YouVersion Logo
Search Icon

యోబు 39

39
1అడవిలోని కొండమేకలు ఈనే కాలం నీకు తెలుసా? లేళ్లు పిల్లలు పెట్టే కాలం నువ్వు గ్రహించగలవా?
2అవి కడుపుతో ఉండే నెలలెన్నో నువ్వు లెక్క పెట్టగలవా? అవి ఈనే కాలం తెలుసా?
3అవి వంగి తమ పిల్లలను కంటాయి. వాటి పురిటి నొప్పులు తీరుతాయి.
4వాటి పిల్లలు పుష్టిగా పర్రల్లో పెరుగుతాయి. అవి తల్లులను విడిచిపెట్టి పోయి మళ్లీ వాటి దగ్గరికి తిరిగి రావు.
5అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? గంతులు వేసే గాడిద కట్లు విప్పిన వాడెవడు?
6నేను అడివిని దానికి ఇల్లుగాను ఉప్పుపర్రను దానికి నివాసస్థలంగాను నియమించాను.
7పట్టణపు రణగొణధ్వనులను చూసి అది తిరస్కారంగా నవ్వుతుంది. తోలేవాడి అదిలింపులు అది వినదు.
8పర్వతాల వరుస దానికి మేతభూమి. అన్ని రకాల పచ్చని మొలకలను అది వెతుక్కుంటుంది.
9అడివి దున్న నీకు సంతోషంగా ఊడిగం చేస్తుందా? అది నీ కొట్టంలో ఉండడానికి ఒప్పుకుంటుందా?
10పగ్గం వేసి అడివి దున్నను నాగలి దున్నించ గలవా? దాన్ని తోలుకుపోయి పల్లాలను చదును చేయించగలవా?
11అది మహా బలిష్ఠమైనదని దాన్ని నువ్వు నమ్ముతావా? చెయ్యమని దానికి నీ పని అప్పగిస్తావా?
12అది నీ ధాన్యాన్ని ఇంటికి తెస్తుందని దానిపై ఆధారపడతావా? కళ్ళంలో ఉన్న ధాన్యాన్ని అది పోగు చేస్తుందని నమ్ముతావా?
13నిప్పుకోడి గర్వంగా రెక్కలు ఆడిస్తుంది. కానీ అవి ప్రేమపూర్వకమైన రెక్కలా, ఈకలా?
14లేదు సుమా, అది దాని గుడ్లు నేలపై పెడుతుంది. ఇసుకే వాటిని పొదుగుతుంది.
15దేని పాదమైనా వాటిని తొక్కుతుందని అయినా, అడవిజంతువు ఏదైనా వాటిని చితకగొడుతుందేమోనని అయినా అది మర్చిపోతుంది.
16తన పిల్లలు తనవి కానట్టు వాటి పట్ల అది కఠినంగా ఉంటుంది. దాని కష్టం వ్యర్థమైపోయినా దానికి చింత లేదు.
17దేవుడు దాన్ని తెలివిలేనిదిగా చేశాడు. ఆయన దానికి వివేచనాశక్తి ఇవ్వలేదు.
18అది వడిగా పరిగెత్తితే గుర్రాన్ని, దానిపై స్వారీ చేసే వాణ్ణి చూసి హేళనగా నవ్వుతుంది.
19గుర్రానికి నువ్వు బలం ఇచ్చావా? జూలు వెంట్రుకలతో దాని మెడను నువ్వే కప్పావా?
20మిడతవలె అది కదం తొక్కేలా చేశావా? దాని సకిలింపు ధ్వని భీకరం.
21అది కాలు దువ్వి తన బలాన్నిబట్టి రేగిపోతుంది. అది ఆయుధాలను ఎదుర్కోడానికి ముందుకు దూకుతుంది.
22అది భయాన్ని వెక్కిరిస్తుంది. హడలిపోదు. కత్తిని చూసి వెనక్కి తగ్గదు.
23దాని వీపుపై అంబుల పొది, తళతళలాడే ఈటెలు బల్లేలు గలగలలాడినప్పుడు,
24పట్టరాని కోపంతో అది పరుగులు పెడుతుంది. అది భేరీనాదం విని ఉరకలు వేస్తుంది.
25బాకా ధ్వని వినబడినప్పుడెల్లా అది హుంకరిస్తుంది. దూరం నుండి యుద్ధవాసన పసిగడుతుంది. సేనాధిపతుల సింహనాదాలను, కదనఘోషను వింటుంది.
26డేగ నీ జ్ఞానం చేతనే ఎగురుతుందా? అది నీ ఆజ్ఞ వలననే తన రెక్కలు దక్షిణ దిక్కుకు చాస్తుందా?
27గరుడ పక్షి నీ ఆజ్ఞకు లోబడే ఆకాశవీధి కెక్కుతుందా? తన గూడును ఎత్తయిన చోట కట్టుకుంటుందా?
28అది కొండశిఖరాలపై నివసిస్తుంది. కొండకొనపై ఎవరూ ఎక్కలేని చోట గూడు కట్టుకుంటుంది.
29అక్కడ నుండి తన ఎరను వెతుకుతుంది. దాని కళ్ళు దాన్ని దూరం నుండి కనిపెడతాయి.
30దాని పిల్లలు రక్తం తాగుతాయి. హతులైనవారు ఎక్కడ ఉంటారో అక్కడే అది ఉంటుంది.

Currently Selected:

యోబు 39: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in