YouVersion Logo
Search Icon

2 దిన 4

4
మందిరపు ఉపకరణాలు
4:2-6, 10; 5:1; 1రాజులు 7:23-26, 38-51
1సొలొమోను ఇరవై మూరలు పొడవు, ఇరవై మూరలు వెడల్పు, పది మూరలు ఎత్తు ఉన్న ఒక ఇత్తడి బలిపీఠం చేయించాడు. 2పోత పోసిన గుండ్రటి సరస్సు గంగాళం కూడా ఒకటి చేయించాడు. అది ఆ చివరినుండి ఈ చివరి వరకూ 10 మూరల వెడల్పు. దాని ఎత్తు ఐదు మూరలు. దాని చుట్టుకొలత 30 మూరలు. 3దాని కింద ఎద్దుల రూపాలు ఒక్కొక్క మూరకు 10 చొప్పున ఆ సముద్రపు తొట్టిని ఆవరించి ఉన్నాయి. ఆ ఎద్దులను రెండు వరసల్లో నిలబెట్టి ఆ తొట్టితో సహా పోత పోశారు.
4అది 12 ఎద్దుబొమ్మల మీద నిలబడింది. మూడు ఎద్దులు ఉత్తరం వైపు, మూడు పడమర వైపు, మూడు దక్షిణం వైపు, మూడు తూర్పు వైపుకు ఉన్నాయి. ఆ సరస్సు తొట్టిని వాటి పైన నిలబెట్టారు. వాటి వెనక భాగాలు అన్నీ లోపలికి తిరిగి ఉన్నాయి. 5దాని మందం బెత్తెడు. దాని అంచు ఒక గిన్నె అంచులాగా ఉండి తామరపువ్వును పోలి ఉంది. దానిలో దాదాపు 66,000 లీటర్ల నీరు పడుతుంది.
6సొలొమోను ఇంకా దహనబలులుగా అర్పించే వాటిని కడగటానికి కుడివైపున ఐదు, ఎడమ వైపున ఐదు మొత్తం పది స్నానపు గంగాళాలు చేయించాడు. అయితే సరస్సు తొట్టిలోని నీళ్ళతో కేవలం యాజకులు మాత్రమే తమను శుద్ధి చేసుకుంటారు.
7అతడు తనకు అందిన నమూనా సూచనల ప్రకారం పది బంగారు దీపస్తంభాలను చేయించి, దేవాలయంలో కుడివైపు ఐదు, ఎడమవైపు ఐదు నిలబెట్టాడు. 8అలాగే 10 బల్లలు చేయించి దేవాలయంలో కుడి వైపు ఐదు, ఎడమ వైపు ఐదు ఉంచాడు. అతడు 100 బంగారు తొట్లు చేయించాడు. 9అతడు యాజకులకు ఒక ఆవరణనూ ఇతరులకి దానికంటే విశాలమైన ఆవరణనూ తలుపులతో సహా చేయించి ఆ తలుపులను ఇత్తడితో పొదిగించాడు. 10సరస్సు తొట్టిని తూర్పు వైపున కుడి పక్కగా ముఖాన్ని దక్షిణం వైపుకు తిప్పి ఉంచాడు.
11హూరాము పాత్రలనూ బూడిదెనూ ఎత్తడానికి చేటలనూ తొట్లనూ చేశాడు. సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం దేవుని మందిరానికి చేయాల్సిన పనంతా హూరాము పూర్తి చేశాడు. 12దాని వివరాలు, రెండు స్తంభాలు, వాటి పళ్ళాలు, వాటి పైన ఉంచడానికి పీటలు, వాటి పళ్ళాలు, ఆ స్తంభాల పైన రెండు పళ్లాలను కప్పడానికి రెండు అల్లికలు, 13ఆ స్తంభాల పైన రెండు పళ్లాలను కప్పే అల్లిక, దానికి రెండేసి వరసల్లో నాలుగు వందల దానిమ్మ పండ్లు. 14మట్లు, వాటిపైన తొట్టెలు, 15సరస్సు తొట్టి, దాని కింద ఉన్న పన్నెండు ఎద్దులు, 16పాత్రలు, బూడిద ఎత్తడానికి చేటలు, ముండ్ల కొంకులు మొదలైనవి. వీటిని హూరాము సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం యెహోవా మందిరం కోసం మిలమిల మెరిసే ఇత్తడితో చేశాడు.
17రాజు వాటిని యొర్దాను మైదానంలో సుక్కోతుకు జెరేదాతాకు మధ్య బంకమట్టి నేలలో పోత పోయించాడు. 18తన దగ్గర ఉన్న తూయలేనంత ఇత్తడితో సొలొమోను ఈ వస్తువులను పెద్ద సంఖ్యలో చేయించాడు. 19దేవుని మందిరానికి కావలసిన వస్తువులూ బంగారు పీఠమూ సన్నిధి రొట్టెలు ఉంచే బల్లలూ, 20వాటి గురించి అతడు పొందిన సూచనల ప్రకారం గర్భగుడి ముందు వెలుగుతూ ఉండడానికి ప్రశస్తమైన బంగారు దీపస్తంభాలూ, 21పుష్పాలూ, ప్రమిదలూ కత్తెరలూ పట్టుకారులూ తొట్టెలూ గిన్నెలూ ధూపకలశాలూ వీటన్నిటినీ సొలొమోను మేలిమి బంగారంతో చేయించాడు. 22మందిర ద్వారం లోపలి తలుపులూ అతి పరిశుద్ధ స్థలం లోపలి తలుపులూ దేవాలయపు తలుపులూ అన్నీ బంగారంతో చేయించాడు.

Currently Selected:

2 దిన 4: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in