YouVersion Logo
Search Icon

2 తిమోతి పత్రిక 2

2
మంచి సైనికుని తీరు
1నా కుమారా, క్రీస్తు యేసులో ఉన్న కృపచేత బలవంతుడవుగా ఉండు. 2అనేకుల ముందు నేను నీకు నేర్పిన సంగతులను ఇతరులకు బోధించగలిగిన, నమ్మకమైన వ్యక్తులకు అప్పగించు.
3క్రీస్తు యేసు కోసం మంచి సైనికుడిలా కష్టాలు భరించు. 4సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన జీవితంలో ఇతర వ్యాపకాల్లో చిక్కుకోకుండా తనను సైన్యంలో చేర్చుకున్నవాణ్ణి సంతోషపెట్టాలని ప్రయత్నిస్తాడు. 5ఒక క్రీడాకారుడు నియమాల ప్రకారం పూర్తిచేయకపోతే అతనికి బహుమానం దొరకదు. 6కష్టపడిన వ్యవసాయదారుడే రాబడిలో మొదటి భాగం పొందడానికి అర్హుడు. 7నేను చెప్పే మాటలు ఆలోచించు. అన్ని విషయాల్లో ప్రభువు నీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు.
8నా సువార్త ప్రకారం, దావీదు సంతానంలో పుట్టి చనిపోయినవారిలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకో. 9ఆ సువార్త విషయంలో నేను ఒక నేరస్థుడిలా సంకెళ్ళపాలై కష్టాలు అనుభవిస్తున్నాను. అయితే దేవుని వాక్యానికి మాత్రం సంకెళ్ళు లేవు.
10అందుచేత ఎన్నికైనవారు నిత్యమైన మహిమతో క్రీస్తు యేసులోని రక్షణ పొందాలని నేను వారి కోసం అన్నీ ఓర్చుకుంటున్నాను.
11“మనం ఆయనతో చనిపోతే ఆయనతో బతుకుతాం.
12కష్టాలు సహిస్తే ఆయనతోబాటు రాజ్య పరిపాలన చేస్తాం.
ఆయన ఎవరో మనకు తెలియదు అంటే
ఆయన కూడా మనం ఎవరో తెలియదు అంటాడు.
13ఆయన తన నైజానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు కాబట్టి,
మనం నమ్మకస్తులం కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగినవాడే,”
అనే మాటలు నమ్మదగినవి.
14వినేవారిని చెడగొట్టడానికే తప్ప మరి ఏ ప్రయోజనమూ లేని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దని ప్రభువు ఎదుట విశ్వాసులకు హెచ్చరిస్తూ ఈ సంగతులు వారికి గుర్తు చెయ్యి. 15దేవుని దృష్టిలో ఆమోదయోగ్యుడుగా, సిగ్గుపడనక్కరలేని పనివాడుగా, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడుగా నిన్ను నీవే దేవునికి కనుపరచుకో.
16భక్తిహీనతకు కారణమయ్యే వట్టి మాటలు వదిలివెయ్యి. ఆ మాటలు మరింత భక్తిహీనతకు దారితీస్తాయి. 17పుండు కుళ్ళి ఎలా వ్యాపిస్తుందో వారి మాటలు కూడా అలా వ్యాపిస్తాయి. హుమెనై, ఫిలేతు అలాటివారే. 18వారు “పునరుత్థానం గతించిపోయింది” అని చెబుతూ సత్యం విషయంలో తప్పటడుగు వేసి, మరి కొందరి విశ్వాసాన్ని చెడగొడుతున్నారు.
19అయితే “ప్రభువుకు తన వారెవరో తెలుసు,” “ప్రభువు నామాన్ని ఒప్పుకొనే ప్రతివాడూ దుర్నీతి నుండి తొలగిపోవాలి” అని రాసి ఉన్న దేవుని స్థిరమైన పునాది నిలిచి ఉంటుంది.
20ధనవంతుల ఇంట్లో వెండివీ, బంగారువీ గాక కొయ్య, మట్టి గిన్నెలు కూడా ఉంటాయి. వాటిలో కొన్ని గౌరవప్రదమైన వాడకానికీ కొన్ని ఘనహీనమైన వాడకానికీ ఉంటాయి. 21ఎవరైనా ఘనహీనమైన వాటిలో చేరకుండా తనను శుద్ధి చేసుకుంటే వాడు పవిత్రమై, యజమాని వాడుకోవడానికి అర్హుడై అన్ని మంచి కార్యాలకూ సిద్ధపడి, ఘనత కోసమైన గిన్నెగా ఉంటాడు.
22నువ్వు యువకులకు కలిగే చెడుకోరికలను విడిచి పారిపో. పవిత్ర హృదయాలతో ప్రభువుకు ప్రార్థన చేసేవారితో కలిసి నీతినీ విశ్వాసాన్నీ ప్రేమనూ శాంతి సమాధానాలనూ సంపాదించుకోవడానికి కృషి చెయ్యి. 23బుద్ధిహీనమైన, మూఢత్వంతో కూడిన తర్కాలు జగడాలకు కారణమౌతాయని గ్రహించి వాటిని వదిలెయ్యి.
24ప్రభువు సేవకుడు పోట్లాటలకు దిగకూడదు. అందరి మీదా దయ చూపాలి. బోధనా సామర్ధ్యం కలిగి, సహించేవాడై ఉండాలి. 25-26దేవునికి ఎదురు చెప్పేవారిని సాత్వికంతో సరిదిద్దాలి. ఎందుకంటే సాతాను తన ఇష్టం నెరవేర్చుకోడానికి వారిని చెరపట్టాడు. వాడి ఉరి నుండి తప్పించుకుని మేలుకోడానికి దేవుడు వారికి సత్య సంబంధమైన జ్ఞానాన్నిచ్చి మారుమనస్సు దయచేస్తాడేమో.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in