YouVersion Logo
Search Icon

కొలస్సీ పత్రిక 2

2
1ఎందుకంటే మీ కోసమూ, లవొదికయ పట్టణంలోని వారి కోసమూ, నన్ను చూడని వారందరి కోసమూ నేను ఎంత తీవ్ర పోరాటం చేస్తున్నానో మీరు తెలుసుకోవాలి. 2వారందరూ తమ హృదయాల్లో ప్రోత్సాహం పొందాలనీ ప్రేమలో ఐక్యం కావాలనీ నా అభిలాష. అప్పుడు వారికి కలిగే వాస్తవమైన అవగాహన వల్ల తమ హృదయాల్లో సంపూర్ణ నిశ్చయత కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును అర్థం చేసుకోగలగాలి. 3జ్ఞానం, తెలివితేటల నిధులన్నీ క్రీస్తులో దాగి ఉన్నాయి.
4ఎవరైనా మీతో ఇంపుగా మాట్లాడి మిమ్మల్ని మోసం చేయకుండా ఉండాలని మీకు ఈ సంగతి చెబుతున్నాను. 5నేను భౌతికంగా మీకు దూరంగా ఉన్నా ఆత్మలో మీతోనే ఉన్నాను. మంచి క్రమంలో సాగే మీ ప్రవర్తననూ, క్రీస్తుపై మీకున్న బలమైన విశ్వాసాన్నీ చూసి సంతోషిస్తున్నాను.
6మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగానే ఆయనలో నడుస్తూ ఉండండి. 7ఆయనలో స్థిరంగా నాటుకుని ఉండండి. ఆయన పైనే మీ జీవితాలు కట్టుకోండి. మీకు బోధించిన రీతిగానే విశ్వాసంలో వేరు పారి ఉండండి. కృతజ్ఞతలు చెల్లించడంలో పొంగిపొరలుతూ ఉండండి.
8క్రీస్తుపై కాకుండా మానవ సంప్రదాయాలపైనా, ప్రాపంచిక మూల సూత్రాలపైనా ఆధారపడ్డ తత్వజ్ఞానాన్నీ, కేవలం మోసపూరితమైన వట్టి వాదాలనూ ప్రయోగించి ఎవరూ మిమ్మల్ని వశం చేసుకోకుండా చూసుకోండి. 9ఎందుకంటే దైవత్వపు సర్వ సంపూర్ణత ఆయన శరీరంలో నివసిస్తూ ఉంది. 10ప్రతి ప్రభుత్వానికీ ఆధిపత్యానికీ పై శిరస్సుగా ఉన్న ఆయనలో మీరు సంపూర్ణులు. 11మనుషుల చేతులతో చేసినట్టు కాకుండా దేవుడు ఆయనలో మీకు సున్నతి చేశాడు. స్వభావరీత్యా శరీరంలో ఉన్న పాపపు నైజాన్ని తీసివేయడమే క్రీస్తులో మీరు పొందిన సున్నతి.
12బాప్తిసంలో మీరు ఆయనతో కూడా సమాధి అయ్యారు. అయితే చనిపోయిన వారిలో నుండి ఆయనను సజీవంగా లేపిన దేవుని శక్తిపై మీకున్న విశ్వాసం వల్ల మీరు కూడా సజీవంగా లేచారు.
13ఒకప్పుడు మీరు చేసిన అపరాధాలవల్లా శరీరంలో మీకు సున్నతి జరగక పోవడంవల్లా మీరు చనిపోయిన వారుగా ఉండేవారు. అప్పుడు ఆయన తనతోబాటు మిమ్మల్ని బతికించాడు. మన అపరాధాలన్నిటినీ క్షమించాడు. 14మనకు వ్యతిరేకంగా రాసి ఉన్న రుణపత్రాన్నీ, దానికి సంబంధించిన నియమ నిబంధనలనూ ఆయన తుడిచివేశాడు. ఆయన వాటన్నిటినీ తీసివేసి సిలువకు మేకులతో కొట్టాడు. 15ఆయన సిలువపై ప్రభుత్వాలనూ, ఆధిపత్యాలనూ ఓడించి, వారిని నిరాయుధులుగా చేసి తన విజయోత్సవ ఊరేగింపులో బహిరంగంగా ప్రదర్శించాడు.
16కాబట్టి తినే విషయంలోనూ తాగే విషయంలోనూ, పండగ రోజులూ, అమావాస్య, విశ్రాంతి దినం వంటి విషయాల్లోనూ ఎవరూ మిమ్మల్ని విమర్శించకుండా చూసుకోండి. 17ఇవన్నీ జరగబోతున్న వాటికి నీడల్లాంటివి. వాటి నిజస్వరూపం క్రీస్తులో ఉంది.
18ఎవరైనా కపట వినయం ప్రదర్శిస్తూ, దేవదూతల పట్ల భక్తి కనపరుస్తూ మీరు మీ బహుమానం పోగొట్టుకొనేలా చేయకుండా జాగ్రత్త పడండి. అలాటివాడు తాను చూసిన విషయాలను అతిశయోక్తిగా చెప్పుకుంటాడు. వాడు తన శరీర సంబంధమైన ఆలోచన వల్ల కారణం లేకుండానే వాటి విషయంలో గర్విష్టి అవుతాడు.
19అలాంటి వాడు శిరస్సుగా ఉన్న క్రీస్తు యేసును అంటి పెట్టుకుని ఉండడు. ఆ శిరస్సు వల్లనే శరీరానికి పోషణ జరుగుతుంది. ఆ శిరస్సు వల్లనే కీళ్లతో, నరాలతో శరీరం ఒక్కటిగా ఉంటుంది. దేవుడు ప్రసాదించే ఎదుగుదలతో శరీరం అభివృద్ధి చెందుతుంది. 20ప్రాపంచిక మూల సూత్రాల విషయంలో మీరు క్రీస్తుతో కూడా మరణించారు కాబట్టి వాటి కిందనే ఇంకా బ్రతుకుతున్నట్టుగా ఆ నియమాలకు మీరెందుకు లోబడి ఉండాలి? 21“అది పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ఇది ముట్టుకోవద్దు” లాంటి మనుషుల ఆజ్ఞలను ఎందుకు లెక్క చేయాలి?
22ఈ ఆజ్ఞలూ, ఉపదేశాలూ అన్నీ, ఉపయోగించడం చేత నాశనమైపోయే విషయాల కోసం వ్యక్తులు చేసేవే. 23వీటిలో మానవ నిర్మితమైన మత విధానాల జ్ఞానమూ కపట వినయమూ శరీరాన్ని కఠినంగా అదుపులో పెట్టుకోవడం వంటివి ఉన్నాయి. కానీ శరీర కోరికలను నియంత్రించుకునే విషయంలో అవి ఎందుకూ కొరగానివి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in