YouVersion Logo
Search Icon

2 కొరింతీ పత్రిక 10

10
పౌలు అపొస్తలత్వ సమర్థన (దేవుని నుండి)
1స్వయంగా పౌలు అనే నేను క్రీస్తులో ఉన్న సాత్వీకంతో, మృదుత్వంతో మీకు విన్నపం చేస్తున్నాను. మీతో ఉన్నపుడు దీనునిగా, మీతో లేనపుడు ధైర్యశాలిగా ఉన్నాను గదా! 2మేము శరీరానుసారంగా నడుస్తున్నామని కొందరంటున్నారు. అలాంటి వారితో నేను విభేధించి ధైర్యంతో వ్యవహరించాలని అనుకుంటున్నాను. అయితే మీతో ఉన్నపుడు నేనలా ఉండకుండాా చేయమని మిమ్మల్ని బతిమాలుతున్నాను.
3మేము శరీరంతో జీవిస్తున్నా శరీరానుసారంగా యుద్ధం చేయం. 4మా యుద్ధ పరికరాలు లోక సంబంధమైనవి కావు. కోటలను ధ్వంసం చేసి, మనుషులను పక్కదోవ పట్టించే వాదాలను ఓడించే దైవ శక్తి వాటికి ఉంది. 5వాటితో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్నీ నాశనం చేసి, ప్రతి ఆలోచననూ వశపరచుకుని క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాం. 6మీ విధేయత పూర్తి అయినప్పుడు అవిధేయతనంతటినీ శిక్షించడానికి సిద్ధపడి ఉన్నాం.
7మీ ముందున్న వాటిని స్పష్టంగా చూడండి. మీలో ఎవరైనా తాను క్రీస్తు వాడినని నమ్మకం కుదిరితే, అతనెలా క్రీస్తు వాడో మేము కూడా అలానే క్రీస్తు వారిమని తాను గుర్తుంచుకోవాలి. 8మీ నాశనం కోసం కాక మిమ్మల్ని కట్టడానికే ప్రభువు ఇచ్చిన అధికారాన్ని గురించి కాస్త ఎక్కువ అతిశయంగా చెప్పుకున్నా సిగ్గుపడను.
9నేను రాసే ఉత్తరాలతో మిమ్మల్ని భయపెట్టే వాడిలాగా ఉండకూడదు. 10కొందరు ఇలా అంటారు, “అతని ఉత్తరాలు గంభీరంగా బలీయంగా ఉన్నాయి, కానీ శరీరం బలహీనం, మాటలు చప్పగా ఉంటాయి.” 11అలాంటి వారు తెలుసుకోవలసింది ఏంటంటే మేమక్కడ లేనపుడు ఉత్తరాల్లో రాసిన మాటల ప్రకారం ఏమి చెప్పామో మేమక్కడ ఉన్నప్పుడూ అలానే చేస్తాము. 12తమను తామే మెచ్చుకొనే వారిలో ఒకరిగా ఉండడానికి గానీ వారితో పోల్చుకోడానికి గానీ మేము తెగించం. అయితే వారు తమకు తాము ఒకరిని బట్టి మరొకరు బేరీజు వేసుకుంటూ ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటే వారు తెలివిలేని పని చేస్తున్నట్టు.
13మేమైతే మా స్థాయికి మించి అతిశయపడం, మిమ్మల్ని చేరగలిగేలా దేవుడు మాకు ఏర్పరచిన హద్దుల్లోనే ఉంటాం. 14మేము మీ దగ్గరికి వచ్చినపుడు మా హద్దులు మీరలేదు. క్రీస్తు సువార్త మోసుకుంటూ మీ దాకా మొట్టమొదట వచ్చింది మేమే. 15మేము మా హద్దు మీరి ఇతరుల కష్ట ఫలంలో మాకు వంతు ఉన్నట్టు అతిశయపడము. అయితే మీ విశ్వాసం అభివృద్ధి అయ్యే కొద్దీ మా పరిధిలో పని ఇంకా ఎక్కువగా అభివృద్ది అవుతుందనీ, దాని వలన 16మీకు అవతల ఉన్న ప్రాంతాల్లో కూడా సువార్త ప్రకటించాలనీ మా ఆశ. మరొకరి పరిధిలో జరుగుతున్న పని గురించి మేము అతిశయించం. 17అయితే, “అతిశయించేవాడు ప్రభువులోనే అతిశయించాలి.” 18ప్రభువు మెచ్చుకొనే వాడే యోగ్యుడు గానీ తనను తానే మెచ్చుకొనేవాడు యోగ్యుడు కాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in