YouVersion Logo
Search Icon

లేవీ 24

24
రొట్టెలు, ఒలీవ నూనె నిత్యమూ దేవుని సన్నిధిలో ఉండాలి
1యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. 2“దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా ప్రమిదల కోసం దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవ నూనె తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. 3ప్రత్యక్ష గుడారంలో #24:3 నిబంధన మందసం తెర శాసనాల అడ్డతెర బయట అహరోను సాయంత్రం నుండి ఉదయం దాకా అది వెలుగుతూ ఉండేలా యెహోవా సన్నిధిలో దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఇది మీ తరతరాలకు నిత్యమైన శాసనం. 4అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రమిదలను యెహోవా సన్నిధిలో నిత్యం చూసుకోవాలి.
5నీవు గోదుమ పిండి తీసుకుని దానితో పన్నెండు రొట్టెలు చెయ్యాలి. ఒక్కొక్క రొట్టెకు రెండు కిలోల పిండి వాడాలి. 6యెహోవా సన్నిధిలో నిర్మలమైన బల్లమీద ఆరేసి రొట్టెలున్న రెండు దొంతులుగా వాటిని ఉంచాలి. 7ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచాలి. అది యెహోవా కోసం పరిమళ హోమం. 8యాజకుడు ప్రతి విశ్రాంతి దినాన నిత్య నిబంధన ప్రకారం ఇశ్రాయేలీయుల పక్షంగా ఆ రొట్టెలు బల్లపై పెడుతూ ఉండాలి. 9ఈ అర్పణ అహరోనుకు అతని సంతానానికి. వారు పరిశుద్ధస్థలం లో దాన్ని తినాలి. నిత్య శాసనం చొప్పున యెహోవాకు చేసే హోమాల్లో అది అతి పవిత్రం.”
దైవదూషణకు రాళ్ల శిక్ష
10ఒక ఇశ్రాయేలు జాతి స్త్రీకి ఐగుప్తు పురుషుడికి పుట్టిన ఒకడు ఇశ్రాయేలీయులతో కలిసి వచ్చాడు. 11ఆ ఇశ్రాయేలీయురాలి కొడుక్కి ఒక ఇశ్రాయేలీయుడికి శిబిరంలో గొడవ జరిగింది. ఆ ఇశ్రాయేలీయురాలి కొడుకు యెహోవా నామాన్ని దూషించి శపించాడు. ప్రజలు మోషే దగ్గరికి వాణ్ణి తీసుకొచ్చారు. వాడి తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడు దిబ్రీ కూతురు. 12యెహోవా ఏమి చెబుతాడో తెలిసేదాకా వాణ్ణి కావలిలో ఉంచారు. 13అప్పుడు యెహోవా మోషేకు ఇలా చెప్పాడు.
14“శపించిన వాణ్ణి శిబిరం బయటికి తీసుకురా. వాడు పలికిన శాపనార్థాలు విన్న వారంతా వాని తల మీద చేతులుంచిన తరవాత ప్రజలంతా రాళ్లతో వాణ్ణి చావగొట్టాలి. 15నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. తన దేవుణ్ణి శపించేవాడు తన పాపశిక్షను భరించాలి. 16యెహోవా నామాన్ని దూషించేవాడికి మరణశిక్ష విధించాలి. ప్రజలంతా రాళ్లతో అలాటి వాణ్ణి చావ గొట్టాలి. పరదేశిగాని స్వదేశిగాని యెహోవా నామాన్ని దూషిస్తే వాడికి మరణశిక్ష విధించాలి.
17ఎవడైనా హత్య చేసినట్టయితే వాడికి మరణశిక్ష విధించాలి. 18జంతువు ప్రాణం తీసినవాడు ప్రాణానికి ప్రాణమిచ్చి దాని నష్టపరిహారం చెల్లించాలి. 19ఒకడు తన సాటి మనిషిని గాయపరిస్తే వాడు చేసినట్టే వాడికీ చెయ్యాలి. 20ఎముక విరగ్గొడితే వాడి ఎముక విరగ్గొట్టాలి. కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకడు వేరొకడికి గాయం చేస్తే వాడికి అదే చెయ్యాలి.
21జంతువును చావగొట్టినవాడు దాని నష్టపరిహారం ఇచ్చుకోవాలి. హత్య చేసినవాడికి మరణశిక్ష విధించాలి. 22మీరు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలి. మీలో నివసించే పరదేశికి మీరు చేసినట్టే మీ స్వజాతివారికీ చెయ్యాలి. నేను మీ దేవుడినైన యెహోవానని వారితో చెప్పు” అన్నాడు.
23కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో “దేవుణ్ణి శాపనార్థాలు పెట్టిన వాణ్ణి శిబిరం బయటికి తీసుకుపోయి రాళ్లతో చావగొట్టండి” అని చెప్పాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేశారు.

Currently Selected:

లేవీ 24: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in