YouVersion Logo
Search Icon

ఫిలిప్పీ పత్రిక 2

2
విశ్వాసికి ఆదర్శం క్రీస్తే (1) ఐక్యత, సాత్వికం కలిగి ఉండాలని హెచ్చరిక
1క్రీస్తులో ఎలాంటి ప్రోత్సాహం గానీ, ప్రేమ ద్వారా ఎలాంటి ఆదరణ గానీ, దేవుని ఆత్మతో ఎలాంటి సహవాసం గానీ, సున్నితమైన ఎలాంటి కనికరం, వాత్సల్యం గానీ ఉన్నట్టయితే, 2మీరంతా ఒకే మనసు, ఒకే విధమైన ప్రేమ, ఆత్మలో సహవాసం ఒకే ఉద్దేశం కలిగిఉండి నా ఆనందాన్ని సంపూర్ణం చేయండి. 3స్వార్ధంతో గానీ వృథాతిశయంతో గానీ ఏమీ చేయవద్దు. వినయమైన మనసుతో ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచుకోండి. 4మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకోవాలి. 5క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి.
క్రీస్తు ఏడు విధాలుగా విధేయత కనుపరచడం
6ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు.
దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.
7అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు.
బానిస రూపం తీసుకున్నాడు.
మానవుల పోలికలో కనిపించాడు.
ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు.
8చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే,
తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు.
యేసుకు ఘనత
9-11అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా,
భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా,
ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా,
దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి,
అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.
అంతరంగంలోని రక్షణకు బాహ్య గురుతులు
12నా ప్రియ సహ విశ్వాసులారా, మీరెప్పుడూ లోబడుతున్నట్టుగానే, నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా, మరి ఎక్కువగా మీతో లేనప్పుడు, భయభక్తులతో మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. 13ఎందుకంటే దేవుడే మీరు తనకిష్టమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి కావలసిన సంకల్పాన్ని, కార్యసిద్ధిని కలుగజేయడానికి మీలో పని చేస్తూ ఉన్నాడు. 14మీరు చేసేవన్నీ, ఫిర్యాదులూ వాదాలూ లేకుండా చేయండి. 15దానివలన మీరు కుటిలమైన వక్రమైన ఈ తరం ప్రజల మధ్య నిర్దోషులు, నిందారహితులు, నిష్కళంకులైన దేవుని కుమారులుగా, లోకంలో దీపాలుగా వెలుగుతుంటారు. 16జీవవాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు క్రీస్తు తిరిగి వచ్చే రోజున నేను వ్యర్థంగా పరుగెత్తలేదనీ నా పని వృధా కాలేదనీ నాకు తెలుస్తుంది. గొప్పగా చెప్పుకోడానికి నాకొక కారణం ఉంటుంది.
అపొస్తలుని ఆదర్శం
17మీ విశ్వాస బలిదాన పరిచర్యలో నేను పానార్పణగా పోయబడినా, నేను సంతోషిస్తూ మీ అందరితో ఆనందిస్తాను. 18అలాగే మీరు కూడా సంతోషిస్తూ నాతోబాటు ఆనందించండి. 19మీరెలా ఉన్నారో తెలుసుకుని నాకు ప్రోత్సాహం కలిగేలా, ప్రభు యేసు చిత్తమైతే త్వరలో తిమోతిని మీ దగ్గరికి పంపాలనుకుంటున్నాను. 20తిమోతి లాగా మీ గురించి అంతగా పట్టించుకొనే వాడు నాకెవరూ లేరు.
21మిగతా వారంతా తమ సొంత పనుల్నే చూసుకుంటున్నారు గాని, యేసు క్రీస్తు విషయాలు చూడడం లేదు. 22తిమోతి తనను తాను రుజువు చేసుకున్నాడు. ఎందుకంటే, తండ్రికి కొడుకు ఎలా సేవ చేస్తాడో అలాగే అతడు నాతో కూడ సువార్త ప్రచారంలో సేవ చేశాడని మీకు తెలుసు. 23అందుచేత నాకు ఏం జరగబోతున్నదో తెలిసిన వెంటనే అతన్ని పంపాలనుకుంటున్నాను. 24నేను త్వరలో వస్తానని ప్రభువునుబట్టి నమ్ముతున్నాను.
25నా సోదరుడు, జతపని వాడు, సాటి యోధుడు, మీ ప్రతినిధి, నాకు అవసరమైనప్పుడు సేవ చేసే వాడు అయిన ఎపఫ్రొదితును మీ దగ్గరికి పంపడం అవసరమనుకున్నాను. 26అతడు జబ్బు పడ్డాడని మీకు తెలిసింది కాబట్టి అతడు మీ అందరితో ఉండాలని చాలా బెంగగా ఉన్నాడు. 27అతడు చావుకు దగ్గరగా వెళ్ళాడు, కానీ దేవుడు అతని మీద జాలి చూపించాడు. అతని మీదే కాదు, దుఃఖం వెంట దుఃఖం కలగకుండా నా మీద కూడా జాలి చూపాడు. 28కాబట్టి మీరు అతన్ని మళ్ళీ చూసి సంతోషించేలా, నా విచారం తగ్గేలా అతన్ని త్వరపెట్టి పంపుతున్నాను. 29ఎపఫ్రొదితును పూర్ణానందంతో ప్రభువు పేరిట చేర్చుకోండి. అలాంటి వారిని గౌరవంగా చూడండి. 30ఎందుకంటే అతడు క్రీస్తు పనిలో దాదాపు చావును ఎదుర్కొన్నాడు. నాకు సేవ చేయడానికీ మీరు తీర్చలేకపోయిన నా అవసరాలను మీ బదులు తీర్చడానికి, అతడు తన ప్రాణం సైతం లెక్కచేయలేదు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in