YouVersion Logo
Search Icon

2 దిన 10

10
రెహబాము రాజు
10:1-11:4; 1రాజులు 12:1-24
1రెహబాముకు పట్టాభిషేకం చేయడానికి ఇశ్రాయేలీయులంతా షెకెముకు చేరుకున్నారు. రెహబాము షెకెముకు వెళ్ళాడు. 2సొలొమోను రాజు దగ్గర నుండి పారిపోయి ఐగుప్తులో నివసిస్తున్న నెబాతు కొడుకు యరొబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి వచ్చాడు. 3ప్రజలు అతణ్ణి పిలిపించగా యరొబాము, ఇశ్రాయేలువారు కలిసి వచ్చి రెహబాముతో “నీ తండ్రి మా కాడిని బరువుగా చేశాడు. 4నీ తండ్రి నియమించిన కఠిన దాస్యాన్ని, అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నువ్వు ఇప్పుడు తేలికగా చేస్తే మేము నిన్ను సేవిస్తాము” అని మనవి చేశారు.
5అందుకు అతడు “మీరు మూడు రోజుల తరవాత నా దగ్గరికి రండి” అని వారితో చెప్పాడు. కాబట్టి ప్రజలు వెళ్లిపోయారు. 6అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను జీవించి ఉండగా అతని ముందు నిలిచి సేవ చేసిన పెద్దలను పిలిపించి “ఈ ప్రజలకు నన్నేమి జవాబు చెప్పమంటారు? మీ సలహా ఏమిటి?” అని వారిని అడిగాడు. 7అందుకు వారు “నువ్వు ఈ ప్రజల పట్ల దయాదాక్షిణ్యాలు చూపి వారితో మృదువుగా మాట్లాడితే వారు ఎప్పటికీ నీకు దాసులుగా ఉంటారు” అని అతనితో చెప్పారు.
8అయితే అతడు ఆ పెద్దలు తనకు చెప్పిన ఆలోచన తోసిపుచ్చి, తనతో పెరిగి తన దగ్గర ఉన్న యువకులతో ఆలోచన చేశాడు. 9అతడు “‘నీ తండ్రి మామీద ఉంచిన కాడిని తేలిక చెయ్యి’ అని నన్నడిగిన ఈ ప్రజలకి నేనేం జవాబు చెప్పాలని మీరు ఆలోచిస్తారో చెప్పండి” అని వారిని అడిగాడు. 10అతనితో కూడా పెరిగిన ఆ యువకులు అతనితో ఇలా అన్నారు “‘నీ తండ్రి మా కాడిని బరువు చేశాడు, నువ్వు దాన్ని తేలిక చెయ్యి’ అని నిన్ను అడిగిన ఈ ప్రజలతో నువ్వేమి చెప్పాలంటే, ‘నా చిటికెన వ్రేలు నా తండ్రి నడుము కంటే బరువు. 11నా తండ్రి బరువైన కాడి మీమీద మోపాడు గాని నేను మీ కాడిని మరింత బరువు చేస్తాను. నా తండ్రి చెర్నాకోలతో మిమ్మల్ని దండించాడు. నేనైతే మిమ్మల్ని కొరడాలతో#10:11 కొరడాలతో తేళ్ళతో దండిస్తాను’ అని చెప్పు.”
12“మూడవ రోజున నా దగ్గరికి తిరిగి రండి” అని రాజు చెప్పిన ప్రకారం యరొబాము, ప్రజలు మూడో రోజున రెహబాము దగ్గరకి వచ్చారు. 13రెహబాము పెద్దలు చెప్పిన ఆలోచనను త్రోసిపుచ్చి, యువకులు చెప్పిన ప్రకారం వారితో కఠినంగా జవాబిచ్చాడు. 14అతడు వారితో “నా తండ్రి మీ కాడిని బరువు చేశాడు,
నేను దాన్ని మరింత బరువు చేస్తాను.
నా తండ్రి మిమ్మల్ని చెర్నాకోలతో దండించాడు.
నేనైతే మిమ్మల్ని కొరడాలతో#10:14 కొరడాలతో తేళ్ళతో దండిస్తాను” అని చెప్పాడు.
15యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కొడుకు యరొబాముతో చెప్పిన తన మాటను స్థిరపరచేలా దేవుని నిర్ణయ ప్రకారం ప్రజలు చేసిన మనవి రాజు ఆలకించలేదు. 16రాజు తమ మనవి అంగీకరించక పోవడం చూసి ఇశ్రాయేలు ప్రజలు, “దావీదులో మాకు భాగమెక్కడ ఉంది? యెష్షయి కుమారుడిలో మాకు వారసత్వం లేదు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ గుడారాలకి వెళ్ళిపోండి. దావీదూ, నీ సంతతి వారిని నువ్వే చూసుకో” అని రాజుతో చెప్పి ఎవరి గుడారానికి వారు వెళ్లిపోయారు.
17అయితే యూదా పట్టణాల్లో నివసించే ఇశ్రాయేలు వారిని రెహబాము పరిపాలించాడు. 18రెహబాము రాజు వెట్టి పనివారి మీద అధికారి అయిన హదోరాముని ఇశ్రాయేలు వారి దగ్గరకి పంపించాడు. కానీ వారు అతణ్ణి రాళ్లతో చావగొట్టారు. అప్పుడు రెహబాము రాజు త్వరగా తన రథం ఎక్కి యెరూషలేముకు పారిపోయాడు. 19ఇశ్రాయేలు వారు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి ఇప్పటికీ వారికి లోబడకుండా ఉన్నారు.

Currently Selected:

2 దిన 10: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in