YouVersion Logo
Search Icon

యోబు 41

41
1నువ్వు జలరాక్షసిని#41:1 జలరాక్షసిని లివయాటాన్ను గాలంతో లాగగలవా? దాని దవడలను తాడుతో బిగించగలవా?
2నువ్వు దాని ముక్కుకు పగ్గం వేయగలవా? దాని దవడకు కొంకి ఎక్కించగలవా?
3అది నీకు విన్నపాలు చేస్తుందా? మృదువైన మాటలు నీతో పలుకుతుందా?
4నువ్వు శాశ్వతంగా దాన్ని సేవకుడుగా చేసుకునేలా అది నీతో ఒప్పందం చేస్తుందా?
5నువ్వు ఒక పిట్టతో ఆటలాడినట్టు దానితో ఆటలాడతావా? నీ పనిపిల్లలు ఆడుకోడానికి దాని కట్టివేస్తావా?
6బెస్తవాళ్ళు దానితో బేరాలు చేస్తారా? వారు దాన్ని తునకలు చేసి వర్తకులతో వ్యాపారం చేస్తారా?
7దాని ఒంటినిండా ఇనప శూలాలు గుచ్చగలవా? దాని తలనిండా చేప అలుగులు గుచ్చగలవా?
8దాని మీద చెయ్యి వేసి చూడు, దానితో కలిగే పోరు నువ్వు గుర్తు చేసుకుంటే నువ్వు మళ్ళీ అలా చెయ్యవు.
9దాన్ని చూస్తే చాలు, మనుషులు దాన్ని వశపరచుకోవచ్చనే ఆశ వదులుకుంటారు. దాని చూస్తే చాలు ఎవరికైనా గుండెలు అవిసిపోతాయి.
10సముద్ర రాక్షసిని రేపడానికి తెగించే శూరుడు లేడు. అలా ఉండగా నా ఎదుట నిలవగలవాడెవడు?
11నేను తిరిగి చెల్లించేలా నాకెవరైనా ఏమైనా ఇచ్చారా? ఆకాశం కింద ఉన్నదంతా నాదే గదా.
12సముద్ర రాక్షసి కాళ్ళను గురించైనా దాని మహా బలాన్ని గురించైనా దాని చక్కని ఆకారాన్ని గురించైనా పలకకుండా మౌనంగా ఉండను.
13ఎవడైనా దాని పై పొరలను లాగివేయగలడా? దాని రెండు కవచాలను గుచ్చి రంధ్రం చేయగలడా?
14దాని భయంకరమైన కోరలు ఉన్న ముఖ ద్వారాలను తెరవగల వాడెవడు?
15దాని వీపుకు దృఢమైన పొలుసులు అతికి ఉన్నాయి. విడదీయలేనంత గట్టిగా అవి కూర్చి ఉన్నాయి.
16అవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నాయి. వాటి మధ్యకు గాలి ఏమాత్రం చొరబడదు.
17అవి ఒకదానితో ఒకటి అతికి ఉన్నాయి. వాటిని ఛేదించడం ఎవరివల్లా కాదు.
18అది తుమ్మితే వెలుగు చిమ్ముతుంది.
దాని కళ్ళు ఉదయకాలపు కనురెప్పల్లాగా ఉన్నాయి.
19దాని నోటి నుండి మండే నిప్పులు బయలుదేరుతాయి. అగ్ని కణాలు దాని నుండి లేస్తాయి.
20పొయ్యిపై మసులుతున్న కాగులోనుండి, బాగా గాలి విసిరి రాజబెట్టిన మంటలోనుండి లేచినట్టు దాని నాసికా రంధ్రాల్లో నుండి పొగ లేస్తుంది.
21దాని ఊపిరి నిప్పులను మండిస్తుంది. దాని నోటి నుండి జ్వాలలు బయలుదేరుతాయి.
22దాని మెడలో బలముంది. భయం దాని ఎదుట తాండవమాడుతూ ఉంటుంది.
23దాని దళసరి కండరాలు గట్టిగా అతికి ఉన్నాయి. అవి దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నాయి. అవి ఊడి రావు.
24దాని గుండె రాయి లాగా గట్టిగా ఉంది. అది తిరగలి కింది దిమ్మంత కఠినం.
25అది లేచేటప్పుడు మహామహులు సైతం భయపడతారు. భయంతో వారు వెనక్కి తగ్గుతారు.
26కత్తి దెబ్బ దాన్ని ఏమీ చెయ్యదు. ఈటె, బాణం, పదునైన ఏ అయుధమైనా పనికి రావు.
27అది ఇనుమును గడ్డిపోచగా, ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగా చూస్తుంది.
28బాణం దాన్ని తరిమి కొట్టలేదు. వడిసెల రాళ్లు దాని దృష్టికి పొట్టులాగా ఉన్నాయి.
29గదలను అది గడ్డిపరకలుగా ఎంచుతుంది. అది రివ్వున ఎగిరి వచ్చే ఈటెను చూసి నవ్వుతుంది.
30దాని ఉదర భాగాలు కరుకైన గాజు పెంకుల్లాగా ఉన్నాయి. అది బురద మీద నురిపిడి కొయ్యలాంటి తన తోకను పరచుకుంటుంది.
31కాగులో నీళ్ళు మసిలినట్టు మహాసముద్రాన్ని అది పొంగిస్తుంది. సముద్రాన్ని అది నూనెలాగా చేస్తుంది.
32అది తాను నడచిన దారిని తన వెనక ప్రకాశింప జేస్తుంది. చూసే వారు అగాధ జలం తెల్లగా ఉంది అనుకుంటారు.
33అది నిర్భయంగా జీవిస్తుంది. భూమి మీద దానికి సమానమైనది లేదు.
34అది గర్వంగా ఉండే వాటిని తిరస్కారంగా చూస్తుంది. గర్వించే వాటన్నిటికీ అది రాజు.

Currently Selected:

యోబు 41: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in