YouVersion Logo
Search Icon

హెబ్రీ పత్రిక 7

7
(4) చరిత్ర పురుషుడైన మెల్కీసెదెకు క్రీస్తుకు ముంగుర్తు
1రాజులను హతమార్చి తిరిగి వస్తున్న అబ్రాహామును షాలేం పట్టణానికి రాజైన మెల్కీసెదెకు కలుసుకుని ఆశీర్వదించాడు. 2అబ్రాహాము తాను యుద్ధంలో పట్టుకున్న వాటిలో పదవ వంతు అతనికి ఇచ్చాడు. “మెల్కీసెదెకు” అనే అతని పేరుకు నీతికి రాజు అనీ, ఇంకా, “షాలేం రాజు”, అంటే శాంతికి రాజు అనీ అర్థం. 3అతడు తండ్రి లేకుండానూ, తల్లి లేకుండానూ ఉన్నాడు. ఇతనికి పూర్వీకులంటూ ఎవరూ లేరు. ఇతని జీవిత కాలానికి ప్రారంభం లేదు. జీవితానికి అంతం అంటూ లేదు. దేవుని కుమారుడిలా ఇతడు కలకాలం యాజకుడై ఉన్నాడు.
మెల్కీసెదెకు యాజకత్వం అహరోను యాజకత్వం కన్నా గొప్పది. ఎందుకంటే అహరోను అబ్రాహాములో ఉండి మెల్కీసెదెకుకు పదవభాగం సమర్పించాడు
4ఇప్పుడు ఇతడెంత గొప్పవాడో గమనించండి. మన పూర్వికుడైన అబ్రాహాము యుద్ధంలో తాను కొల్లగొట్టిన శ్రేష్ఠమైన వస్తువుల్లో పదోవంతు ఇతనికి ఇచ్చాడు. 5లేవి వంశం వారిలో నుండి యాజకులైన వారు, ఇతర గోత్రాల ప్రజలు అబ్రాహాము సంతతి వారైనప్పటికీ, వారి దగ్గర పదవ వంతును కానుకగా సేకరించాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది.
6కానీ లేవీతో ఎలాంటి సంబంధమూ లేని మెల్కీసెదెకు అబ్రాహాము దగ్గర పదోవంతు కానుకలు స్వీకరించి అబ్రాహామును ఆశీర్వదించాడు. 7ఆశీర్వదించేవాడు అధికుడనీ దాన్ని అందుకునేవాడు తక్కువ వాడన్నది కాదనలేని విషయం. 8లేవీ క్రమంలో యాజకుడై కానుక స్వీకరించేవాడు ఒకరోజు మరణిస్తాడు. అయితే అబ్రాహాము కానుకను స్వీకరించిన వాడు శాశ్వతంగా జీవిస్తూ ఉన్నట్టుగా వివరణ ఉంది.
9ఒక రకంగా చెప్పాలంటే పదోవంతు కానుకలను స్వీకరించిన లేవీ తాను కూడా అబ్రాహాము ద్వారా పదవ వంతు కానుకలు ఇచ్చాడు. 10ఇది ఎలాగంటే, లేవీ అబ్రాహాము నుండే రావాలి కాబట్టి, అబ్రాహాము మెల్కీసెదెకుకు కానుక ఇచ్చినప్పుడు అతని గర్భవాసంలో లేవీ ఉన్నాడు.
అహరోను యాజకత్వం దేనినీ పరిపూర్ణం చేయదు
11లేవీయులు యాజకులై ఉన్నప్పుడే దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కాబట్టి ఒకవేళ ఆ యాజక వ్యవస్థ వల్లనే పరిపూర్ణత కలిగిందీ అనుకుంటే లేవీయుడైన అహరోను క్రమంలో కాకుండా మెల్కీసెదెకు క్రమంలో వేరే యాజకుడు రావలసిన అవసరమేంటి?
