YouVersion Logo
Search Icon

యెషయా 9

9
మన కోసం ఒక బిడ్డ పుట్టాడు
1యాతనలో ఉన్న దానిపై అలుముకున్న మబ్బు తేలిపోతుంది. పూర్వకాలంలో ఆయన జెబూలూను దేశాన్ని, నఫ్తాలి దేశాన్ని అవమాన పరిచాడు. కాని చివరి కాలంలో ఆయన సముద్ర ప్రాంతాన్ని, అంటే యొర్దాను అవతలి ప్రదేశాన్ని, అన్యప్రజల గలిలయ ప్రదేశాన్నీ మహిమగల దానిగా చేస్తాడు.
2చీకటిలో నడిచిన ప్రజలు గొప్ప వెలుగును చూశారు. చావు నీడ గల దేశనివాసుల మీద వెలుగు ప్రకాశించింది.
3నువ్వు ప్రజలను విస్తరింపజేశావు. వాళ్ళ సంతోషం వృద్ధి చేశావు. కోతకాలంలో మనుషులు సంతోషంగా ఉన్నట్టు, కొల్లసొమ్ము పంచుకునే వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు వాళ్ళు నీ సన్నిధిలో సంతోషంగా ఉన్నారు.
4మిద్యాను దినాన జరిగినట్టు అతని బరువైన కాడిని నువ్వు విరిచావు. అతని మెడ మీద ఉన్న దుంగను, అతణ్ణి తోలే వాడి కొరడాలను విరగగొట్టావు.
5యుద్ధ శబ్దం చేసే పాద రక్షలు, రక్తంలో పొర్లించిన వస్త్రాలు అగ్నిలో కాలి, ఆ అగ్నికి ఇంధనం ఔతాయి.
6ఎందుకంటే మన కోసం ఒక బిడ్డ పుట్టాడు. మనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించడం జరిగింది. ఆయన భుజాల మీద పరిపాలన ఉంటుంది. ఆయనకు ఆశ్చర్యమైన ఆలోచనకర్త, శక్తిశాలి అయిన దేవుడు, శాశ్వతుడైన తండ్రి, శాంతిసమాధానాల అధిపతి అని పేరు.
7ఇకపై పరిమితి లేకుండా దానికి వృద్ధి, విస్తీర్ణం కలిగేలా దావీదు సింహాసనాన్ని, రాజ్యాన్ని నియమిస్తాడు. న్యాయం మూలంగా, నీతి మూలంగా రాజ్యాన్ని స్థిరపరచడానికి శాశ్వతంగా అతడు దావీదు సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తాడు. సేనల ప్రభువైన యెహోవా ఆసక్తితో దీన్ని నెరవేరుస్తాడు.
ఇశ్రాయేలు పై యెహోవా కోపం
8యాకోబుకు విరోధంగా ప్రభువు వార్త పంపినప్పుడు అది ఇశ్రాయేలు మీద పడింది.
9-10“వాళ్ళు ఇటుకలతో కట్టింది పడిపోయింది. కాని మేము చెక్కిన రాళ్లతో కడతాం. అత్తి కర్రతో కట్టింది నరికేశారు, కాని వాటికి బదులుగా దేవదారు కర్రను వాడదాం” అని అతిశయపడి గర్వంతో చెప్పుకునే ఎఫ్రాయిముకూ, షోమ్రోను నివాసులకూ, ప్రజలందరికీ ఈ విషయం తెలుస్తుంది.
11కాబట్టి యెహోవా అతని మీదకి రెజీనును, అతని విరోధిని లేపుతాడు. అతని శత్రువులను రేపుతాడు.
12తూర్పున సిరియా, పడమట ఫిలిష్తీయులు నోరు తెరచి ఇశ్రాయేలును మింగేస్తారు. ఇంత జరిగినా కోపంలో ఉన్న యెహోవా ఆగడు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంది.
13అయినా ప్రజలు తమను కొట్టిన దేవుని వైపు తిరగరు. సేనల ప్రభువైన యెహోవాను వెదకరు.
14కాబట్టి యెహోవా ఇశ్రాయేలులో నుంచి తల, తోక, తాటి మట్ట, రెల్లు అన్నిటినీ ఒకే రోజు నరికేస్తాడు.
15పెద్దలూ, ఘనులూ తల. అసత్యాలు ఉపదేశించే ప్రవక్తలు తోక.
16ఈ ప్రజలను నడిపించే వాళ్ళు ప్రజలను దారి తప్పిస్తున్నారు. వాళ్ళ వెంట నడుస్తున్న వాళ్ళు నాశనమౌతారు.
17వాళ్ళందరూ భక్తిహీనులు, దుర్మార్గులు. ప్రతి నోరు మూర్ఖపు మాటలు మాట్లాడుతుంది. కాబట్టి ప్రభువు వాళ్ళ యువకులను చూసి సంతోషించడు, వాళ్ళల్లో తల్లిదండ్రులు లేని వారి పట్ల అయినా, వాళ్ళ వితంతువుల పట్ల అయినా కరుణ చూపించడు. దీనంతటి బట్టి ఆయన కోపం చల్లారదు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంటుంది.
18దుర్మార్గత అగ్నిలా మండుతుంది. అది గచ్చ పొదలను, బ్రహ్మ జెముడు చెట్లను కాల్చి, అడవి పొదల్లో రాజుకుని, దట్టమైన పొగస్థంభంలా పైకి లేస్తుంది.
19సేనల ప్రభువు అయిన యెహోవా ఉగ్రత వల్ల దేశం కాలి భస్మం అయిపోయింది. ప్రజలు ఆ అగ్నికి ఇంధనంలా ఉన్నారు. ఏ మనిషీ తన సహోదరుణ్ణి కరుణించడు.
20కుడిచేతి మాంసం కోసుకుని తింటారు గాని ఇంకా ఆకలిగానే ఉంటారు. ఎడమచేతి మాంసం కోసుకు తింటారు గాని ఇంకా తృప్తి చెందరు. ప్రతివాడూ తన సొంత చేతి మాంసం కూడా తింటాడు.
21మనష్షే ఎఫ్రాయిమునీ, ఎఫ్రాయిము మనష్షేనీ తినేస్తారు. వీరిద్దరు కలిసి యూదా మీద పడతారు. ఇలా జరిగినా ఆయన కోపం చల్లారదు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంటుంది.

Currently Selected:

యెషయా 9: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in