YouVersion Logo
Search Icon

2 దిన 2

2
దేవాలయం నిర్మాణానికి ఏర్పాట్లు
2:1-18; 1రాజులు 5:1-16
1సొలొమోను యెహోవా ఘనత కోసం ఒక దేవాలయాన్నీ తన రాజ్య ఘనత కోసం ఒక అంతఃపురాన్నీ కట్టాలని నిర్ణయించుకున్నాడు. 2అందుకు బరువులు మోసేవారు 70,000 మందినీ, కొండల మీద చెట్లు కొట్టడానికి 80,000 మందినీ ఏర్పాటు చేసి వారిని అజమాయిషీ చేయడానికి 3, 600 మందిని ఉంచాడు.
3అతడు తూరు రాజు హీరాం#2:3 హీరాం హురాం దగ్గరికి దూతల ద్వారా ఈ సందేశం పంపించాడు. “నా తండ్రి దావీదు తన నివాసం కోసం ఒక భవనం నిర్మించాలని అనుకున్నప్పుడు నువ్వు అతనికి దేవదారు కలపను సిద్ధం చేసి పంపించినట్టు దయచేసి నాకు కూడా ఇప్పుడు పంపించు. 4నా దేవుడైన యెహోవా ఘనత కోసం ఆయనకు ప్రతిష్టించాలని నేను ఒక దేవాలయాన్ని కట్టించబోతున్నాను. ఆయన సన్నిధిలో సుగంధ ద్రవ్యాలతో ధూపం వేయడానికీ సన్నిధి రొట్టెలను ఎప్పుడూ ఉంచడానికీ ఉదయం, సాయంత్రం, విశ్రాంతి దినాల్లో, అమావాస్య దినాల్లో, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవాల్లో, ఇశ్రాయేలీయులు ఎప్పుడూ అర్పించాల్సిన దహనబలులు అర్పించడానికీ ఆలయం కట్టిస్తున్నాను.
5మా దేవుడు ఇతర దేవుళ్ళందరి కంటే గొప్పవాడు కాబట్టి నేను కట్టించే దేవాలయం చాలా ఘనంగా ఉంటుంది. 6అయితే ఆకాశాలూ మహాకాశాలూ కూడా ఆయనకు సరిపోవు. ఆయనకి దేవాలయం ఎవరు కట్టించగలరు? ఆయనకి దేవాలయం కట్టించడానికి నా స్థాయి ఎంత? ఆయన ముందు ధూపం వేయడం కోసమే నేను ఆయనకు దేవాలయం కట్టించాలని పూనుకున్నాను.
7కాబట్టి నా తండ్రి దావీదు నియమించి, యూదా దేశంలో, యెరూషలేములో నా దగ్గర ఉంచిన నిపుణులకు సహాయకుడిగా ఉండి బంగారం, వెండి, ఇత్తడి, ఇనుములతో, ఊదా నూలుతో, ఎర్ర నూలుతో, నీలి నూలుతో చేసే పనులు, అన్ని రకాల చెక్కడపు పనుల్లో నైపుణ్యం గల వ్యక్తిని నా దగ్గరకి పంపించు.
8ఇంకా లెబానోనులో చెట్లు నరకడానికి నీ పనివారు నిపుణులు అని నాకు తెలిసింది. 9కాబట్టి లెబానోను నుండి సరళ మాను కలప, దేవదారు కలప, గంధపు చెక్కలు పంపించు. నేను కట్టించబోయే దేవాలయం చాల గొప్పదిగా, అద్భుతంగా ఉంటుంది కాబట్టి నాకు కలప విస్తారంగా సిద్ధపరచడానికి నా సేవకులు, నీ సేవకులు కలిసి పని చేస్తారు. 10కలప కోసే నీ పనివారికి ఆహారంగా రెండు లక్షల తూముల గోదుమ పిండి, రెండు లక్షల తూముల బార్లీ, నాలుగు లక్షల నలభై వేల లీటర్ల ద్రాక్షారసమూ నాలుగు లక్షల నలభై వేల లీటర్ల నూనే ఇస్తాను.”
11దానికి జవాబుగా తూరు రాజు హీరాము సొలొమోనుకు ఉత్తరం రాసి పంపించాడు. “యెహోవా తన ప్రజలను ప్రేమించి నిన్ను వారి మీద రాజుగా నియమించాడు. 12యెహోవా ఘనత కోసం ఒక దేవాలయాన్నీ నీ రాజ్య ఘనత కోసం ఒక నగరాన్నీ కట్టించడానికి తగిన జ్ఞానమూ తెలివీ గల బుద్ధిమంతుడైన కుమారుణ్ణి దావీదు రాజుకి దయచేసిన, భూమ్యాకాశాల సృష్టికర్తా ఇశ్రాయేలీయుల దేవుడూ అయిన యెహోవాకు స్తుతి కలుగు గాక. 13తెలివీ వివేచనా గలిగిన హూరామబీ అనే చురుకైన పనివాణ్ణి నీ దగ్గరికి పంపుతున్నాను. 14అతడు దాను గోత్రానికి చెందిన స్త్రీకి పుట్టినవాడు. అతని తండ్రి తూరు దేశానికి చెందినవాడు. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో, ఇనుముతో, రాళ్ళతో, కలపతో, నేరేడు రంగు నూలుతో నీలి నూలుతో, సన్నని నూలుతో, ఎర్ర నూలుతో, పని చేసే నైపుణ్యం ఉన్నవాడు. అన్ని రకాల కలప పనిలో, మచ్చులు కల్పించడంలో చెయ్యి తిరిగినవాడు. అతడు నీ పనివారికీ, నీ తండ్రీ నా ప్రభువూ అయిన దావీదు నియమించిన నిపుణులకీ సహాయకుడుగా ఉండడానికి సమర్ధుడు.
15ఇప్పుడు నా ప్రభువైన నువ్వు చెప్పినట్టే గోదుమలూ యవలూ నూనే ద్రాక్షారసమూ నీ సేవకులతో పంపించు. 16మేము నీకు కావలసిన కలపను లెబానోనులో కొట్టించి వాటిని తెప్పలుగా కట్టి సముద్రం మీద యొప్పే వరకూ తెస్తాము. తరువాత నువ్వు వాటిని యెరూషలేముకు తెప్పించుకోవచ్చు” అని జవాబిచ్చాడు.
17సొలొమోను దేశంలోని అన్యజాతుల వారినందరినీ తన తండ్రి దావీదు వేయించిన అంచనా ప్రకారం వారిని లెక్కించినప్పుడు వారు 1, 53, 600 అయ్యారు. 18వీరిలో బరువులు మోయడానికి 70,000 మందినీ కొండలపై చెట్లు నరకడానికి 80,000 మందినీ వారి పైన అజమాయిషీ చేయడానికి 3, 600 మందినీ అతడు నియమించాడు.

Currently Selected:

2 దిన 2: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in