YouVersion Logo
Search Icon

యిర్మీయా 1

1
1బెన్యామీను గోత్ర ప్రాంతంలోని అనాతోతులో నివసించే యాజకుల్లో ఒకడు, హిల్కీయా కొడుకు అయిన యిర్మీయా పలుకులు. 2ఆమోను కొడుకు యోషీయా యూదాకు రాజుగా ఉన్నప్పుడు అతని పాలనలో 13 వ సంవత్సరం యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమయ్యాడు. 3యోషీయా కొడుకు యెహోయాకీము యూదాకు రాజుగా ఉన్న రోజుల్లో, యోషీయా కొడుకు సిద్కియా యూదాను పాలించిన 11 వ సంవత్సరం అయిదో నెలలో యెరూషలేము ప్రజలు చెరలోకి వెళ్ళే వరకూ ఆ వాక్కు అతనికి ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు.
యిర్మీయా పిలుపు
4యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు,
5“నీ తల్లి గర్భంలో నీకు రూపం రాక ముందే నువ్వు నాకు తెలుసు. నువ్వు గర్భం నుండి బయట పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించాను.
జనాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను.”
6అందుకు నేను “అయ్యో, యెహోవా ప్రభూ, నేను చిన్న పిల్లవాణ్ణి కదా, నాకు మాట్లాడడం చేత కాదు” అన్నాను.
7అయితే యెహోవా నాతో ఇలా అన్నాడు. “నేను పిల్లవాణ్ణి అనవద్దు. నేను నిన్ను పంపేవారందరి దగ్గరకీ నువ్వు వెళ్ళాలి.
నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారితో చెప్పాలి.
8వారికి భయపడవద్దు. నిన్ను విడిపించడానికి నేను నీతో ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు.”
9అప్పుడు యెహోవా తన చేత్తో నా నోరు తాకి ఇలా అన్నాడు. “ఇదిగో, నేను నా మాటలు నీ నోటిలో ఉంచాను.
10పెళ్లగించడానికీ విరగగొట్టడానికీ నశింపజేయడానికీ కూలదోయడానికీ కట్టడానికీ నాటడానికీ
నేను ఈ రోజు జనాల మీదా రాజ్యాల మీదా నిన్ను నియమించాను.”
11యెహోవా వాక్కు నాకు కనబడి “యిర్మీయా, నీకేం కనబడుతున్నది?” అని అడిగాడు. అందుకు నేను “బాదం చెట్టు కొమ్మ కనబడుతున్నది” అన్నాను. 12అప్పుడు యెహోవా “నువ్వు బాగా కనిపెట్టావు. నేను చెప్పిన మాటలు నెరవేర్చడానికి నాకు ఆత్రుతగా ఉంది” అన్నాడు.
13రెండోసారి యెహోవా వాక్కు నాకు కనబడి “నీకేం కనబడుతున్నది?” అని అడగ్గా, నేను “మరుగుతున్న బాన ఒకటి నాకు కనబడుతున్నది. అది ఉత్తరం వైపుకు తిరిగి ఉంది” అన్నాను. 14అందుకు యెహోవా ఇలా చెప్పాడు. “ఉత్తరం నుండి ఈ దేశప్రజల మీదికి వినాశనం రాబోతున్నది. 15ఇదిగో, నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యాల జాతులన్నిటినీ పిలుస్తాను. వారిలో ప్రతివాడూ యెరూషలేము ద్వారాల్లో, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలన్నిటికీ యూదా పట్టణాలన్నిటికీ ఎదురుగా తమ ఆసనాలు వేసుకుని కూర్చుంటారు. 16అప్పుడు యెరూషలేము ప్రజలు నన్ను విడిచి అన్యదేవుళ్ళకు ధూపం వేసి, తమ స్వంత చేతులతో చేసిన విగ్రహాలను పూజించి చేసిన చెడుతనాన్ని బట్టి నేను వారిపై నా తీర్పులు ప్రకటిస్తాను.”
17“కాబట్టి లేచి నిలబడు! నేను నీకాజ్ఞాపించినదంతా వారికి ప్రకటించు. నువ్వు వారికి భయపడ వద్దు. లేదా, నేనే నీకు వారంటే భయం పుట్టిస్తాను. 18యూదా రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, యాజకుల దగ్గరికి, దేశ ప్రజల దగ్గరికి, ఈ దేశంలో నీవెక్కడికి పోయినా, నిన్ను ఒక ప్రాకారం ఉన్న పట్టణంగా, ఇనప స్తంభంగా, ఇత్తడి గోడగా ఉండేలా ఈ రోజు నియమించాను. 19వారు నీతో యుద్ధం చేస్తారు గాని నిన్ను కాపాడడానికి నేను నీతో ఉన్నాను కాబట్టి వారు నీపై విజయం పొందలేరు. ఇదే యెహోవా వాక్కు.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in