YouVersion Logo
Search Icon

మలాకీ 2

2
యాజకులకు హెచ్చరిక
1కాబట్టి యాజకులారా, నేనిచ్చే ఈ ఆజ్ఞ మీ కోసమే. 2సైన్యాలకు అధిపతియైన యెహోవా చెప్పేది ఏమిటంటే, మీరు నేను ఇచ్చిన ఆజ్ఞలు పాటించకుండా, నా నామాన్ని మనస్ఫూర్తిగా గౌరవించడానికి నిశ్చయించుకోకపోతే నేను మీ మీదికి శాపం వచ్చేలా చేస్తాను. మీకు కలిగిన ఆశీర్వాద ఫలాలను శపిస్తాను. మీరు ఇంకా దాన్ని గుర్తుకు తెచ్చుకోలేదు గనుక ఇంతకుముందే నేను వాటిని శపించాను. 3మిమ్మల్ని బట్టి మీ సంతానాన్ని పెకలించి వేస్తాను. మీ పండగల్లో మీరు అర్పించే పశువుల పేడ మీ ముఖాలపై వేయిస్తాను. పేడ ఊడ్చి వేసే స్థలానికి మీరు ఊడ్చి వేయబడేలా చేస్తాను.
4దీన్ని బట్టి నేను లేవీయులకు నిబంధనగా ఉండేలా ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాణ్ణి నేనే అని మీరు తెలుసు కుంటారు అని సేనల ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు. 5నేను చేసిన నిబంధన వారి ప్రాణానికి, శాంతికి మూల కారణం. నా పట్ల వారికి భయభక్తులు కలిగించడానికి నేను వాటిని ఇచ్చాను. కాబట్టి వారు నా పట్ల భయభక్తులు కలిగి, నా నామం విషయంలో భయం కలిగి నడుచుకున్నారు.
6వారు దుర్బోధ ఎంతమాత్రమూ చేయకుండా సత్యమైన ధర్మశాస్త్రం బోధిస్తూ వచ్చారు. సమాధానంతో, యథార్థతతో నన్ను అనుసరించి అనేకులను అన్యాయం నుండి మళ్ళుకునేలా చేశారు. 7యాజకులు సైన్యాలకు అధిపతియైన యెహోవా వార్తాహరులు గనుక ప్రజలు వారి నోటనుండి వచ్చే ధర్మశాస్త్ర విధులు నేర్చుకొంటారు గనుక వారు జ్ఞానం కలిగి వాటిని బోధించాలి.
8అయితే మీరు దారి తప్పారు. మీరు చేసిన ఉపదేశం వల్ల చాలా మంది దారి తప్పారు. నేను లేవీయులతో చేసిన నిబంధనను వమ్ము చేశారు. 9ధర్మశాస్త్ర ఉపదేశంలో మీరు జరిగించిన పక్షపాతం వల్ల ప్రజలందరి ఎదుట మిమ్మల్ని తిరస్కారానికి గురైన వారుగా, అణగారి పోయిన వారుగా చేశాను అని సేనల ప్రభువు యెహోవా సెలవిస్తున్నాడు.
అవిశ్వాసులకు హెచ్చరిక
10మనకందరికి తండ్రి ఒక్కడే కదా. ఒక్క దేవుడే మనలను సృష్టించాడు కదా. అలాంటప్పుడు మనం ఒకరి పట్ల ఒకరం ద్రోహం చేసుకుంటూ, మన పూర్వీకులతో చేసిన కట్టడను ఎందుకు తిరస్కరిస్తున్నాం? 11యూదా ప్రజలు ద్రోహులుగా మారారు. ఇశ్రాయేలు ప్రజల మధ్య యెరూషలేములోనే నీచ కార్యాలు జరుగుతున్నాయి. యూదా ప్రజలు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేసి అన్యదేవత ఆరాధకుల పిల్లలను వివాహం చేసుకున్నారు.
12ఈ విధంగా చేసిన వాళ్ళను యాకోబు సంతానానికి చెందిన గుడారాల్లో లేకుండా, సైన్యాలకు అధిపతియైన యెహోవాకు నైవేద్యాలు అర్పించే వారి సహవాసంలో లేకుండా యెహోవా నాశనం చేస్తాడు. 13మళ్ళీ రెండోసారి కూడా మీరు అలాగే చేస్తారు. అయితే ఆయన మీ నైవేద్యాన్ని స్వీకరించడు. మీరు అర్పించే అర్పణలు ఆయన లక్ష్యపెట్టడు. అప్పుడు యెహోవా బలిపీఠాన్ని ఏడ్పుతో, కన్నీళ్లతో, రోదనతో మీరు తడుపుతారు.
14ఇలా ఎందుకు జరుగుతుంది? అని మీరు అడుగుతారు. యవ్వన కాలంలో నువ్వు పెళ్లి చేసుకుని అన్యాయంగా విడిచిపెట్టిన నీ భార్య పక్షంగా యెహోవా సాక్షిగా నిలబడతాడు. నీ భార్య నీ సహకారి కాదా, నీవు చేసిన నిబంధన ప్రకారం భార్య కాదా. 15ఆయన మీ ఇద్దరినీ ఒక్కటిగా చేశాడు. శరీరం, ఆత్మ రెండూ ఆయనకే చెందుతాయి గదా. అలా ఒకటిగా చేయడం దేనికి? దేవుని మూలంగా వారికి సంతతి కలగాలని. అందువల్ల మిమ్మల్ని మీరే జాగ్రత్తగా కాపాడుకోండి. యవ్వనంలో పెళ్లి చేసుకున్న మీ భార్యలకు ద్రోహం చేసి విశ్వాస ఘాతకులుగా మారకండి.
16ఒకడు తన భార్యను విడిచి పెట్టడం నాకు అసహ్యం అని ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఒకడు తన బట్టలతో బాటు బలాత్కారంతో తనను కప్పుకోవడం నాకు అసహ్యమని సైన్యాలకు అధిపతియైన యెహోవా అంటున్నాడు. కనుక మీ హృదయాలను కాపాడుకోండి. విశ్వాస ఘాతకులుగా ఉండకండి.
యెహోవాకు చిరాకు కలిగించడం
17మీరు మీ మాటలతో యెహోవాకు చిరాకు కలిగించారు. “ఏ విధంగా ఆయనకు చిరాకు కలిగించాం?” అని మీరు అడుగుతున్నారు. “చెడ్డ పనులు చేసే వాళ్ళంతా యెహోవా దృష్టిలో మంచివారే. వారిపట్ల ఆయన ఆనందిస్తాడు. లేకపోతే న్యాయం చేసే దేవుడు ఇక ఎందుకు?” అని చెప్పుకోవడం ద్వారా మీరు ఆయనకు చిరాకు కలిగిస్తున్నారు.

Currently Selected:

మలాకీ 2: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in