YouVersion Logo
Search Icon

2 దిన 7

7
దేవాలయం ప్రతిష్ట
7:1-10; 1రాజులు 8:62-66
1సొలొమోను తన ప్రార్థన ముగించగానే ఆకాశం నుండి అగ్ని దిగి దహనబలులనూ ఇతర బలులనూ దహించివేసింది. యెహోవా తేజస్సు మందిరాన్ని పూర్తిగా నింపింది. 2యెహోవా తేజస్సుతో మందిరం నిండిపోవడం వలన యాజకులు అందులో ప్రవేశించలేక పోయారు.
3అగ్నీ యెహోవా తేజస్సూ మందిరం పైకి దిగటం చూసి ఇశ్రాయేలీయులంతా సాష్టాంగ నమస్కారం చేసి “యెహోవా దయ గలవాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది” అంటూ ఆయనను ఆరాధించి స్తుతించారు. 4రాజూ, ప్రజలూ కలిసి యెహోవా ముందు బలులు అర్పించారు. 5సొలొమోను రాజు 22,000 పశువులనూ 1, 20,000 గొర్రెలనూ బలులుగా అర్పించాడు. రాజు, ప్రజలు, అందరూ కలిసి దేవుని మందిరాన్ని ప్రతిష్టించారు. 6యాజకులు తమ తమ సేవా స్థలాల్లో నిలిచారు. లేవీయులు “యెహోవా కృప నిత్యమూ నిలుస్తుంది” అంటూ దేవుణ్ణి స్తుతించడానికి దావీదు ఏర్పాటు చేసిన యెహోవా గీతాలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. యాజకులు వారికి ఎదురుగా నిలబడి బూరలు ఊదుతూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలంతా నిలబడి ఉన్నారు.
7సొలొమోను తాను చేయించిన ఇత్తడి బలిపీఠం దహనబలులకూ నైవేద్యాలకూ కొవ్వుకూ సరిపోక పోవడం వలన యెహోవా మందిరం ముందు ఉన్న మధ్య ఆవరణాన్ని ప్రతిష్ఠించి, అక్కడ దహనబలులనూ శాంతి బలిపశువుల కొవ్వునూ అర్పించాడు. 8సొలొమోను, అతనితో కూడా హమాతు సరిహద్దు నుండి ఐగుప్తు నది వరకూ ఉన్న దేశం నుండి గొప్ప సమూహంగా వచ్చిన ఇశ్రాయేలీయులందరూ ఏడు రోజులు పండగ ఆచరించారు. 9ఎనిమిదో రోజు వారు పండగ ముగించారు. ఏడు రోజులూ బలిపీఠాన్ని ప్రతిష్టిస్తూ పండగ ఆచరించారు.
10ఏడవ నెల ఇరవై మూడో రోజున సొలొమోను దావీదుకు, తనకు, తన ప్రజలు ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన మేలుల విషయంలో సంతోషిస్తూ, మనసులో ఆనందపడుతూ, ఎవరి గుడారాలకు వారిని వెళ్ళమని ప్రజలకి అనుమతినిచ్చి పంపేశాడు.
దేవుడు సొలొమోనుకు కనిపించడం
7:11-22; 1రాజులు 9:1-9
11ఆ విధంగా సొలొమోను యెహోవా మందిరాన్ని, రాజనగరాన్ని కట్టించి, యెహోవా మందిరంలో, తన నగరంలో చేయాలని తాను ఆలోచించిన దానంతటినీ ఏ లోపమూ లేకుండా నెరవేర్చి పని ముగించాడు.
12అప్పుడు యెహోవా రాత్రి వేళ సొలొమోనుకు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పాడు “నేను నీ విన్నపాన్ని అంగీకరించి ఈ స్థలాన్ని నాకు బలులు అర్పించే మందిరంగా కోరుకున్నాను. 13నేను ఆకాశాన్ని మూసివేసి వాన కురవకుండా చేసినప్పుడూ, దేశాన్ని నాశనం చేయడానికి మిడతలకు సెలవిచ్చినప్పుడూ, నా ప్రజల మీదికి తెగులు రప్పించినప్పుడూ, 14నా పేరు పెట్టుకున్న నా ప్రజలు తమని తాము తగ్గించుకుని, ప్రార్థన చేసి, నన్ను వెతికి, తమ దుష్టత్వాన్ని విడిచి నన్ను వేడుకుంటే, నేను పరలోకం నుండి వారి ప్రార్థన విని, వారి పాపాన్ని క్షమించి, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. 15ఈ స్థలం లో చేసే ప్రార్థన మీద నా దృష్టి ఉంటుంది, నా చెవులు దాన్ని వింటాయి. 16నా పేరు ఈ మందిరానికి నిత్యమూ ఉండేలా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచాను. నా కనులు, నా మనస్సు నిత్యం దాని మీద ఉంటాయి. 17నీ తండ్రి దావీదు నడుచుకున్నట్టు నువ్వు కూడా నాకు అనుకూలంగా ప్రవర్తించి, నేను నీకాజ్ఞాపించిన దానంతటినీ జరిగించి, నా కట్టడలనీ నా న్యాయవిధులనీ అనుసరిస్తే, 18ఇశ్రాయేలీయులను పాలించడానికి నీ సంతతి వాడు ఒకడు నీకుండకుండా పోడు, అని నేను నీ తండ్రి దావీదుతో చేసిన నిబంధనను అనుసరించి నేను నీ రాజ్య సింహాసనాన్ని స్థిరపరుస్తాను.
19అయితే మీరు దారి తొలగి, నేను మీకు నియమించిన కట్టడలనూ ఆజ్ఞలనూ విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళను అనుసరించి వాటిని పూజిస్తే, 20నేను మీకిచ్చిన నా దేశంలోనుండి మిమ్మల్ని పెళ్ళగించి, నా నామం కోసం నేను పరిశుద్ధపరచిన ఈ మందిరాన్ని నా సన్నిధి నుండి తీసేసి, సమస్త జాతుల్లో దాన్ని సామెతకు, ఎగతాళికీ కారణంగా చేస్తాను. 21అప్పుడు గొప్ప పేరు పొందిన ఈ మందిరం పక్కగా వెళ్ళేవారంతా విస్మయం చెంది, ‘యెహోవా ఈ దేశానికీ మందిరానికీ ఎందుకిలా చేశాడు?’ అని అడుగుతారు. 22అప్పుడు మనుషులు, ‘ఈ దేశ ప్రజలు తమ పూర్వికులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన తమ దేవుడు యెహోవాను విసర్జించి ఇతర దేవుళ్ళను వెంబడించి వాటిని పూజించారు కాబట్టి యెహోవా ఈ విపత్తునంతటినీ వారిమీదకి రప్పించాడు’ అని చెబుతారు.”

Currently Selected:

2 దిన 7: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in