YouVersion Logo
Search Icon

హెబ్రీ పత్రిక 8

8
అహరోను వంశ యాజకులు నీడలకు, ఛాయలకు పరిచర్య చేశారు
1ఇప్పుడు మేం చెబుతున్న విషయంలో ముఖ్యాంశం ఇది. మనకు ఒక ప్రధాన యాజకుడున్నాడు. ఆయన పరలోకంలో మహా ఘనత వహించిన దేవుని సింహాసనానికి కుడివైపున ఆసీనుడై ఉన్నాడు. 2మానవ నిర్మితం కాకుండా ప్రభువే నెలకొల్పిన ప్రత్యక్ష గుడారం అయిన పరిశుద్ధ గర్భాలయంలో ఆయన సేవకుడుగా ఉన్నాడు.
3ప్రధాన యాజకుణ్ణి కానుకలూ, బలులూ అర్పించడానికి నియమిస్తారు. కాబట్టి అర్పించడానికి ఏదో ఒకటి ఉండాలి. 4ఇప్పుడు క్రీస్తు భూమి మీదే ఉంటే యాజకుడిగా ఉండనే ఉండడు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం అర్పణలు అర్పించేవారున్నారు. 5మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడు, “పర్వతం పైన నీకు నేను చూపించిన నమూనా ప్రకారమే దాన్ని చేయాలి” అని దేవుడు హెచ్చరించాడు. కాబట్టి యాజకులు సేవ చేస్తున్న గుడారం పరలోకంలో ఉండే వాటికి నకలుగా, నీడగా ఉంది.
క్రీస్తు మరింత శ్రేష్ఠమైన నిబంధనకు మధ్యవర్తి
6కానీ ఇప్పుడు క్రీస్తు మరింత మేలైన పరిచర్యను పొందాడు. ఎందుకంటే శ్రేష్ఠమైన వాగ్దానాలపై ఏర్పడిన శ్రేష్ఠమైన ఒప్పందానికి ఈయన మధ్యవర్తిగా ఉన్నాడు.
కొత్త నిబంధన పాత నిబంధన కన్నా శ్రేష్ఠమైనది
7ఎందుకంటే మొదటి ఒప్పందం లోపం లేనిదైతే రెండవ ఒప్పందానికి అవకాశం ఉండదు. 8ప్రజల్లో దోషాలు కనిపించినప్పుడు దేవుడు ఇలా అన్నాడు,
“చూడండి, ఇశ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో
నేను కొత్త ఒప్పందాన్ని చేసే రోజులు వస్తున్నాయి.
9ఐగుప్తు దేశం నుండి వారి పూర్వీకులను చెయ్యి పట్టుకుని
బయటకు రప్పించిన రోజున వారితో నేను చేసిన ఒప్పందం వంటిది కాదిది.
ఎందుకంటే వారు ఆ ఒప్పందంలో కొనసాగలేదు.
నేనూ ఇక వారిమీద మనసు పెట్టడం మానేశాను.”
10ఇంకా ప్రభువు ఇలా అన్నాడు,
“ఆ రోజులు గడిచాక నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసే ఒప్పందం ఇది.
వారి మనసుల్లో నా శాసనాలు ఉంచుతాను.
అలాగే వారి హృదయాలపై వాటిని రాస్తాను.
నేను వారి దేవుడినై ఉంటాను. వారు నా ప్రజలై ఉంటారు.
11‘ప్రభువును తెలుసుకో’ అంటూ వారిలో ఎవడూ తన ఇరుగు పొరుగు వాళ్లకి గానీ
తన సోదరునికి గానీ ఉపదేశం చేయడు.
ఎందుకంటే చిన్నవాడి దగ్గర నుండి గొప్పవాడి వరకూ
అందరూ నన్ను తెలుసుకుంటారు.
12నేను వారి అవినీతి పనుల విషయమై కరుణ చూపుతాను.
వారి పాపాలను ఇక ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను.”
13ఆయన ‘కొత్త ఒప్పందం’ అని చెప్పడం వల్ల, మొదటి ఒప్పందాన్ని పాతదిగా చేశాడు. దేన్నైతే ఆయన పాతది అని ప్రకటించాడో అది మాసిపోవడానికి సిద్ధంగా ఉంది.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in