YouVersion Logo
Search Icon

యెహో 1

1
యెహోషువకు యెహోవా ఆదేశాలు
1యెహోవా తన సేవకుడు మోషే చనిపోయిన తరువాత, నూను కుమారుడు, మోషే పరిచారకుడు అయిన యెహోషువకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు. “నా సేవకుడు మోషే చనిపోయాడు. 2కాబట్టి నీవు లేచి, నీవూ ఈ ప్రజలందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇస్తున్న దేశానికి వెళ్ళండి. 3నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్నీ మీకు ఇచ్చాను.
4ఈ అరణ్యం, లెబానోను నుండి యూఫ్రటీసు మహానది వరకూ, హిత్తీయుల దేశమంతా, పడమట మహాసముద్రం వరకూ మీకు సరిహద్దు. 5నీవు జీవించే రోజులన్నిటిలో ఎవ్వరూ నీ ముందు నిలవలేరు, నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకూ తోడుగా ఉంటాను. నిన్ను విడిచి పెట్టను, వదిలెయ్యను. 6నిబ్బరంగా, ధైర్యంగా ఉండు. వారికిస్తానని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశాన్ని కచ్చితంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు.
7అయితే నీవు నిబ్బరంగా, ధైర్యంగా, అతి జాగ్రత్తగా నా సేవకుడు మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతా శ్రద్ధగా పాటించాలి. నీవు వెళ్ళే ప్రతి చోటా విజయం సాధించేలా నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. 8ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు ఎప్పుడూ బోధిస్తూ ఉండాలి. దానిలో రాసి ఉన్న వాటన్నిటినీ చేయడానికి నీవు జాగ్రత్త పడేలా రాత్రీ పగలూ దాన్ని ధ్యానించినట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్లజేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. 9నేను ఆజ్ఞ ఇచ్చాను గదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, భయపడకు. నీవు నడిచే మార్గమంతా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు.”
10అప్పుడు యెహోషువ ప్రజల నాయకులకు ఇలా ఆజ్ఞాపించాడు “మీరు శిబిరంలోకి వెళ్లి ప్రజలతో ఈ మాట చెప్పండి, 11‘మీరు స్వంతం చేసుకోడానికి మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకోడానికి మూడు రోజుల్లోపు ఈ యొర్దాను నది దాటాలి. కాబట్టి ఆహారం సిద్ధపరచుకోండి.’”
12రూబేనీయులకు గాదీయులకు మనష్షే అర్థగోత్రపువారికి యెహోషువ ఇలా ఆజ్ఞాపించాడు, 13“యెహోవా సేవకుడు మోషే మీ కు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. అదేమంటే, మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలిగించబోతున్నాడు, ఆయన ఈ దేశాన్ని మీకిస్తాడు. 14మీ భార్యలూ మీ పిల్లలూ మీ పశువులూ యొర్దాను అవతల మోషే మీకిచ్చిన దేశంలో నివసించాలి. అయితే పరాక్రమ వంతులు, శూరులైన మీరంతా యుద్ధసన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా 15నది దాటి, యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకూ విశ్రాంతి దయచేసే వరకూ, అంటే మీ దేవుడైన యెహోవా వారికిచ్చే దేశాన్ని స్వాధీనపరచుకొనే వరకూ మీరూ సహాయం చేయాలి. ఆ తరువాతే తూర్పున యొర్దాను ఇవతల యెహోవా సేవకుడు మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశంలోకి మీరు తిరిగి వచ్చి దాన్ని స్వంతం చేసుకుంటారు.”
16దానికి వారు “నీవు మా కాజ్ఞాపించినదంతా చేస్తాం. నువ్వు మమ్మల్ని ఎక్కడికి పంపినా అక్కడికి వెళ్తాం. 17మోషే చెప్పిన ప్రతి మాటా మేము విన్నట్టు నీ మాటా వింటాం. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడుగా ఉన్నట్టు నీకూ తోడై ఉంటాడు గాక. 18నీమీద తిరగబడి నీవు ఆజ్ఞాపించే ప్రతి విషయంలో నీ మాట వినని వారంతా మరణశిక్ష పొందుతారు, నీవు నిబ్బరంగా ధైర్యంగా ఉండు” అని యెహోషువతో చెప్పారు.

Currently Selected:

యెహో 1: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యెహో 1