YouVersion Logo
Search Icon

మీకా 2

2
ధనికుల దుర్మార్గాలు
1మంచాల మీద పడుకుని మోసపు పనులు ఆలోచిస్తూ
దుర్మార్గాలు చేసేవారికి బాధ తప్పదు.
వాళ్లకు అధికారముంది
కాబట్టి పగటి వెలుతురులో వాళ్ళు అలా చేస్తారు.
2వాళ్ళు పొలాలు ఆశించి లాగేసుకుంటారు.
ఇళ్ళు ఆశించి తీసేసుకుంటారు.
వ్యక్తినీ అతని ఇంటినీ,
వ్యక్తినీ అతని వారసత్వాన్నీ వాళ్ళు అణిచేసి ఆక్రమించుకుంటారు.
3కాబట్టి యెహోవా ఇలా చెబుతున్నాడు,
“ఈ వంశం మీదికి విపత్తు పంపించబోతున్నాను.
దాని కిందనుంచి మీ మెడలను వదిలించుకోలేరు.
గర్వంగా నడవ లేనంతగా అపాయం రాబోతుంది.
4ఆ రోజు మీ శత్రువులు మీ గురించి ఒక పాట పాడతారు.
ఎంతో దుఃఖంతో ఏడుస్తారు.
వారిలా పాడతారు, ఇశ్రాయేలీయులమైన మనం బొత్తిగా పాడైపోయాం.
యెహోవా నా ప్రజల భూభాగాన్ని మార్చాడు.
ఆయన నా దగ్గర నుంచి దాన్ని ఎలా తీసేస్తాడు?
ఆయన మన భూములను ద్రోహులకు పంచి ఇచ్చాడు.”
5అందుచేత చీట్లు వేసి ధనవంతులైన మీకు
భూమి పంచిపెట్టడానికి యెహోవా సమాజంలో వారసులెవరూ ఉండరు.
అబద్ద ప్రవక్తలు
6“ప్రవచించ వద్దు, ఈ విషయాలను వాళ్ళు ప్రవచించ కూడదు.
అవమానం రాకూడదు” అని వారంటారు.
7“యాకోబు వంశమా! యెహోవా సహనం తగ్గిపోయిందా?
ఆయన ఇలాంటి పనులు చేస్తాడా?”
అని చెప్పడం భావ్యమేనా?
యథార్థంగా ప్రవర్తించేవారికి నా మాటలు క్షేమం కలిగిస్తాయి గదా!
8ఇటీవలే నా ప్రజలు శత్రువులయ్యారు.
యుద్ధరంగం నుంచి క్షేమంగా తిరిగి వస్తున్నాం అని సైనికులు అనుకున్నట్టుగా,
నిర్భయంగా దారిన పోతూ ఉన్న వారి పై బట్టలను, అంగీని మీరు లాగివేస్తారు.
9వారికిష్టమైన ఇళ్ళల్లోనుంచి నా ప్రజల్లోని స్త్రీలను మీరు వెళ్లగొడతారు.
వారి సంతానం మధ్య నా ఘనతను ఎన్నటికీ ఉండకుండాా చేస్తున్నారు.
10లేచి వెళ్లిపోండి, అది అపవిత్రం అయిపోయింది కాబట్టి
మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు.
నేను దాన్ని పూర్తిగా నాశనం చేస్తాను.
11పనికి మాలిన మాటలు చెబుతూ అబద్ధాలాడుతూ ఎవడైనా ఒకడు వచ్చి,
“ద్రాక్షారసం గురించి, మద్యం గురించి నేను మీకు ప్రవచనం చెబుతాను” అంటే,
వాడే ఈ ప్రజలకు ప్రవక్త అవుతాడు.
విమోచన వాగ్దానం
12యాకోబూ, నేను మిమ్మల్నందరినీ తప్పకుండా పోగు చేస్తాను.
ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారిని తప్పక సమకూర్చుతాను.
గొర్రెల దొడ్డిలోకి గొర్రెలు చేరుకున్నట్టు నేను వారిని చేరుస్తాను.
తమ మేత స్థలాల్లో వారిని చేరుస్తాను.
చాలామంది ఉండడం వలన పెద్ద శబ్దం అక్కడ వస్తుంది.
13వారికి దారి ఇచ్చేవాడు వారి ముందు వెళ్తాడు.
వాళ్ళు గుమ్మం పడగొట్టి దాని ద్వారా దాటిపోతారు.
వాళ్ళ రాజు వారికి ముందుగా నడుస్తాడు.
యెహోవా వారికి నాయకుడుగా ఉంటాడు.

Currently Selected:

మీకా 2: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in