YouVersion Logo
Search Icon

మత్తయి 4

4
యేసు ఎదుర్కొన్న పరీక్ష
మార్కు 1:12-13; లూకా 4:1-13; ఆది 3:6
1అప్పుడు అపవాది వల్ల యేసును విషమ పరీక్షలకు గురి చేయడానికి ఆత్మ ఆయనను అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. 2నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకు ఆకలి వేసింది. 3శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, “నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు” అన్నాడు. 4అందుకు ఆయన “మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు, అని రాసి ఉంది” అన్నాడు. 5అప్పుడు అపవాది ఆయనను పవిత్ర నగరంలోకి తీసుకు పోయి, దేవాలయ శిఖరంపై నిలబెట్టి, 6“నీవు దేవుని కుమారుడివైతే కిందికి దూకు. ఎందుకంటే,
‘ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు.
నీ పాదానికి రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు’ అని రాసి ఉంది” అన్నాడు.
7అందుకు యేసు “‘ప్రభువైన నీ దేవుణ్ణి నీవు పరీక్షించకూడదు’ అని కూడా రాసి ఉంది” అని అతనితో అన్నాడు. 8అపవాది మళ్ళీ ఆయనను చాలా ఎత్తయిన కొండపైకి తీసుకు పోయి, ప్రపంచ రాజ్యాలను, వాటి వైభవాన్ని ఆయనకు చూపించాడు. 9“నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే వీటన్నిటినీ నీకిస్తాను” అన్నాడు. 10అప్పుడు యేసు “సాతాన్! అవతలికి పో! ‘ప్రభువైన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఆయన్నే నువ్వు సేవించాలి’ అని రాసి ఉంది” అన్నాడు.
11అప్పుడు అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేశారు.
యేసు తన బహిరంగ పరిచర్య ఆరంభంలో కపెర్నహూముకు రాక
మార్కు 1:14; లూకా 4:14-15
12యోహానును చెరసాలలో వేశారని యేసు విని గలిలయ ప్రాంతానికి తిరిగి వెళ్ళాడు. 13ఆయన నజరేతును విడిచి వెళ్ళి కపెర్నహూములో నివసించాడు. అది గలిలయ సముద్ర తీరాన జెబూలూను, నఫ్తాలి ప్రాంతాల్లో ఉంది.
14-16“జెబూలూను నఫ్తాలి ప్రాంతాలు,
యొర్దాను నది అవతల సముద్రం వైపున ఉన్న
యూదేతరుల గలిలయ ప్రాంతాల్లో
చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు.
చావు నీడలో కూర్చున్న వారిపై వెలుగు ఉదయించింది.”
అని యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాట ఈ విధంగా నెరవేరింది.
17అప్పటి నుంచి యేసు, “పరలోక రాజ్యం దగ్గరపడింది. పశ్చాత్తాపపడండి” అంటూ బోధించడం మొదలు పెట్టాడు.
పేతురు అంద్రెయలకు పిలుపు
లూకా 5:2-11
18యేసు గలిలయ సముద్ర తీరాన నడుస్తూ, ఇద్దరు అన్నదమ్ములు సముద్రంలో వల వేయడం చూశాడు. వారు పేతురు అనే సీమోను, అతని సోదరుడు అంద్రెయ. వారు చేపలు పట్టేవారు. 19యేసు వారితో, “నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను” అని పిలిచాడు. 20వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.
జెబెదయి కొడుకులు యాకోబు, యోహానులకు పిలుపు
21యేసు అక్కడనుంచి వెళ్తూ ఇంకో ఇద్దరు అన్నదమ్ములను చూశాడు. వారు జెబెదయి కొడుకులు యాకోబు, యోహాను. వారు తమ తండ్రి జెబెదయి దగ్గర పడవలో తమ వలలు బాగుచేసుకుంటుంటే చూసి వారిని పిలిచాడు. 22వెంటనే వారు తమ పడవనూ తమ తండ్రినీ విడిచిపెట్టి ఆయనను వెంట వెళ్లారు.
23యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రజల్లో ఉన్న ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగు చేస్తూ గలిలయ ప్రాంతమంతా తిరిగాడు. 24ఆయన పేరు సిరియా దేశమంతా తెలిసిపోయింది. రకరకాల వ్యాధులతో, నొప్పులతో బాధపడుతున్న వారిని, దయ్యాలు పట్టిన వారిని, మూర్ఛ రోగులను, పక్షవాతం వచ్చిన వారిని ఆయన దగ్గరికి తీసుకు వస్తే ఆయన వారిని బాగుచేశాడు. 25గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రాంతాల నుండీ యొర్దాను అవతలి ప్రాంతం నుండీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన వెంట వెళ్ళారు.

Currently Selected:

మత్తయి 4: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in