YouVersion Logo
Search Icon

లూకా 8

8
గలిలయలో ఉపదేశాలు, స్వస్థతలు
1ఆ తరువాత ఆయన ప్రతి పట్టణానికీ ప్రతి గ్రామానికీ దేవుని రాజ్య సువార్త బోధిస్తూ, ప్రకటిస్తూ సంచారం చేస్తున్నాడు. 2పన్నెండుగురు శిష్యులు, అపవిత్రాత్మలనుంచీ, రోగాలనుంచీ ఆయన బాగుచేసిన కొందరు స్త్రీలూ, అంటే ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ, 3హేరోదు గృహ నిర్వాహకుడైన కూజా అనే అతని భార్య యోహన్నా, సూసన్నా ఇంకా అనేకమంది ఇతర స్త్రీలూ ఆయనతో కూడా ఉన్నారు. వారంతా తమ స్వంత ధనం, సామగ్రిని వెచ్చించి ఆయనకు, ఆయన శిష్యులకు సహాయం చేసేవారు.
విత్తనాలు చల్లే రైతు ఉపమానం
మత్తయి 13:1-23; మార్కు 4:1-20
4ఒకసారి ప్రతి పట్టణం నుండీ ప్రజలు పెద్ద గుంపులుగా యేసు దగ్గరికి వస్తున్నారు. అప్పుడు ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. 5“విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. అతడు చల్లుతూ ఉండగా కొన్ని విత్తనాలు దారి పక్కన పడి మనుషుల కాళ్ళ కింద నలిగిపోయాయి. కాబట్టి గాలిలో ఎగిరే పక్షులు వాటిని మింగివేశాయి.
6 మరి కొన్ని రాతి నేల మీద పడ్డాయి. అవి మొలిచాయి కానీ లోపల తడి లేకపోవడంతో ఎండిపోయాయి.
7 మరి కొన్ని ముళ్ళపొదల మధ్యలో పడ్డాయి. ముళ్ళపొదలు వాటితో కూడా మొలిచి వాటిని అణచి వేశాయి.
8 మరి కొన్ని మంచి నేలపై పడ్డాయి. అవి మొలిచి నూరు రెట్లుగా ఫలించాయి.” ఆయన ఇలా చెప్పి, “వినడానికి చెవులున్నవాడు విను గాక” అని బిగ్గరగా అన్నాడు.
9ఆయన శిష్యులు, “ఈ ఉపమానం అర్థం ఏమిటి?” అని అడిగారు 10ఆయన, “దేవుని రాజ్య రహస్య సత్యాలు తెలుసుకునే ఆధిక్యత మీరు పొందారు. ఇతరులైతే చూస్తూ ఉన్నా నిజంగా చూడకుండా, వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉంటారు గనక వారికి ఉపమానాల్లోనే బోధిస్తున్నాను.
11 ఈ ఉపమానానికి అర్థం ఏమిటంటే విత్తనం దేవుని వాక్యం. 12దారి పక్కన పడిన విత్తనాలు ఎవరంటే వీరు వాక్కును వింటారు గానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి ఆ వాక్యాన్ని తీసివేస్తాడు. 13రాతి నేలపై పడిన విత్తనాలు ఎవరంటే వింటున్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరించే వారు. కానీ వారిలో వేరు లేదు కాబట్టి కొంతకాలం నమ్మి తరువాత విషమ పరీక్షల కాలంలో తొలగిపోతారు. 14ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎవరిని పోలిన వారంటే, వీరు వింటారు గానీ కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎదురయ్యే చింతలతో, సుఖాలతో, సంపదలతో ఉక్కిరి బిక్కిరై అణగారి పోతారు. వీరి ఫలం పక్వానికి రాదు. 15మంచి నేలపై పడే విత్తనాలు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్కును విని, భద్రంగా చేపట్టి ఓపికతో ఫలించేవారు.
వెలిగించిన దీపం ఉపమానం
మత్తయి 5:15-16; మార్కు 4:21-23; లూకా 11:33
16 “ఎవరూ దీపాన్ని వెలిగించి బుట్టతో కప్పివేయడు, మంచం కింద పెట్టడు. ఇంట్లోకి వచ్చే వారికి వెలుగు కనిపించేలా దీపస్తంభంపై ఉంచుతాడు. 17తేటతెల్లం కాని రహస్యమేదీ లేదు. తెలియకుండా, బయట పడకుండా, దాగి ఉండిపోయేది ఏదీ లేదు. 18కలిగిన వ్యక్తికే ఇస్తారు, లేని వ్యక్తి నుండి తనకు ఉంది అనుకున్నది కూడా తీసివేస్తారు. కాబట్టి మీరు ఎలా వింటున్నారో చూసుకోండి” అన్నాడు.
