YouVersion Logo
Search Icon

మీకా 3

3
నాయకులు, ప్రవక్తలు
1నేనిలా చెప్పాను. “యాకోబు నాయకులారా,
ఇశ్రాయేలీయుల అధికారులారా, ఇప్పుడు వినండి.
న్యాయం అంటే ఏంటో మీరు తెలుసుకోవద్దా?
2మీరు మంచిని అసహ్యించుకుని చెడును ఇష్టపడతారు.
నా ప్రజల చర్మం ఒలిచేసి
వారి ఎముకల మీద ఉన్న మాంసాన్ని చీలుస్తారు.
3నా ప్రజల మాంసాన్ని తింటారు.
వారి చర్మాన్ని ఒలిచి వారి ఎముకలను విరగగొట్టేస్తారు.
ఒకడు పాత్రలో వేసే మాంసాన్ని ముక్కలు చేసినట్టుగా
ఉడుకుతున్న పాత్రలో వేసే మాంసాన్ని
ముక్కలు చేసినట్టు మీరు చేస్తారు.
4ఆ తరువాత నాయకులైన మీరు యెహోవాకు మొరపెడతారు
కానీ ఆయన వారికి జవాబివ్వడు.
మీరు చెడు పనులు చేశారు.
కాబట్టి అప్పుడు ఆయన వారికి తన ముఖాన్ని చూపించడు.”
5నా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రవక్తలను గురించి యెహోవా చెప్పేదేమిటంటే,
తమకు భోజనం పెట్టేవారికి “సంపద వస్తుంది” అని చెబుతారు.
భోజనం పెట్టకపోతే, వారి మీద యుద్ధం ప్రకటిస్తారు.
6అందుచేత మీకు దర్శనాలేమీ రాకుండా రాత్రి కమ్ముకువస్తుంది.
సోదె చెప్పకుండా మీకు చీకటి ఆవరిస్తుంది.
ఇలాంటి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండ అస్తమిస్తాడు.
పగలు చీకటిగా మారిపోతుంది.
7అప్పుడు భవిష్యత్తును చెప్పేవారికి సిగ్గు కలుగుతుంది.
సోదె చెప్పేవాళ్ళు కలవరపడతారు.
నా దగ్గరనుంచి జవాబేమీ రానందుకు వారంతా నోరు మూసుకుంటారు.
8అయితే నా మట్టుకైతే, యాకోబు సంతానానికి వాళ్ళ అతిక్రమాలనూ
ఇశ్రాయేలీయులకు తమ పాపాన్ని వెల్లడించడానికి
యెహోవా ఆత్మమూలంగా
సంపూర్ణ అధికారంతో, న్యాయంతో ఉన్నాను.
9యాకోబు వంశపు ప్రధానులారా,
ఇశ్రాయేలీయుల అధిపతులారా,
ఈ మాట వినండి. మీరు న్యాయాన్ని తృణీకరిస్తూ
సక్రమంగా ఉండే సమస్తాన్నీ వక్రం చేస్తారు.
10సీయోనును మీరు రక్తంతో కడతారు.
దుర్మార్గంతో యెరూషలేమును కడతారు.
11ప్రజల ప్రధానులు లంచం పుచ్చుకుని తీర్పు తీరుస్తారు.
వారి యాజకులు కూలికి బోధిస్తారు.
ప్రవక్తలు డబ్బు కోసం సోదె చెబుతారు.
అయినా వాళ్ళు యెహోవాను ఆధారం చేసుకుని
“యెహోవా మన మధ్య ఉన్నాడు గదా,
ఏ కీడూ మనకు రాదు” అనుకుంటారు.
12కాబట్టి మీ మూలంగా శత్రువులు సీయోనును పొలంలాగా దున్నుతారు.
యెరూషలేము రాళ్ల కుప్ప అవుతుంది.
మందిరమున్న కొండ, అడవిలాగా అవుతుంది.

Currently Selected:

మీకా 3: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in