అపొస్తలుల కార్యములు 4
4
హింసలు ఆరంభం
1పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నపుడు యాజకులూ, ద్వారపాలకుల అధికారీ, సద్దూకయ్యులూ వారి దగ్గరికి వచ్చారు. 2వారు యేసుని గూర్చి బోధిస్తూ ఆయన చనిపోయి తిరిగి లేచాడని ప్రకటించడం విని కలవరపడ్డారు. 3వారిని బలవంతంగా పట్టుకుని, సాయంకాలం అయిందని మరునాటి వరకూ వారిని ఖైదులో ఉంచారు. 4కానీ వాక్కు విన్న వారిలో చాలామంది నమ్మారు. వారిలో పురుషుల సంఖ్య దాదాపు ఐదు వేలు.
సన్హెడ్రిన్ సభ ఎదుటికి పేతురు
5మరుసటి రోజు వారి అధికారులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ యెరూషలేములో సమావేశమయ్యారు. 6ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను, అలెగ్జాండర్, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో ఉన్నారు. 7వారు పేతురు యోహానులను వారి మధ్యలో నిలబెట్టి, “మీరు ఏ అధికారంతో ఏ నామంలో దీన్ని చేశారు?” అని అడిగారు. 8పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇలా అన్నాడు, “ప్రజల అధికారులారా, పెద్దలారా, 9ఆ కుంటివాడికి చేసిన మంచి పని గురించి, వాడెలా బాగుపడ్డాడని ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా. 10మీరూ, ఇశ్రాయేలు ప్రజలంతా తెలుసుకోవలసింది ఏమంటే, మీరు సిలువ వేసిన, మృతుల్లో నుండి దేవుడు లేపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్నే వీడు బాగుపడి మీ ముందు నిలుచున్నాడు. 11ఇల్లు కట్టే మీరు వదిలేసిన రాయి ఆయనే. ఆ రాయి భవనానికి ఆధారశిల అయ్యింది. 12ఎవ్వరివల్లా రక్షణ రాదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి గాని, ఆకాశం కింద ఉన్న మనుషుల్లోని మరి ఏ నామంలోనూ రక్షణ పొందలేము.”
యేసు నామం ప్రకటించడం నిషేధం
13వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వారు చదువులేని సామాన్యులని తెలుసుకుని ఆశ్చర్యపడి, వారు యేసుతో ఉండేవారు అని గుర్తించారు. 14బాగుపడ్డ ఆ వ్యక్తి వారితోపాటు నిలబడడం చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు.
15అధికారులు సభాస్థలం నుంచి బయటికి వెళ్ళండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసుకుని, 16‘ఈ మనుషులను మనమేం చేద్దాం? వారిద్వారా గొప్ప అద్భుతం జరిగిందని యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలుసు, అది జరగలేదని చెప్పలేం. 17అయినా ఇది జనాల్లోకి యింకా వ్యాపించకుండా, ఇకనుండి ఈ నామంతో ఎవరితోనూ మాట్లాడవద్దని మనం వారిని బెదిరిద్దాం’ అని చెప్పుకున్నారు.
18అప్పుడు వారిని పిలిపించి, “మీరు యేసు నామంలో ఏ మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదు” అని వారికి ఆజ్ఞాపించారు. 19అందుకు పేతురు యోహానులు వారిని చూసి, “దేవుని మాట కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమేనా? మీరే చెప్పండి. 20మేమేం చూశామో, ఏమి విన్నామో వాటిని చెప్పకుండా ఉండలేము” అని వారికి జవాబిచ్చారు.
21ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని కొనియాడుతున్నారు కాబట్టి సభవారు వీరిని ఎలా శిక్షించాలో తెలియక గట్టిగా బెదరించి విడుదల చేశారు. 22అద్భుతంగా బాగుపడిన వాడి వయస్సు నలభై ఏళ్ళు పై మాటే.
విశ్వాసులు మళ్లీ ఆత్మతో నిండిపోవడం
23పేతురు యోహానులు విడుదలై తమ సొంతవారి దగ్గరికి వచ్చి, ప్రధాన యాజకులూ పెద్దలూ తమతో చెప్పిన మాటలన్నీ వారికి చెప్పారు. 24వారు విని, ఒకే మనసుతో దేవునికిలా గొంతెత్తి మొరపెట్టారు. ‘ప్రభూ, నీవు ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలోని సమస్తాన్నీ కలుగజేశావు.
25యూదేతరులు ఎందుకు అల్లరి చేశారు?
ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు?
26ప్రభువు మీదా ఆయన క్రీస్తు మీదా భూరాజులు లేచారు,
అధికారులు ఏకమయ్యారు
అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా, నీ సేవకుడూ, మా తండ్రీ అయిన దావీదుతో చెప్పించావు.
27ఏవి జరగాలని నీవు సంకల్పించి ముందుగానే నిర్ణయించావో, వాటన్నిటినీ చేయడానికి నీవు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు విరోధంగా 28హేరోదు, పొంతి పిలాతు, యూదేతరులు, ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఈ పట్టణంలో ఒక్కటయ్యారు. 29ప్రభూ, వారి బెదరింపులు గమనించి రోగులను బాగుచేయడానికీ, నీ పవిత్ర సేవకుడైన యేసు నామంలో సూచక క్రియలనూ, మహత్కార్యాలనూ చేయడానికీ నీ చెయ్యి చాపి ఉండగా, 30నీ సేవకులు బహు ధైర్యంగా నీ వాక్కు బోధించేలా అనుగ్రహించు.’ 31వారు ప్రార్థన చేయగానే వారు సమావేశమై ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.
యెరూషలేములో దేవుని సంఘం
32విశ్వసించిన వారంతా ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎవరూ తన ఆస్తిపాస్తుల్లో ఏదీ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు. 33అపొస్తలులు గొప్ప ప్రభావంతో ప్రభువైన యేసు పునరుత్థానాన్ని గురించి సాక్షమిచ్చారు. గొప్ప దైవ కృప అందరినీ ఆవరించింది. 34భూములూ ఇళ్ళూ ఉన్నవారంతా వాటిని అమ్మేసి, ఆ డబ్బు అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. 35వారు ప్రతివారికీ అవసరం చొప్పున పంచి పెట్టారు కాబట్టి వారిలో ఎవరికీ కొదువ లేకపోయింది.
36సైప్రస్ దీవికి చెందిన యోసేపు అనే ఒక లేవీయునికి అపొస్తలులు ‘బర్నబా’ అనే పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం ‘ఆదరణ పుత్రుడు.’ 37ఇతడు తనకున్న పొలం అమ్మేసి ఆ డబ్బు తెచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు.
Currently Selected:
అపొస్తలుల కార్యములు 4: IRVTel
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.