YouVersion Logo
Search Icon

మత్తయి 6

6
పర్వత ప్రసంగం-బాహ్యాచారాలపై విమర్శ
1 “మనుషులకు కనిపించేలా వారి ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడండి. లేకపోతే పరలోకంలోని మీ తండ్రి దగ్గర మీకు ఏ ప్రతిఫలమూ రాదు. 2కాబట్టి దానం చేసేటప్పుడు వేషధారుల్లాగా మీ ముందు బాకా ఊదించుకోవద్దు. ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపట భక్తులు సమాజ మందిరాల్లో, వీధుల్లో అలా చేస్తారు. వారి పూర్తి ప్రతిఫలం వారికి దొరికిందని కచ్చితంగా చెబుతున్నాను.
3 నీవైతే దానాలు చేసేటప్పుడు నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియనీయవద్దు. 4అప్పుడే నీ దానం గుప్తంగా ఉంటుంది. ఏకాంతంలో చేసే వాటిని చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. 5మీరు ప్రార్థన చేసేటప్పుడు కపట వేషధారుల్లాగా ఉండవద్దు. మనుషులకు కనబడాలని సమాజ మందిరాల్లో, వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. వారు తమ ప్రతిఫలం పొందారని కచ్చితంగా చెబుతున్నాను.
6 నీవు ప్రార్థన చేసేటప్పుడు, నీ లోపలి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని, రహస్యంగా తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యంగా చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు. 7అంతే కాక మీరు ప్రార్థన చేసేటప్పుడు యూదేతరుల్లాగా వృథా మాటలు పదే పదే పలక వద్దు. చాలా ఎక్కువ మాట్లాడితేనే దేవుడు వింటాడని వారు అనుకుంటారు.
ప్రార్థన గురించి సరికొత్త ఉపదేశం
లూకా 11:1-3
8 కాబట్టి మీరు వారిలాగా ఉండొద్దు. మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు ఏం అవసరమో ఆయనకు తెలుసు. 9కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి.
“పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామం పవిత్రంగా ఉండు గాక.
10 నీ రాజ్యం వస్తుంది గాక.
పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరు గాక.
11 మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు దయచెయ్యి.
12 మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు.
13 మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.”
14 “మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు. 15మీరు మనుషుల అక్రమాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు.
16 మీరు ఉపవాసం చేసేటప్పుడు దొంగ భక్తుల్లాగా మీ ముఖాలు నీరసంగా పెట్టుకోవద్దు. తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖాలను వికారం చేసుకుంటారు. వారు తమ ప్రతిఫలం పొందారని కచ్చితంగా చెబుతున్నాను. 17నువ్వు ఉపవాసం ఉన్నపుడు ఉపవాసమున్నట్టు మనుషులకి కనబడాలని కాకుండా, ఏకాంతంలో ఉన్న తండ్రికే కనబడాలని, తలకు నూనె రాసుకుని ముఖం కడుక్కో. 18అప్పుడు ప్రజలకు కాక, రహస్యంలో ఉన్న నీ తండ్రికే కనబడతావు. అప్పుడు రహస్యంలో చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.
19 “భూమి మీద మీకోసం సంపద కూడబెట్టుకోవద్దు. ఇక్కడ చెదలూ తుప్పూ తినివేస్తాయి. దొంగలు పడి దోచుకుంటారు. 20పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి. అక్కడ చెదలుగానీ, తుప్పుగానీ తినివేయవు. దొంగలు పడి దోచుకోరు. 21ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసూ ఉంటుంది.
22 “శరీరానికి దీపం కన్ను. కాబట్టి నీ కన్ను బాగుంటే నీ శరీరమంతా వెలుగుతో నిండి ఉంటుంది. 23నీ కన్ను పాడైతే నీ శరీరమంతా చీకటితో నిండి ఉంటుంది. అందుచేత నీలో ఉన్న వెలుగే చీకటి అయితే ఆ చీకటి ఎంత భయంకరమైనదో కదా!
24 ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగే దేవునికీ సంపదకూ ఒకేసారి సేవ చేయడం కుదరదు.
దిగులుకు విరుగుడు-తండ్రిపై నమ్మకం
25 “అందువల్ల నేను మీతో చెప్పేదేమంటే, ‘ఏమి తినాలి? ఏమి తాగాలి?’ అని మీ జీవితాన్ని గురించి గానీ, ‘ఏమి కట్టుకోవాలి?’ అని మీ శరీరం గురించి గానీ బెంగ పెట్టుకోవద్దు. తిండి కంటే జీవితమూ బట్టల కంటే శరీరమూ ఎక్కువే కదా! 26ఎగిరే పక్షులను చూడండి. అవి విత్తనాలు నాటవు, కోత కోయవు, కొట్లలో ధాన్యం కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే ఎంతో విలువైన వారు కాదా?
27 ఆందోళనపడి మీలో ఎవరు తన జీవితకాలాన్ని కాస్త పొడిగించుకోగలడు? 28బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు? పొలాల్లో గడ్డిపూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి. అవి పని చేయవు, బట్టలు నేయవు. 29అయినా నేనంటాను, తన వైభవమంతటితో ఉన్న సొలొమోను రాజుకు సైతం వీటిలో ఒక్క దానికున్నంత అలంకారం లేదు. 30ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే, అల్ప విశ్వాసులారా, ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా!
31 కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు. 32దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయ పడతారు. ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు. 33అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు. 34కాబట్టి రేపటి విషయం దిగులు పడవద్దు. దాని సంగతి అదే చూసుకుంటుంది. ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు.

Currently Selected:

మత్తయి 6: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in