YouVersion Logo
Search Icon

హబ 1

1
హబక్కూకు ఫిర్యాదు
1ప్రవక్త అయిన హబక్కూకు దగ్గరికి దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి.
2“యెహోవా, నేను సహాయం కోసం మొర్రపెట్టినా నీవెన్నాళ్లు ఆలకించకుండా ఉంటావు?
బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినా నువ్వు రక్షించడం లేదు.
3నన్నెందుకు దోషాన్ని చూడనిస్తున్నావు?
బాధను నీవెందుకు చూస్తూ ఉండిపోతున్నావు?
ఎక్కడ చూసినా నాశనం, బలాత్కారం కనబడుతున్నాయి.
జగడం, కలహం రేగుతున్నాయి.
4అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమై పోయింది.
న్యాయం జరగకుండా ఆగిపోయింది.
భక్తి హీనులు నీతిపరులను చుట్టుముడుతున్నారు.
న్యాయం చెడిపోతున్నది.
యెహోవా జవాబు
5అన్యజనుల్లో జరుగుతున్నది చూడండి, ఆలోచించండి. నిర్ఘాంతపొండి.
మీ కాలంలో నేనొక కార్యం చేస్తాను. అలా జరుగుతుందని ఎవరైనా మీకు చెప్పినా మీరు నమ్మరు.
6కల్దీయులను#1:6 కల్దీయులను బబులోనీయులు నేను రేపుతున్నాను. వినండి. వారు తమవి కాని ఉనికిపట్టులను ఆక్రమించాలని భూదిగంతాలదాకా సంచరించే ఉద్రేకం గల క్రూరులు.
7వారు ఘోరమైన భీకర జాతి.
వారు ప్రభుత్వ విధులను తమ ఇష్టం వచ్చినట్టు ఏర్పరచుకుంటారు.
8వారి గుర్రాలు చిరుతపులుల కంటే వేగంగా పరుగులెత్తుతాయి.
రాత్రిలో తిరుగులాడే తోడేళ్లకంటే అవి చురుకైనవి.
వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున చొరబడతారు.
ఎరను పట్టుకోడానికి గరుడ పక్షి వడిగా వచ్చేలా వారు వస్తారు.
9వెనుదిరిగి చూడకుండా దౌర్జన్యం చేయడానికి వారు వస్తారు.
ఇసుక రేణువులంత విస్తారంగా వారు జనులను చెర పట్టుకుంటారు.
10రాజులను అపహాస్యం చేస్తారు.
అధిపతులను హేళన చేస్తారు.
ప్రాకారాలున్న దుర్గాలన్నిటిని తృణీకరిస్తారు.
మట్టి దిబ్బలు వేసి వాటిని పట్టుకుంటారు.
11తమ బలమే తమ దేవుడనుకుంటారు.
గాలి కొట్టుకుని పోయేలా వారు కొట్టుకు పోతూ అపరాధులౌతారు.
హబక్కూకు రెండవ ఫిర్యాదు
12యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నువ్వున్న వాడవు కావా?
మేము మరణించము.
యెహోవా, తీర్పుకే నువ్వు వారిని నియమించావు.
ఆశ్రయ దుర్గమా, మమ్మల్ని దండించడానికే వారిని పుట్టించావు.
13నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది గదా.
బాధించేవారు చేసే దుర్మార్గతను బాధను నువ్వు చూడలేవు గదా.
కపటులను నువ్వు చూసి కూడా,
దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా చూసి కూడా ఎందుకు ఊరుకున్నావు?
14పాలించే వారెవరూ లేని చేపలతో, పాకే పురుగులతో నువ్వు మనుషులను సమానులనుగా చేశావు.
15వాడు గాలం వేసి మనుషులందరిని గుచ్చి లాగుతున్నాడు.
ఉరులు పన్ని చిక్కించుకుంటున్నాడు.
వలతో వారిని వేసుకుని సంతోషంతో గంతులు వేస్తున్నాడు.
16కాబట్టి వలల వలన మంచి రాబడి, పుష్టినిచ్చే భోజనం తనకు దొరుకుతున్నాయని వాడు తన వలకు బలులు అర్పిస్తున్నాడు.
తన వలలకు సాంబ్రాణి వేస్తున్నాడు.
17వాడు అస్తమానం తన వలలో నుండి దిమ్మరిస్తూ ఉండాలా? ఎప్పటికీ మానకుండా వాడు జాతులను దయలేకుండా హతం చేస్తూ ఉండాలా?”

Currently Selected:

హబ 1: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in