YouVersion Logo
Search Icon

మార్కు 7

7
పరిసయ్యులను ఖండించడం
మత్తయి 15:1-20
1యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులూ ధర్మశాస్త్ర పండితులూ యేసు చుట్టూ గుమికూడారు. 2వారు ఆయన శిష్యుల్లో కొందరు అశుద్ధమైన చేతులతో, అంటే ఆచార నియమం ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం గమనించారు. 3పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దల సంప్రదాయం ప్రకారం తమ చేతులను ఆచారరీతిగా కడుక్కోకుండా భోజనం చేయరు. 4వారు బయట నుండి వచ్చినపుడు స్నానం చేయకుండా భోజనం చేయరు. గిన్నెలు, కుండలు, ఇతర ఇత్తడి పాత్రలు, భోజనపు బల్లలు సహా శుద్ధి చేయడం అనే అనేకమైన ఆచారాలను వారు కచ్చితంగా పాటిస్తారు.
5పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులు యేసుతో, “మీ శిష్యులు పెద్దల సంప్రదాయాన్ని పాటించకుండా అశుద్ధమైన చేతులతో ఎందుకు భోజనం చేస్తున్నారు?” అని యేసును అడిగారు. 6యేసు వారితో,
“‘ఈ ప్రజలు మాటలతో నన్ను గౌరవిస్తారు కాని,
వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది.
7 వారు మానవ కల్పితమైన నియమాలను దేవుని ఉపదేశంగా బోధిస్తారు కాబట్టి వారి ఆరాధన వ్యర్థం,’
అని కపట వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవక్త ముందుగా పలికింది సరైనదే! 8మీరు దేవుని ఆజ్ఞలను తోసిపుచ్చి మనుషుల సంప్రదాయాలకు కట్టుబడుతున్నారు. 9మీ సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను మీరడంలో మీరు సిద్ధహస్తులు. 10మోషే, ‘మీ తల్లిదండ్రులను గౌరవించమనీ, తల్లిని, తండ్రిని దూషించిన వారికి శిక్ష మరణదండన’ అనీ నియమించాడు.
11 కానీ మీరైతే, ఒక వ్యక్తి తన తల్లితో, తండ్రితో ‘నా వల్ల మీరు పొందదగిన సహాయమంతా ‘కొర్బాన్’ (అంటే దైవార్పితం)’ అని చెబితే 12ఇంక ఆ వ్యక్తి తన తల్లిదండ్రుల కోసం ఏమీ చేయనక్కర లేదని చెబుతారు. 13మీరు మీ పెద్దల సంప్రదాయాలను పాటించే నెపంతో దేవుని ఆజ్ఞ మీరుతున్నారు. ఇలాంటివి మరెన్నో మీరు చేస్తున్నారు.
14అప్పుడు యేసు ప్రజలందరినీ తన దగ్గరికి పిలిచి, “నేను చెప్పేది ప్రతి ఒక్కరూ విని అర్థం చేసుకోండి! 15బయట నుండి మనిషి లోపలికి వెళ్ళేవి ఏవీ అతన్ని అపవిత్రం చేయవు. 16మనిషి లోనుండి బయటకు వచ్చేదే అతన్ని అపవిత్రం చేస్తుంది” అని అన్నాడు.
17ఆయన జనసమూహన్ని విడిచి ఇంట్లో ప్రవేశించిన తరువాత ఆయన శిష్యులు ఆ ఉపమానం గురించి ఆయనను అడిగారు. 18ఆయన వారితో, “మీకు ఇంకా అర్థం కాలేదా? బయట నుండి మనిషిలోకి వచ్చేది అతన్ని అపవిత్రం చేయదని మీరు గ్రహించలేరా? 19అది మనిషి హృదయంలోకి వెళ్ళదు. కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతుంది” అని చెప్పాడు. (ఈ విధంగా చెప్పడం ద్వారా అన్ని ఆహార పదార్ధాలూ తినడానికి పవిత్రమైనవే అని యేసు సూచించాడు).
20ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. 21ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, 22వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి. 23ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”
సురోఫెనికయ స్త్రీ
మత్తయి 15:21-28
24యేసు ఆ ప్రాంతం విడిచి తూరు, సీదోను ప్రాంతంలోని ఒక ఇంటికి వెళ్ళాడు. తాను అక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదని ఆయన ఉద్దేశం. కాని, ఆయన వారికి కనిపించకుండా ఉండలేకపోయాడు. 25ఒక స్త్రీ యేసు గురించి విని వచ్చి ఆయన కాళ్ళపై పడింది. ఆమె కూతురుకు దయ్యం పట్టి ఉంది. 26ఈ స్త్రీ సిరియాకు చెందిన ఫెనికయా ప్రాంతంలో పుట్టిన గ్రీసు దేశస్తురాలు. తన కూతురులో నుండి ఆ దయ్యాన్ని వదిలించమని యేసును బతిమలాడింది.
27అందుకు యేసు ఆమెతో, “మొదట పిల్లలు తృప్తిగా తినాలి. చిన్నపిల్లల ఆహారం తీసి కుక్కలకు వేయడం తగదు” అని అన్నాడు. 28అందుకామె, “ఔను ప్రభూ! అది నిజమే గాని, బల్లకింద ఉన్న కుక్కలు కూడా పిల్లలు పడేసిన ముక్కలు తింటాయి కదా!” అని జవాబు ఇచ్చింది. 29అప్పుడాయన ఆమెతో, “ఈ మాట చెప్పినందువల్ల ఇక నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు. దయ్యం నీ కూతురిని వదలిపోయింది” అన్నాడు. 30ఆమె ఇంటికి వెళ్ళి తన కూతురు తన మంచంపై పడుకుని ఉండడం చూసింది. దయ్యం ఆమెను వదలిపోయింది.
మూగ చెవిటి దయ్యం నుండి విడుదల
మత్తయి 15:29-31
31యేసు తూరు, సీదోను ప్రాంతం నుంచి బయలుదేరి దెకపొలి ప్రాంతం గుండా గలిలయ సముద్రం దగ్గరికి వచ్చాడు. 32అక్కడ కొందరు చెవుడు, నత్తి ఉన్న మనిషిని ఆయన దగ్గరికి తీసుకు వచ్చి అతని మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు. 33యేసు అతన్ని జనంలో నుండి పక్కకి తీసుకు వెళ్ళి తన వేళ్ళు అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి అతని నాలుకను ముట్టాడు. 34అప్పుడు ఆయన ఆకాశం వైపు తల ఎత్తి నిట్టూర్చి, “ఎప్ఫతా” అని అతనితో అన్నాడు. ఆ మాటకు, “తెరుచుకో!” అని అర్థం. 35వెంటనే అతని చెవులు తెరుచుకున్నాయి. అతని నాలుక సడలి తేటగా మాట్లాడడం మొదలుపెట్టాడు. 36ఆ సంగతి ఎవ్వరితోనూ చెప్పవద్దని యేసు అతనికి ఆజ్ఞాపించాడు కాని, ఎంత కఠినంగా వారికి ఆజ్ఞాపించాడో అంత ఎక్కువగా వారు దాన్ని చాటించారు. 37ప్రజలకు అంతులేని ఆశ్చర్యం కలిగింది. వారు, “ఈయన అన్నిటినీ చక్కగా జరిగిస్తున్నాడు. చెవిటివారు వినగలిగేలా, మూగ వారు మాట్లాడేలా చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు.

Currently Selected:

మార్కు 7: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in