YouVersion Logo
Search Icon

లూకా 5

5
కోకొల్లలుగా చేపలు
యోహా 21:6-8
1ఒక రోజు యేసు గెన్నేసరెతు సరస్సు తీరాన నిలబడి ఉన్నాడు. ప్రజలు గుంపుగూడి ఆయనపైకి తోసుకువస్తూ దేవుని వాక్కు వింటూ ఉన్నారు. 2ఆ సరస్సు తీరాన ఉన్న రెండు పడవలను ఆయన చూశాడు. చేపలు పట్టేవారు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు.
3పడవల్లో సీమోను పడవ ఒకటి. యేసు ఆ పడవ ఎక్కి ఒడ్డు నుండి కొంచెం దూరం తోయమని అతన్ని అడిగాడు. అప్పుడాయన దానిలో కూర్చుని ప్రజలకు బోధించాడు.
4ఆయన మాట్లాడడం అయిపోయిన తరువాత సీమోనుతో, “పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి” అన్నాడు. 5సీమోను, “స్వామీ, రాత్రంతా మేము కష్టపడ్డాం గాని ఏమీ దొరకలేదు. అయినా నీ మాటను బట్టి వల వేస్తాను” అని ఆయనతో అన్నాడు. 6వారలా చేసినప్పుడు విస్తారంగా చేపలు పడి వారి వలలు పిగిలి పోసాగాయి. 7వారు వేరే పడవల్లోని తమ సహచరులను వచ్చి తమకు సహాయం చేయమని వారికి సైగలు చేశారు. వారు వచ్చి రెండు పడవల నిండా చేపలు ఎంతగా నింపారంటే ఆ బరువుకు పడవలు మునిగిపోసాగాయి.
8సీమోను పేతురు అది చూసి, యేసు మోకాళ్ళ ముందు పడి, “ప్రభూ, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళు” అన్నాడు. 9ఎందుకంటే అతడూ అతనితో ఉన్న వారంతా తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు.
10వీరిలో సీమోను జతగాళ్ళు జెబెదయి కుమారులు యాకోబు, యోహాను కూడా ఉన్నారు. అందుకు యేసు సీమోనుతో, “భయపడకు! ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టే వాడివవుతావు” అన్నాడు. 11వారు పడవలను ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయనను అనుసరించారు.
యేసు కుష్టరోగిని స్వస్థపరచడం
మత్తయి 8:2-4; మార్కు 1:40-44
12యేసు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒళ్లంతా కుష్టు రోగంతో ఒకడు వచ్చాడు. యేసును చూడగానే అతడు సాగిలపడి, “ప్రభూ! నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను వేడుకున్నాడు. 13అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకి, “నాకిష్టమే. బాగు పడు” అన్నాడు. వెంటనే అతని కుష్టు వ్యాధి పోయింది. 14“ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. అయితే వెళ్ళి యాజకునికి కనబడు. వారికి సాక్ష్యంగా శుద్ధి కోసం మోషే విధించిన దాన్ని అర్పించు” అని యేసు అతన్ని ఆదేశించాడు.
15అయితే ఆయనను గురించిన సమాచారం ఇంకా ఎక్కువగా వ్యాపించింది. ప్రజలు గుంపులు గుంపులుగా, ఆయన బోధ వినడానికీ తమ రోగాలను బాగుచేసుకోడానికీ వచ్చారు. 16అయితే ఆయన తరచుగా జన సంచారం లేని చోటులకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకునేవాడు.
పక్షవాత రోగి స్వస్థత
మత్తయి 9:2-8; మార్కు 2:1-12
17ఒక రోజు ఆయన బోధిస్తున్నపుడు గలిలయ, యూదయ ప్రాంతాల్లోని చాలా ఊళ్ళ నుండీ యెరూషలేము నుండీ వచ్చిన పరిసయ్యులూ ధర్మశాస్త్రోపదేశకులూ అక్కడ కూర్చుని ఉన్నారు. స్వస్థపరచే ప్రభువు శక్తి ఆయనలో ఉంది.
18కొందరు మనుషులు పక్షవాత రోగిని పరుపు మీద మోసుకు వచ్చారు. అతణ్ణి లోపలికి తెచ్చి, ఆయన ముందు ఉంచాలని చూశారు గాని 19ప్రజలు కిక్కిరిసి ఉండడం చేత అతణ్ణి లోపలికి తేవడానికి వీలు కాలేదు. కాబట్టి, వారు ఇంటికప్పు మీదికెక్కి పెంకులు తీసి పరుపుతో పాటు రోగిని సరిగ్గా యేసు ముందే దింపారు.