కొత్త అనుబంధాలు
మత్తయి 12:46-50; మార్కు 3:31-35
19ఆయన తల్లీ సోదరులూ అక్కడికి వచ్చారు గానీ అంతా గుంపుగా ఉండడం వల్ల ఆయనకు దగ్గరగా రాలేకపోయారు. 20అప్పుడు, “నిన్ను చూడ్డానికి నీ తల్లీ నీ సోదరులూ వచ్చి బయట నిలుచున్నారు” అని ఎవరో ఆయనతో అన్నారు. 21అందుకు ఆయన, “దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జరిగించే వారే నా తల్లీ నా తమ్ముళ్ళూ” అన్నాడు.
యేసు పెనుగాలిని, అలలను అదుపుచేయడం
మత్తయి 8:23-27; మార్కు 4:36-41
22మరొక రోజు ఆయన తన శిష్యులతో కలిసి పడవ ఎక్కి, “సరస్సు అవతలి వైపుకు వెళ్దాం” అన్నాడు. వారు ఆ పడవను నీటిలోకి తోసి బయలుదేరారు. 23వారు ప్రయాణమయ్యాక ఆయన నిద్రపోయాడు. ఈలోగా సరస్సు మీద బలమైన గాలివాన వచ్చి పడవలోకి నీళ్ళు వచ్చేశాయి. వారి స్థితి ప్రమాదకరంగా మారింది. 24కాబట్టి వారు ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ! ప్రభూ! నశించిపోతున్నాం” అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, గాలినీ, ఉవ్వెత్తున లేచే కెరటాలనూ గద్దించాడు. అవి అణిగిపోయి అంతా నిశ్శబ్దంగా అయింది. 25అప్పుడు ఆయన, “మీ విశ్వాసం ఎక్కడ?” అన్నాడు. వారు భయపడి, “ఈయన గాలికీ నీళ్లకూ ఆజ్ఞాపిస్తే అవి లోబడుతున్నాయి. ఈయన ఎవరో” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారు.
గదర ప్రదేశంలో దయ్యం పట్టినవాణ్ణి బాగు చేయడం
మత్తయి 8:28-34; మార్కు 5:1-17
26వారు గలిలయకి ఎదురుగా ఉండే గెరాసేను ప్రాంతానికి వచ్చారు. 27ఆయన ఒడ్డున దిగగానే ఆ ఊరి వాడు ఒకడు ఆయనను ఎదుర్కోడానికి వచ్చాడు. వాడికి దయ్యాలు పట్టి చాలా కాలం నుండి బట్టలు కట్టుకోకుండా తిరుగుతున్నాడు. సమాధులే వాడి నివాసం. ఇంట్లో ఉండేవాడు కాదు.
28వాడు యేసును చూసి, కేకలు వేశాడు. వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు. అతడు “సర్వోన్నత దేవుని కుమారా, యేసూ, నా జోలి నీకెందుకు? నన్ను బాధించకు. నిన్ను బతిమాలుకుంటున్నాను” అంటూ కేకలు పెట్టాడు. 29ఎందుకంటే ఆయన, “ఈ వ్యక్తిని వదిలి బయటకు రా” అని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞ ఇచ్చాడు. అది చాలాసార్లు వాణ్ణి పట్టి పీడిస్తుంది. వాణ్ణి గొలుసులతోనూ, కాలి సంకెళ్ళతోనూ బంధించి వాడికి కాపలా పెట్టారు గానీ వాడు ఆ బంధకాలన్నిటినీ తెంచుకునేవాడు. దయ్యాలు వాణ్ణి చవిటి భూముల్లోకి తీసుకుపోయేవి.
30యేసు, “నీ పేరు ఏమిటి?” అని వాడిని అడిగాడు. చాలా దయ్యాలు వాడిలో చొరబడి ఉన్నాయి. కాబట్టి వాడు, “నా పేరు సైన్యం” అన్నాడు. 31పాతాళంలోకి వెళ్ళమని తనకు ఆజ్ఞ ఇవ్వవద్దని అవి ఆయనను ఎంతో బతిమాలాయి. 32అక్కడ పెద్ద పందుల మంద ఒకటి కొండ మీద మేస్తూ ఉంది. వాటిలో చొరబడడానికి అనుమతినిమ్మని ఆయనను బతిమాలినప్పుడు ఆయన వాటికి అనుమతినిచ్చాడు. 33అప్పుడు దయ్యాలు ఆ వ్యక్తిని విడిచి పెట్టి వెళ్ళి పందుల్లో చొరబడ్డాయి. అప్పుడు ఆ మంద ఎత్తయిన కొండపై నుండి పరుగెత్తుకుంటూ వెళ్ళి సరస్సులో పడి ఊపిరాడక చచ్చాయి.
34ఆ పందులను మేపుతున్న వారు ఇదంతా చూసి పారిపోయారు. వారు పట్టణంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ జరిగిందంతా చెప్పారు.