12యాజకత్వం మారినప్పుడు యాజక ధర్మం కూడా మారాలి. 13ప్రస్తుతం ఈ విషయాలన్నీ వేరే గోత్రంలో పుట్టిన వ్యక్తిని గూర్చి చెప్పుకుంటున్నాం. ఈ గోత్రంలో పుట్టిన వారిెవరూ బలిపీఠం వద్ద సేవ చేయలేదు. 14మన ప్రభువు యూదా గోత్రంలో పుట్టాడు అనేది తెలిసిన విషయమే. యాజకులను గూర్చి మాట్లాడేటప్పుడు ఈ గోత్రాన్ని మోషే ఏనాడూ ప్రస్తావనే చేయలేదు.
15మెల్కీసెదెకు వంటి మరొక యాజకుడు వచ్చాడు కనుక మేము చెబుతున్నది మరింత స్పష్టమవుతూ ఉంది. 16ఈ కొత్త యాజకుడు ధర్మశాస్త్రం ప్రకారం వంశం ఆధారంగా రాలేదు. నాశనం కావడం అసాధ్యం అయిన జీవానికి ఉన్న శక్తి ఆధారంగా వచ్చాడు.
17“నువ్వు మెల్కీసెదెకు క్రమంలో కలకాలం ఉండే యాజకుడివి”
అని లేఖనాలు ఆయనను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి.
18ఈ విషయంలో ముందు వచ్చిన ఆజ్ఞను పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే అది బలహీనంగానూ వ్యర్ధమైనదిగానూ ఉంది. 19ధర్మశాస్త్రం దేనినీ పరిపూర్ణం చేయలేదు. భవిష్యత్తు గూర్చి అంత కంటే శ్రేష్ఠమైన ఆశాభావం మనలను దేవుని దగ్గరికి చేరుస్తూ ఉంది. 20ఈ శ్రేష్ఠమైన ఆశాభావం ప్రమాణం చేయకుండా కలగలేదు. ఇతర యాజకులైతే ప్రమాణం లేకుండానే యాజకులయ్యారు. 21అయితే యేసును గూర్చి మాట్లాడుతూ దేవుడు ఇలా ప్రమాణం చేశాడు,
“నువ్వు కలకాలం యాజకుడిగా ఉంటావని దేవుడు ప్రమాణం చేశాడు.
ఆయన తన ఆలోచనను మార్చుకోడు.”
22ఈ విధంగా మరింత శ్రేష్ఠమైన ఒప్పందానికి ఆయన పూచీ అయ్యాడు.
అహరోను వంశీకులు మరణించారు, క్రీస్తు శాశ్వత కాలం జీవిస్తున్నాడు
23ఈ యాజకులు కలకాలం సేవ చేయకుండా వారిని మరణం నిరోధిస్తుంది. అందుకే ఒకరి తరువాత మరొకరుగా అనేకమంది యాజకులు అయ్యారు. 24యేసు కలకాలం జీవిస్తాడు కనుక ఆయన యాజకత్వం కూడా మార్పులేనిదిగా ఉంటుంది. 25కాబట్టి ఈయన తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చేవారిని సంపూర్ణంగా రక్షించడానికి సమర్ధుడుగా ఉన్నాడు. వారి తరపున విన్నపాలు చేయడానికి కలకాలం జీవిస్తూ ఉన్నాడు. 26ఆయన కల్మషం అంటని వాడు, నిందా రహితుడు, పవిత్రుడు, పాపులకు వేరుగా ఉన్నవాడు, ఆకాశాల కంటే ఉన్నతంగా ఉన్నాడు. ఇలాటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. 27ఇతర ప్రధాన యాజకుల్లాగా ప్రతిదినం ముందుగా తన సొంత పాపాల కోసం అర్పణలు అర్పించి తరువాత ప్రజల కోసం అర్పించాల్సిన అవసరం ఈయనకు లేదు. ఈయన తనను తానే అర్పణగా ఒక్కసారే అర్పించి ముగించాడు. 28ధర్మశాస్త్రం బలహీనతలున్న వారిని ముఖ్య యాజకులుగా నియమిస్తుంది. కాని ధర్మశాస్త్రం తరువాత వచ్చిన ప్రమాణ వాక్కు కుమారుణ్ణి ప్రధాన యాజకుడిగా నియమించింది. ఈయన శాశ్వతకాలం నిలిచే పరిపూర్ణత పొందినవాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in