20యేసు వారి విశ్వాసం చూసి, “అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు. 21శాస్త్రులూ పరిసయ్యులూ, “దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు ఎవరు క్షమించగలరు?” అనుకున్నారు 22యేసు వారి ఆలోచన గ్రహించి, “మీరు మీ హృదయాల్లో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? 23ఏది సులభమంటారు? ‘నీ పాపాలు క్షమిస్తున్నాను’ అనడమా, ‘లేచి నడువు’ అనడమా? 24అయితే మనుష్యకుమారుడికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి” అన్నాడు.
తరువాత పక్షవాత రోగిని చూసి, “లేచి, నీ పరుపు తీసుకుని ఇంటికి వెళ్ళు” అన్నాడు. 25వెంటనే వాడు వారి ముందే లేచి నిలబడి, తాను పడుకున్న పరుపు ఎత్తుకుని, దేవుణ్ణి స్తుతిస్తూ తన ఇంటికి వెళ్ళాడు. 26అందరూ విస్మయం చెంది, “ఈ రోజు విచిత్రమైన విషయాలు చూశాం” అని దేవుణ్ణి స్తుతిస్తూ భయంతో నిండిపోయారు.
మత్తయికి పిలుపు
మత్తయి 9:9; మార్కు 2:13-14
27ఆ తరువాత ఆయన బయటికి వెళ్ళి పన్నులు వసూలు చేసే లేవీ అనే ఒక వ్యక్తిని చూశాడు. అతడు పన్నులు కట్టించుకొనే చోట కూర్చుని ఉన్నాడు. ఆయన అతనితో, “నా వెంట రా” అన్నాడు. 28అతడు అంతా విడిచిపెట్టి, లేచి ఆయనను అనుసరించాడు. 29లేవీ తన ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసే వారూ వేరే వారూ వారితో కూడ భోజనానికి కూర్చున్నారు.
మతాధికారులతో వాదం
మత్తయి 9:10-17; మార్కు 2:16-22
30పరిసయ్యులూ వారి శాస్త్రులూ, “మీరు పన్నులు వసూలు చేసే వారితో, పాపులతో కలిసి తిని తాగుతున్నారేంటి?” అని శిష్యుల మీద సణుక్కున్నారు. 31అందుకు యేసు, “రోగులకే గాని ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కర లేదు. 32పశ్చాత్తాప పడడానికి నేను పాపులనే పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను కాదు” అన్నాడు. 33వారాయనతో, “యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారు. పరిసయ్యుల శిష్యులు కూడా అలాగే చేస్తారు. కానీ నీ శిష్యులు తిని తాగుతూ ఉన్నారు” అని అన్నారు. 34అందుకు యేసు, “పెళ్ళి కొడుకు తమతో ఉన్నంత కాలం పెళ్ళి ఇంట్లో ఉన్న వారితో మీరు ఉపవాసం చేయించగలరా? 35పెళ్ళి కొడుకును వారి దగ్గర నుండి తీసుకు పోయే రోజులు వస్తాయి. ఆ రోజుల్లో వారు ఉపవాసం చేస్తారు” అని వారితో చెప్పాడు.
పాత బట్ట, ద్రాక్షరసం నిలవ చేసే తోలు తిత్తి
మత్తయి 9:16-17; మార్కు 2:21-22
36ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు, “ఎవరూ పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయరు. ఒక వేళ అలా చేస్తే కొత్త బట్ట చింపవలసి వస్తుంది. కొత్తదానిలో నుండి తీసిన ముక్క పాతదానితో కలవదు. 37ఎవడూ పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయడు. పోస్తే కొత్త ద్రాక్షారసం వలన ఆ తిత్తులు చినిగిపోతాయి. రసం కారిపోతుంది. తిత్తులు పాడవుతాయి. 38అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోయాలి. 39పాత ద్రాక్షారసం తాగిన తరువాత కొత్త దాన్ని ఎవరూ ఆశించరు. ఎందుకంటే ‘పాతదే బాగుంది,’ అంటారు.”

Currently Selected:

లూకా 5: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in