నాడు. “నీవు ఈ విధంగా ఆలోచించి, ఐశ్వర్యాన్నీ ధనాన్నీ ఘనతనీ నీ శత్రువుల ప్రాణాన్నీ దీర్ఘాయుష్షునూ అడగకుండా, నేను ఎవరి మీదైతే నిన్ను రాజుగా నియమించానో ఆ నా ప్రజలకి న్యాయం తీర్చడానికి కావలసిన జ్ఞానాన్నీ తెలివినీ అడిగావు. 12కాబట్టి జ్ఞానం, తెలివీ రెండూ నీకిస్తాను. అంతేగాక నీకు ముందు గానీ, నీ తరవాత గానీ వచ్చే రాజులకెవరికీ లేనంత ఐశ్వర్యాన్నీ ధనాన్నీ గొప్ప పేరునూ నీకిస్తాను.” 13తరువాత సొలొమోను గిబియోనులో ఉన్న సమాజపు గుడారం ముందున్న బలిపీఠం దగ్గర నుంచి యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలీయులను పరిపాలించసాగాడు.
14సొలొమోను, రథాలనూ గుర్రపు రౌతులనూ సమకూర్చుకున్నాడు. అతనికి 1, 400 రథాలుండేవి. 12,000 గుర్రపు రౌతులూ ఉండేవారు. వీటిలో కొన్నిటిని రథాలుండే పట్టణాల్లో, కొన్నిటిని తన దగ్గర ఉండటానికి యెరూషలేములో ఉంచాడు. 15రాజు యెరూషలేములో వెండి బంగారాలను రాళ్ళ వలె విస్తారంగా, సరళ మాను కలపను కొండ ప్రాంతాల్లో దొరికే మేడిచెట్లంత విస్తారంగా పోగుచేశాడు.
16సొలొమోను తన గుర్రాలను ఐగుప్తు నుండీ కవే ప్రాంతం నుండీ తెప్పించాడు. రాజు పంపిన వర్తకులు తగిన ధర చెల్లించి కవే ప్రాంతం నుండి వాటిని తెచ్చారు. 17వారు ఐగుప్తు నుండి తెచ్చిన రథం ఒక్కదానికి 600 తులాల వెండినీ, గుర్రం ఒక్కదానికి 150 తులాల వెండినీ ధరగా చెల్లించారు. వారు వాటిని హిత్తీయులకూ, సిరియా రాజులకూ కూడా ఎగుమతి చేశారు.

Currently Selected:

2 దిన 1: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in