YouVersion Logo
Search Icon

యాకోబు పత్రిక 4

4
లోకరీతి ప్రవర్తనకు మందలింపు
1మీలో తగాదాలూ, అభిప్రాయభేదాలూ ఎక్కడ నుండి వస్తున్నాయి? మీ సాటి విశ్వాసుల్లో వివాదాలకు కారణమైన మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా? 2మీకు లేని వాటిని కోరుకుంటారు. మీరు పొందలేని దాని వెనకాల పరుగులు పెడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నారు, తగాదాలాడుతున్నారు కానీ దేవుణ్ణి అడగరు కాబట్టి మీరేదీ పొందరు.
3మీరడిగినా మీకేమీ దొరకదు. ఎందుకంటే మీ సుఖభోగాల కోసం ఖర్చు చేసేందుకు చెడ్డ వాటిని అడుగుతారు. 4కులటలారా, లోకంతో స్నేహం చేయడం అంటే దేవునితో శత్రుత్వమని మీకు తెలియదా? దాన్ని బట్టి ఈ లోకంతో స్నేహం చేయాలనుకునేవాడు దేవునికి శత్రువు అవుతాడు. 5ఆయన మనలో ఉంచిన ఆత్మ మనలను తీవ్రమైన ఆసక్తితో కోరుకుంటాడు అని లేఖనం చెబుతున్నది. ఆ లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా? 6కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది.
7కాబట్టి దేవునికి లోబడి ఉండండి. సాతానును ఎదిరించండి. వాడు మీ దగ్గరనుంచి పారిపోతాడు. 8దేవునికి సమీపంగా రండి. ఆయన మీకు దగ్గరగా వస్తాడు. పాపులారా, మీ చేతులను పరిశుభ్రం చేసుకోండి. చపలచిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి. 9చపలచిత్తులారా విలపించండి. మీ నవ్వును విచారానికీ, మీ ఆనందాన్ని చింతకూ మార్చుకోండి. 10ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.
11సోదరులారా, మీలో ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడకండి. తన సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేక తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నాడు. ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నావంటే ధర్మశాస్త్రానికి నువ్వు లోబడడం లేదని అర్థం. ధర్మశాస్త్రానికే న్యాయాధిపతిగా వ్యవహరిస్తున్నావని అర్థం. 12ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందీ తీర్పు తీర్చేదీ ఒక్కరే. దేవుడే! ఆయనే రక్షించడానికీ నాశనం చేయడానికీ సమర్ధుడు. ఇతరులకి తీర్పు తీర్చడానికి నువ్వెవరు?
13“నేడో రేపో ఫలానా పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకుందాం” అనుకునే వారికి ఒక మాట. 14రేపేం జరుగుతుందో ఎవరికీ తెలుసు? అసలు నీ జీవితం ఏపాటిది? కాసేపు కనిపించి మాయమై పోయే ఆవిరిలాంటిది.
15కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే ఈ రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి. 16ఇప్పుడైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం చెడ్డది. 17మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in