YouVersion Logo
Search Icon

2 దిన 8

8
సొలొమోను ఇతర ఘన కార్యాలు
8:1-8; 1రాజులు 9:10-28
1సొలొమోను యెహోవా మందిరాన్ని, తన అంతఃపురాన్నీ కట్టించడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఆ తరవాత 2హీరాము తనకిచ్చిన పట్టణాలను సొలొమోను తిరిగి కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులు నివాసం ఉండేలా చేశాడు.
3తరువాత సొలొమోను హమాతుసొబా పై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 4అరణ్య ప్రాంతంలో ఉండే తద్మోరుకు, హమాతు దేశంలో ఖజానా ఉంచే పట్టణాలన్నిటికీ ప్రాకారాలు కట్టించాడు. 5ఇంకా అతడు ఎగువ బేత్‌ హోరోను, దిగువ బేత్‌ హోరోను పట్టణాలకి ప్రాకారాలు, ద్వారాలు, అడ్డగడలు కట్టించాడు. 6బాలాతునూ, తనకున్న ధాన్యం నిలవచేసే ఊళ్ళనూ, తన రథాలు, గుర్రపు రౌతులు ఉండడానికి పట్టణాలనూ కట్టించాడు. ఇంకా యెరూషలేములో, లెబానోనులో, తాను పాలించే దేశాలన్నిటిలో తనకు నచ్చిన రీతిలో పట్టాణాలన్నిటినీ సొలొమోను కట్టించాడు.
7ఇశ్రాయేలీయులకు చెందని హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వారందరిలో మిగిలి ఉన్న వారిని 8ఇశ్రాయేలీయులు నాశనం చేయకుండా విడిచిపెట్టిన వివిధ జాతుల ప్రజలనూ సొలొమోను ఇప్పటి వరకూ తనకు కట్టు బానిసలుగా చేసుకున్నాడు.
9అయితే ఇశ్రాయేలీయుల్లో ఒక్కణ్ణి కూడా సొలొమోను తన దగ్గర పనిచేయడానికి దాసుడుగా నియమించుకోలేదు. వారిని సైనికులుగా, ప్రధానులుగా, తన సైన్యాధిపతులుగా రథాలకీ గుర్రపు రౌతులకీ అధిపతులుగా నియమించాడు. 10వీరిలో సమర్ధులైన 250 మంది సొలొమోను రాజు కింద అధిపతులై ప్రజల మీద అధికారులుగా ఉన్నారు.
11“ఇశ్రాయేలీయుల రాజైన దావీదు పట్టణంలో నా భార్య నివాసం చేయకూడదు. యెహోవా మందసం ఉన్న స్థలాలు పవిత్రమైనవి” అని చెప్పి, సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి తాను ఆమె కోసం కట్టించిన నగరానికి తీసుకు వచ్చాడు.
12అప్పటినుండి సొలొమోను తాను మంటపం ముందు కట్టించిన యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పిస్తూ వచ్చాడు. 13అతడు అనుదిన ఏర్పాటు ప్రకారం మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినాల్లో, అమావాస్య రోజుల్లో, సంవత్సరానికి మూడు సార్లు జరిగే నియామక పండగ రోజుల్లో, అంటే పొంగని రొట్టెల పండగ, వారాల పండగ, పర్ణశాలల పండగ రోజుల్లో యెహోవాకు దహనబలులు అర్పిస్తూ వచ్చాడు.
14అతడు తన తండ్రి దావీదు జారీ చేసిన ఆజ్ఞలననుసరించి వారి వారి సేవా కార్యాలు చేయడానికి వారి వారి వంతుల ప్రకారం యాజకులనూ, కట్టడను అనుసరించి ప్రతి రోజూ యాజకుల ముందు స్తుతి చేయడానికీ ఉపచారం చేయడానికీ వారి వంతుల ప్రకారం లేవీయులనూ ప్రతి ద్వారం దగ్గరా కాపలా ఉండడానికి వారి వంతుల ప్రకారం ద్వారపాలకులనూ నియమించాడు. దైవసేవకుడు దావీదు ఆ విధంగానే ఆజ్ఞాపించాడు. 15ఏ విషయం గూర్చి అయినా, ఖజానాల గూర్చి అయినా రాజు యాజకులకు, లేవీయులకు చేసిన ఏర్పాటు ప్రకారం వారు అన్ని విషయాలూ జరిగించేవారు.
16యెహోవా మందిరానికి పునాది వేసిన రోజు నుండి అది పూర్తయ్యే వరకూ సొలొమోను ఆ పని సంపూర్ణంగా చేయించాడు. ఆ విధంగా యెహోవా మందిరం పని సమాప్తమయ్యింది. 17సొలొమోను ఎదోము దేశపు సముద్ర తీరంలో ఉన్న ఎసోన్గెబెరుకు, ఏలతుకు వెళ్ళాడు. 18హీరాము తన పనివారి ద్వారా ఓడలనూ ఓడ నడిపే నైపుణ్యం గల పనివారిని పంపాడు. వీరు సొలొమోను పనివారితో కలిసి ఓఫీరుకు వెళ్ళి అక్కడనుండి 900 మణుగుల బంగారాన్ని ఆ ఓడలపై ఎక్కించుకుని సొలొమోను రాజు కోసం తీసుకు వచ్చారు.

Currently Selected:

2 దిన 8: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in