YouVersion Logo
Search Icon

యెషయా 58

58
సక్రమమైన ఉపవాసం
1పెద్దగా కేకలు వెయ్యి. ఆపవద్దు. బూరలాగా నీ గొంతెత్తు.
వారు చేసిన తిరుగుబాటు నా ప్రజలకు తెలియజెయ్యి. యాకోబు ఇంటివారికి వారి పాపాలను తెలియజెయ్యి.
2అయినా వాళ్ళు తమ దేవుని ఆజ్ఞలను వదలని ప్రజలుగా నీతిని అనుసరించే దేశంగా ప్రతిరోజూ నన్ను వెతుకుతూ ఉంటారు.
నా విధానాలను తెలుసుకోవడంలో ఆనందిస్తారు.
తమకు న్యాయమైన తీర్పులు తీర్చాలని నన్ను అడుగుతారు. దేవుడు తమకు దగ్గరవ్వాలని ఆశిస్తారు.
3“మేమెందుకు ఉపవాసమున్నాం? నువ్వెందుకు చూడవు? మమ్మల్ని మేము ఎందుకు తగ్గించుకున్నాం? నువ్వు గమనించలేదు” అని వాళ్ళు అంటారు.
మీ ఉపవాస దినాన మీరు మీకిష్టం వచ్చినట్టు చేస్తూ మీ పనివాళ్ళను కఠినంగా చూస్తారు.
4మీరు ఉపవాసమున్నప్పుడు పోట్లాడుకుంటారు. మీ పిడికిళ్ళతో కొట్టుకుంటారు.
మీరు ఈ రోజుల్లో ఉపవాసముండేది మీ స్వరం పైన వినబడాలని కాదు.
5నేను కోరేది అలాంటి ఉపవాసమా? ప్రతివాడు తనను తాను అణుచుకుంటే సరిపోతుందా?
ఒకడు రెల్లులాగా తలవంచుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద పరచుకుని కూర్చోవడం ఉపవాసమా? అలాంటి ఉపవాసం యెహోవాకు ఇష్టమని మీరనుకుంటారా?
6నేను ఆమోదించే ఉపవాసం ఏదంటే,
దుర్మార్గపు బంధకాలను విప్పడం, కాడిమాను మోకులు తీసేయడం,
అణగారిన వారిని విడిపించడం, ప్రతి కాడినీ విరగగొట్టడం.
7ఆకలితో అలమటించే వాళ్లతో నీ ఆహారం పంచుకోవడం, ఇల్లు లేకుండా తిరిగే పేదవారిని నీ ఇంట్లోకి చేర్చుకోవడం.
దిగంబరిగా నీకెవరైనా కనిపిస్తే, వాడికి బట్టలు ఇవ్వు. నీ సొంత బంధువులకు నీ ముఖం చాటేయవద్దు.
8అప్పుడు నీ వెలుగు, ఉదయకాంతిలాగా ఉదయిస్తుంది. నీ ఆరోగ్యం నీకు త్వరగా లభిస్తుంది.
నీ నీతి, నీకు ముందుగా వెళ్తుంది. యెహోవా మహిమ నీ వెనుక కావలి కాస్తుంది.
9అప్పుడు నువ్వు పిలిస్తే యెహోవా జవాబిస్తాడు. సహాయం కోసం నువ్వు మొర్ర పెడితే “ఇదిగో ఇక్కడే ఉన్నాను” అంటాడు.
ఇతరులను అణిచివేయడం, వేలుపెట్టి చూపిస్తూ నిందించడం, మోసంగా మాట్లాడడం నువ్వు మానుకుంటే,
10ఆకలితో అలమటించే వారికి నీకున్న దానిలోనుంచి ఇచ్చి, బాధితుల అవసరాలను తీర్చి వాళ్ళను తృప్తి పరిస్తే చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది. నీ చీకటి నీకు మధ్యాహ్నం లాగా ఉంటుంది.
11అప్పుడు యెహోవా ఎప్పటికీ నీకు దారి చూపుతూ ఉంటాడు. ఎండిపోయిన నీ ఆత్మను తృప్తిపరుస్తాడు.
నీ ఎముకలను బలపరుస్తాడు. నువ్వు నీరు కట్టిన తోటలాగా ఉంటావు.
ఎన్నడూ ఆగని నీటి ఊటలాగా ఉంటావు.
12పురాతన శిథిలాలను నీ ప్రజలు మళ్ళీ కడతారు. అనేక తరాల నుంచి పాడుగా ఉన్న పునాదులను నువ్వు మళ్ళీ వేస్తావు. నిన్ను “గోడ బాగుచేసేవాడు, నివాసాల కోసం వీధులు మరమ్మత్తు చేసేవాడు” అంటారు.
13విశ్రాంతి దినాన ప్రయాణం చేయకుండా, నా ప్రతిష్ఠిత దినాన్ని నీ సొంత ఆహ్లాదం కోసం వాడకుండా ఉన్నావనుకో.
విశ్రాంతి దినాన్ని మనోహరమైనదిగా భావిస్తూ యెహోవాకు చెందిన విషయాలను పవిత్రంగా గౌరవంగా చేస్తున్నావనుకో.
నీ సొంత వ్యాపారం వదిలేసి విశ్రాంతి దినాన్ని సొంత ఆహ్లాదం కోసం వాడకుండా నీ సొంత మాటలు మాట్లాడకుండా గౌరవిస్తున్నావనుకో.
14అప్పుడు నువ్వు యెహోవా పట్ల ఆనందిస్తావు. దేశంలో ఉన్నత స్థలాలమీద నేను నిన్ను ఎక్కిస్తాను.
నీ పూర్వీకుడు, యాకోబు స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవించేలా చేస్తాను. యెహోవా తెలియచేసిన విషయాలు ఇవే.

Currently Selected:

యెషయా 58: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in