YouVersion Logo
Search Icon

ఎఫెసీ పత్రిక 4

4
విశ్వాసుల ప్రవర్తన, సేవ
1-3కాబట్టి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా సంపూర్ణ వినయం, సాత్వికం, సమాధానం కలిగిన వారై, ప్రేమతో ఒకడినొకడు సహిస్తూ, సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను. 4ఏ విధంగా మీ పిలుపుకు సంబంధించిన నిశ్చయతతో ఉన్నారో ఆ విధంగా శరీరం ఒక్కటే, ఆత్మా ఒక్కడే. 5ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. 6అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికంటే పైనా, అందరి ద్వారా అందరిలో ఉన్నాడు.
తన శరీరం కోసం క్రీస్తు ఇచ్చిన పరిచర్య వరాలు
7అయితే క్రీస్తు అనుగ్రహించిన కృప కొలతను బట్టి మనలో ప్రతి ఒక్కరికీ వరాలు లభించాయి. 8దీని గురించే ఆయన ఆరోహణమైనప్పుడు బందీలను చెరలోకి కొనిపోయాడనీ తన ప్రజలకు బహుమానాలు ఇచ్చాడనీ లేఖనంలో ఉంది. 9“ఆరోహణమయ్యాడు” అనే మాటకు ఆయన భూమి కింది భాగాలకు దిగాడు అని కూడా అర్థం ఉంది కదా. 10అలా దిగినవాడే తానే సమస్తాన్నీ నింపేలా ఆకాశ మహాకాశాలన్నింటినీ దాటి, ఎంతో పైకి ఎక్కిపోయాడు.
పరిచర్య వరాల ఉద్దేశం
11-12విశ్వాసులను సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనీ ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు. 13మనమంతా విశ్వాసంలో, దేవుని కుమారుడి గురించిన జ్ఞానంలో ఏకీభావం కలిగి ఉండాలనీ క్రీస్తు కలిగి ఉన్న పరిపూర్ణ పరిణతికి సమానమైన పరిణతి చెందాలనీ ఆయన ఇలా నియమించాడు. 14అప్పుడు మనం పసిపిల్లల్లాగా కాక మనుషులు కపటంతో, కుయుక్తితో తప్పు దారికి లాగాలని కల్పించిన అన్నిరకాల బోధలు అనే గాలుల తాకిడికి కొట్టుకుపోకుండా ఉంటాము. 15ప్రేమతో సత్యమే మాట్లాడుతూ అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదుగుదాం. 16ఆయనే శిరస్సు. ఆయన నుండి సంఘమనే శరీరం చక్కగా అమరి, దానిలోని ప్రతి అవయవమూ కీళ్ళ మూలంగా కలిసి ఉండి, తన శక్తి కొలది పని చేసినపుడు ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కలిగేలా అభివృద్ధి చెందుతుంది.
క్రీస్తులో నూతన జీవిగా విశ్వాసి ప్రవర్తన
17కాబట్టి మీరికనుండి నిరుపయోగమైన హృదయాలోచనలతో జీవించే అవిశ్వాసుల్లాగా జీవించవద్దని ప్రభువులో మిమ్మల్ని వేడుకుంటున్నాను. 18ఎందుకంటే వారి మనసు అంధకారమయమై, తమ హృదయ కాఠిన్యం వలనా తమలోని ఆజ్ఞానం వలనా తమ మనసులోని ఆజ్ఞానాన్ని అనుసరించి, దేవుని జీవం నుండి వేరైపోయారు. 19వారు సిగ్గు లేకుండా అత్యాశతో నానారకాల అపవిత్ర కార్యాలు చేయడం కోసం తమను తాము కాముకత్వానికి అప్పగించుకున్నారు.
20అయితే మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొన్నది ఇది కాదు. 21యేసులోని సత్యం గురించి ఉన్నది ఉన్నట్టుగానే మీరు ఉపదేశం పొందారు. 22కాబట్టి మీరు మీ గత జీవితానికి సంబంధించినదీ, మోసకరమైన కోరికల చేత చెడిపోయేదీ అయిన మీ పాత స్వభావాన్ని విడిచిపెట్టండి 23మీ అంతరంగిక మనస్సులు వినూత్నం కావాలి. 24దేవుడు ఇచ్చే కొత్త స్వభావం ధరించుకోవాలి. అలాటి స్వభావం యథార్థమైన నీతి పవిత్రతలు కలిగి ఉంటుంది.
25మనం ఒకరికొకరం అవయవాల వంటి వారం. కాబట్టి మీరు అబద్ధాలు మానేసి మీ సాటిమనిషితో సత్యమే పలకాలి. 26కోపపడవచ్చు గాని అది పాపానికి దారి తీయకూడదు. మీ కోపం పొద్దుగుంకే దాకా ఉండకూడదు. 27సాతానుకు అవకాశం ఇవ్వకండి. 28దొంగతనం చేసేవాడు దాన్ని విడిచిపెట్టాలి. తన చేతులతో కష్టపడి పనిచేసి అక్కరలో ఉన్నవారికి సహాయం చేయాలి. 29మీ నోటి వెంట చెడు మాటలు రాకూడదు. వినేవారికి ప్రయోజనం కలిగేలా వారు అభివృద్ధి చెందేలా కృపా సహితంగా మాట్లాడండి.
ఆత్మను కలిగి ఉన్నవాడుగా విశ్వాసి ప్రవర్తన
30దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచ వద్దు. ఎందుకంటే ఆయన ముద్ర మీ విమోచన దినం వరకూ మీపై ఉంటుంది. 31సమస్తమైన దుష్టత్వంతోబాటు ద్వేషం, కోపం, రౌద్రం, అల్లరి, దూషణ అనే వాటిని పూర్తిగా విడిచిపెట్టండి. 32హృదయంలో కరుణ కలిగి ఒకడిపై మరొకడు దయ చూపించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్రీస్తులో క్షమించాడో ఆ విధంగానే మీరు కూడా ఇతరులను క్షమించండి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in