YouVersion Logo
Search Icon

యాకోబు పత్రిక 3

3
నిజమైన విశ్వాసం నాలుకను అదుపులో ఉంచుతుంది
1నా సోదరులారా, ఉపదేశకులమైన మనకు కఠినమైన తీర్పు ఉందని ఎరిగి మీలో ఎక్కువమంది ఉపదేశం చేసేవారుగా ఉండకండి. 2మనమందరం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. తన మాటలలో తప్పిపోని వాడు లోపం లేనివాడుగా ఉండి తన శరీరాన్ని కూడా అదుపులో పెట్టుకోగలుగుతాడు.
3గుర్రాలు మనకు లోబడడానికి దాని నోటికి కళ్ళెం పెట్టి, దాని శరీరం అంతా మనకు లోబడేలా చేస్తాం కదా! 4ఓడలు పెద్దవిగా ఉన్నా, బలమైన గాలులతో ముందుకు సాగుతున్నా, ఆ ఓడ నడిపేవాడు చిన్న చుక్కానితో దాన్ని తిప్పగలుగుతాడు. 5అలాగే, నాలుక శరీరంలో చిన్న భాగమే అయినా, ప్రగల్భాలు పలుకుతుంది. చిన్న నిప్పు రవ్వ ఎంత పెద్ద అడవిని తగల బెడుతుందో గమనించండి! 6నాలుక కూడా ఒక అగ్ని. పాప ప్రపంచం మన శరీరంలో అమర్చి ఉన్నట్టు అది ఉండి, శరీరమంతటినీ మలినం చేసి, జీవన మార్గాన్ని తగలబెడుతుంది. తరవాత నరకాగ్నికి గురై కాలిపోతుంది.
7అన్ని రకాల అడవి మృగాలను, పక్షులను, పాకే ప్రాణులను, సముద్ర జీవులను మానవుడు తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు, తెచ్చుకున్నాడు కూడా. 8కాని, మనుషుల్లో ఏ ఒక్కరూ నాలుకను ఆధీనంలో ఉంచుకోలేక పోతున్నారు. అది ఎడతెగని దుష్టత్వం. అది మరణం కలిగించే విషంతో నిండి ఉంది. 9నాలుకతో మన ప్రభువైన తండ్రిని స్తుతిస్తాం. అదే నాలుకతో దేవుని పోలికలో ఉన్న మనిషిని శపిస్తాం. 10ఒకే నోటినుంచి స్తుతి, శాపం రెండూ బయటకు వస్తాయి. నా సోదరులారా, ఇలా ఉండకూడదు. 11ఒకే ఊటలోనుంచి మంచి నీళ్ళు, చేదు నీళ్ళు, రెండూ ఊరుతాయా? 12నా సోదరులారా, అంజూరపు చెట్టుకు ఒలీవ పళ్ళు, ద్రాక్ష తీగెలకు అంజూరుపళ్ళు కాస్తాయా? అదేవిధంగా, ఉప్పునీటి ఊట నుంచి మంచి నీళ్ళు రావు.
13మీలో, జ్ఞానం, గ్రహింపు ఉన్నవాడు ఎవడు? అలాటివాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపించాలి. 14కాని, మీ హృదయంలో తీవ్రమైన అసూయ, శత్రుభావం ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి. 15ఇలాంటి జ్ఞానం పైనుంచి వచ్చింది కాదు. ఇది భూలోక సంబంధమైనది, ఆధ్యాత్మికం కానిది, సైతానుకు చెందింది.
16ఎక్కడైతే అసూయ, శత్రుభావం ఉంటాయో, అక్కడ గందరగోళం, ప్రతి విధమైన కిరాతకం ఉంటాయి. 17అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదటగా పవిత్రం. తదుపరి అది శాంతిని కాంక్షిస్తుంది, మృదువుగా ఉంటుంది, ప్రేమతో నిండినది. సమ్మతి గలది. కనికరంతో మంచి ఫలాలతో నిండినది, పక్షపాతం లేకుండా నిజాయితీ గలది. 18శాంతిని చేకూర్చేవారు శాంతితో విత్తనాలు చల్లినందువల్ల నీతి ఫలం దొరుకుతుంది.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in