YouVersion Logo
Search Icon

యెషయా 61

61
రక్షణ శుభవార్త
1ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నాడు.
అణగారిన వారికి శుభవార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు.
గుండె పగిలిన వారిని బాగుచేయడానికి బందీలుగా ఉన్నవారికి విడుదల, ఖైదీలకు విముక్తి ప్రకటించడానికి,
2యెహోవా దయావత్సరాన్నీ మన దేవుని ప్రతిదండన దినాన్నీ ప్రకటించడానికి, దుఃఖించే వారందరినీ ఓదార్చడానికి ఆయన నన్ను పంపాడు.
3సీయోనులో దుఃఖించేవారిని చక్కపెట్టడానికి, బూడిదకు బదులు అందమైన తలపాగా, దుఃఖానికి బదులు ఆనందతైలం, కుంగిన మనసు బదులు స్తుతి వస్త్రం వారికివ్వడానికి ఆయన నన్ను పంపాడు.
నీతి విషయంలో మస్తకి వృక్షాలనీ యెహోవా ఘనతకోసం నాటిన చెట్లు అనీ వారిని పిలుస్తారు.
4పురాతన శిథిలాలను వాళ్ళు కడతారు. గతంలో పాడైపోయిన స్థలాలను తిరిగి కడతారు.
తరతరాలనుంచి శిథిలమైపోయిన పట్టణాలను మళ్ళీ నిర్మిస్తారు.
5విదేశీయులు నిలబడి మీ మందలను మేపుతారు. విదేశీయుల పిల్లలు మీ పొలాల్లో ద్రాక్షతోటల్లో పనిచేస్తారు.
6మిమ్మల్ని యెహోవా యాజకులని పిలుస్తారు. మా దేవుని సేవకులని మిమ్మల్ని పిలుస్తారు.
రాజ్యాల ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు. వాటి సమృద్ధిలో మీరు అతిశయిస్తారు.
7మీ అవమానానికి బదులు మీకు రెట్టింపు దీవెనలు వస్తాయి. నిందకు బదులు తమకు లభించిన భాగాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తారు.
తమ దేశంలో రెట్టింపు భాగం వారి స్వాధీనం అవుతుంది. నిత్యానందం వారిది అవుతుంది.
8ఎందుకంటే న్యాయం చేయడం యెహోవా అనే నాకు ఇష్టం. దోచుకోవడం, అన్యాయంగా ఒకడి సొత్తు తీసుకోవడం అంటే నాకు అసహ్యం.
నమ్మకంగా నేను వారికి తిరిగి ఇచ్చేస్తాను. వారితో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను.
9రాజ్యాల్లో వారి సంతతివారు, జాతుల్లో వారి సంతానం పేరు పొందుతారు.
వారిని చూసే వారంతా వారు యెహోవా దీవించినవారని ఒప్పుకుంటారు.
10పెళ్ళికొడుకు అందమైన తలపాగా ధరించుకున్నట్టు, పెళ్ళికూతురు నగలతో అలంకరించుకున్నట్టు
ఆయన నాకు రక్షణ వస్త్రాలు ధరింపచేశాడు. నీతి అనే అంగీ నాకు తొడిగించాడు.
యెహోవాను బట్టి ఎంతో ఆనందిస్తున్నాను. నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉత్సాహపడుతూ ఉంది.
11భూమి మొక్కను మొలిపించేలాగా, మొలిచే వాటిని ఎదిగేలా చేసే తోటలాగా
రాజ్యాలన్నిటిముందు యెహోవా ప్రభువు నీతినీ స్తుతినీ మొలకెత్తేలా చేస్తాడు.

Currently Selected:

యెషయా 61: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in