35ఆ ఊరి ప్రజలు అదంతా చూడడానికి వెళ్ళారు. వారంతా యేసు దగ్గరికి వచ్చారు. అక్కడ దయ్యాలు వదిలిన వాడు బట్టలు కట్టుకుని స్థిమితంగా యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండడం చూసి భయపడ్డారు. 36జరిగిన దాన్ని దగ్గరగా చూసిన వారు వాడు ఎలా బాగయ్యాడో ప్రజలకు చెప్పారు. 37గెరాసేను ప్రాంతాల్లో ఉన్నవారంతా ఎంతో భయపడ్డారు. తమను విడిచి వెళ్ళమని ఆయనను బతిమాలుకున్నారు.
38ఆయన తిరిగి పడవ ఎక్కి వెళ్ళబోతుంటే దయ్యాలు వదిలిన వ్యక్తి తనను కూడా ఆయనతో ఉండనిమ్మని బతిమాలాడు. 39కానీ ఆయన, “నువ్వు నీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకు చేసిన గొప్ప విషయాలను చెప్పు” అని వాణ్ణి పంపివేశాడు. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన గొప్ప కార్యాన్ని గురించి ఆ పట్టణమంతా ప్రకటించాడు.
రక్తస్రావ రోగం ఉన్న స్త్రీ స్వస్థత, యాయీరు కూతురుకి ప్రాణదానం
మత్తయి 9:18-26; మార్కు 5:22-43
40ఇవతలి ఒడ్డున జనమంతా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి యేసు తిరిగి రాగానే వారు ఆయనను సంతోషంగా స్వీకరించారు. 41అప్పుడు యాయీరు అనే ఒక సమాజ మందిర అధికారి వచ్చి ఆయన పాదాలపై పడ్డాడు. 42సుమారు పన్నెండేళ్ళ వయసున్న అతని ఏకైక కుమార్తె జబ్బుపడి చావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆయనను తన ఇంటికి రమ్మని బతిమాలుకున్నాడు. ఆయన వెళ్తుంటే కిక్కిరిసిన జన సమూహం ఆయన మీద పడుతున్నారు.
43అప్పుడు పన్నెండేళ్ళ నుండి రక్త స్రావ రోగంతో బాధ పడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తనకున్నదంతా వైద్యులకు ఖర్చు చేసింది. కానీ ఎక్కడా నయం కాలేదు. 44ఆమె ఆయనకి వెనకగా వచ్చి ఆయన పైవస్త్రం అంచును తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది.
45యేసు, “నన్ను తాకిందెవరు?” అని అడిగాడు. చుట్టూ ఉన్నవారు, “మాకు తెలియదే” అన్నారు. అప్పుడు పేతురు, “ప్రభూ, జనమంతా తోసుకుంటూ నీ చుట్టూ క్రిక్కిరిసి నీమీద పడుతున్నారు” అన్నాడు. 46అయితే యేసు, “ఎవరో నన్ను తాకారు. నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళిందని నాకు తెలిసింది” అన్నాడు. 47ఇక తాను దాగి ఉండలేనని ఆ స్త్రీకి అర్థమైంది. ఆమె వణకుతూ ముందుకు వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి తాను ఎందుకు ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నదో, వెంటనే ఎలా బాగుపడిందో అంతా ప్రజలందరి ఎదుటా వివరించి చెప్పింది. 48అందుకు ఆయన, “అమ్మాయీ, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. ప్రశాంతంగా వెళ్ళు” అన్నాడు.
49ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే సమాజ మందిరం అధికారి ఇంటి నుండి ఒక వ్యక్తి వచ్చి యాయీరుతో, “మీ అమ్మాయి చనిపోయింది. బోధకుడిని ఇక బాధ పెట్టవద్దు” అని చెప్పాడు. 50యేసు ఆ మాట విని, “భయపడకు, నమ్ము. ఆమె బాగవుతుంది” అని చెప్పాడు. 51అతని ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబులనూ ఆ అమ్మాయి తల్లిదండ్రులనూ తప్ప మరెవర్నీ లోపలికి రానివ్వలేదు.
52అందరూ ఆమె కోసం ఏడుస్తూ, విలపిస్తూ ఉన్నారు. ఆయన వారితో, “ఏడవ వద్దు, ఆమె నిద్రిస్తున్నదే గానీ చనిపోలేదు” అన్నాడు. 53ఆమె చనిపోయిందని వారికి తెలుసు కాబట్టి వారు ఆయనను ఎగతాళి చేశారు. 54అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని, “అమ్మాయీ, లే” అని చెప్పగానే 55ఆమెకు ప్రాణం తిరిగి వచ్చింది. ఆమె వెంటనే లేచింది. అప్పుడు ఆయన, “ఆమెకు భోజనం పెట్టండి” అని ఆదేశించాడు. 56ఆమె తల్లిదండ్రులు ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయారు. అప్పుడు ఆయన, “జరిగింది ఎవరికీ చెప్పవద్దు” అని వారికి ఆజ్ఞాపించాడు.

Currently Selected:

లూకా 8: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in