YouVersion Logo
Search Icon

హెబ్రీ పత్రిక 5

5
మన గొప్ప ప్రధాన యాజకుడు
(1) ఆయన పని
1దేవునికి సంబంధించిన పనులు చేయడానికీ, ప్రజల పక్షంగా వారి పాపాల కోసం అర్పణలనూ, బలులనూ అర్పించడానికీ, ప్రతి ప్రధాన యాజకుడి నియామకమూ ప్రజల్లో నుండే జరుగుతుంది. 2అతడు అజ్ఞానుల విషయంలోనూ, దారి తప్పిన వారి విషయంలోనూ సానుభూతి చూపుతాడు. ఎందుకంటే అతణ్ణి కూడా అలాంటి బలహీనతలు చుట్టుముట్టి ఉంటాయి గనక 3ఆ బలహీనతల కారణంగా ప్రజల పాపాల కోసం ఎలా అర్పణలు అర్పిస్తున్నాడో అలాగే తన కోసం కూడా అర్పించాల్సి ఉంటుంది. 4ఈ గొప్పదనాన్ని ఎవరూ తమకు తామే ఆపాదించుకునే వీలు లేదు. అహరోనుకు ఉన్నట్టుగా దీనికి దేవుని ప్రత్యేక పిలుపు ఉండాలి.
(2) క్రీస్తు మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడు
5అలానే క్రీస్తు కూడా ప్రధాన యాజకుని స్థానానికి తనను తానే హెచ్చించుకోలేదు గానీ దేవుడే ఆయనతో ఇలా అన్నాడు.
“నువ్వు నా కుమారుడివి.
ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను.”
6అలాగే మరొక చోట ఆయన,
“నువ్వు మెల్కీసెదెకు క్రమంలో కలకాలం ఉండే యాజకుడివి” అన్నాడు.
7ఆయన శరీరంతో ఉన్నప్పుడు తనను మరణం నుండి రక్షించగల దేవునికి ప్రార్థనలూ, మనవులూ చేస్తూ కన్నీళ్ళతో మొర్ర పెట్టుకున్నాడు. దేవునిపై ఆయనకున్న పూజ్యభావం వల్ల దేవుడు వాటిని ఆలకించాడు. 8ఆయన కుమారుడై ఉండి కూడా తాను అనుభవించిన బాధల వల్ల విధేయత అంటే ఏమిటో నేర్చుకున్నాడు. 9మెల్కీసెదెకు క్రమంలో దేవుడు ఆయనను ప్రధాన యాజకుడిగా నియమించాడు. 10ఈ విధంగా ఆయన పరిపూర్ణుడయ్యాడు, తనకు విధేయులైన వారందరి శాశ్వత రక్షణకు కారణమయ్యాడు.
విజ్ఞప్తి, హెచ్చరిక
11దీన్ని గురించి చెప్పాల్సింది ఎంతో ఉంది. అయితే వినడంలో మందకొడిగా ఉంటారు గనక మీకు వివరించడం కష్టం. 12ఈపాటికల్లా మీరు బోధకులుగా ఉండవలసింది కానీ దేవుని మాటల్లోని ప్రాథమిక సూత్రాలను మరొకడు ఇంకా మీకు బోధించాల్సి వస్తున్నది. మీరింకా పాలు తాగే దశలోనే ఉన్నారు కానీ బలమైన ఆహారం తినే శక్తి మీకు లేదు. 13కేవలం పాలు మాత్రమే తాగే ప్రతివాడూ పసివాడే కాబట్టి నీతికి సంబంధించిన విషయాల్లో అనుభవం లేని వాడుగా ఉన్నాడు. 14దీనికి భిన్నంగా, వయస్సు వచ్చిన పెద్దవారు తమ సాధకం చేత మంచి ఏదో, చెడు ఏదో వివేచించ గలిగి, మంచీ చెడూ తేడా తెలుసుకోవడంలో శిక్షణ పొంది ఉంటారు. అలాంటి వారికి పుష్టికరమైన ఆహారం కావాలి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in