YouVersion Logo
Search Icon

సామెత 1

1
ఉద్దేశం, నేపథ్యం
1దావీదు కుమారుడు, ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు.
2జ్ఞానం, ఉపదేశం నేర్చుకోవడానికీ, వివేకం, జ్ఞానవాక్కులు బోధించడానికీ, 3నీతి, న్యాయం, యథార్థతల ప్రకారం నడుచుకుంటూ దిద్దుబాటు చేసుకోవడానికి, 4ఉపదేశం పొందని వారికి వివేకం ఇవ్వడానికి, యువతకు తెలివి, విచక్షణ కలిగేలా చేయడానికి ఉపకరిస్తాయి.
5తెలివి గలవాడు ఈ సామెతలు విని తన జ్ఞానం వృద్ధి చేసుకుంటాడు. వివేకం గలవాడు విని నీతి సూత్రాలు అలవర్చుకుంటాడు.
6వీటి మూలంగా సామెతలు, ఉపమానాలు, జ్ఞానుల మాటలు, వారు చెప్పిన నిగూఢ సత్యాలు ప్రజలు గ్రహిస్తారు.
7యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం తెలివికి మూలకారణం. మూర్ఖప్రజలు జ్ఞానాన్ని, నీతి వాక్యాలను వ్యతిరేకిస్తారు.
దుర్మార్గులకు దూరంగా ఉండాలని హెచ్చరికలు
8కుమారా, నీ తండ్రి చెప్పే సద్బోధ విను. నీ తల్లి చెప్పే మాటలు నిర్ల్యక్ష్యం చెయ్యకు.
9అవి నీ తలపై అందమైన పుష్ప కిరీటంలా ఉంటాయి. నీ మెడలో హారాలుగా నిలబడతాయి.
10కుమారా, దుష్టులు నిన్ను ప్రేరేపిస్తే అంగీకరించవద్దు.
11దుష్టులు నీతో “మాతో చేతులు కలుపు. ఎవరినైనా చంపడానికి కాపు కాద్దాం. అమాయకుడైన ఒకణ్ణి పట్టుకుందాం.
12ఆరోగ్య వంతుణ్ణి పాతాళం అకస్మాత్తుగా తీసేసుకున్నట్టు వారిని సజీవంగా మింగేద్దాం. సమాధిలోకి దిగే వారిలా వారిని చేసేద్దాం.
13దోచుకున్న సొమ్ముతో మన ఇల్లు నింపుకుందాం, రకరకాల విలువైన వస్తువులు మనకు దొరుకుతాయి.
14నువ్వు మాతో కలసి ఉండు, మనమంతా ఒకే చోట సొమ్ము దాచుకుందాం” అని నీతో చెబితే వాళ్ళ మాటలు లక్ష్యపెట్టవద్దు.
15కుమారా, నువ్వు వాళ్ళు నడిచే దారిలో వెళ్ళ వద్దు. వాళ్ళ ఆలోచన ప్రకారం చేయకుండేలా నీ పాదాలు అదుపులో ఉంచుకో.
16మనుషులను చంపడానికి వాళ్ళు తొందరపడుతూ ఉంటారు. హాని కలిగించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.
17ఒక పక్షి చూస్తూ ఉండగా దానికి వల వేయడం అనవసరం.
18వాళ్ళు తమ స్వంత నాశనానికే మాటు వేస్తారు. తాము పట్టబడతామని దాక్కుని ఉంటారు.
19అక్రమ ఆర్జన ఆశించే వాళ్లకు ఇదే గతి పడుతుంది. ఆ మార్గంలో నడిచే వాళ్ళ ప్రాణాలు అదే తీస్తుంది.
జ్ఞానం తిరస్కరించడం వల్ల ఫలితం
20జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తూ ఉంది. వీధుల వెంబడి బిగ్గరగా మాట్లాడుతూ ఉంది.
21జ్ఞానం సందడిగా ఉన్న ప్రాంతాల్లో ప్రకటన చేస్తూ ఉంది. పట్టణ ప్రధాన ప్రవేశాల్లో ప్రచారం చేస్తూ ఇలా తెలియజేస్తూ ఉంది.
22“జ్ఞాన హీనులారా, జ్ఞానం తెచ్చుకోకుండా ఎంతకాలం ఉండాలని కోరుకుంటారు? అపహాసకులారా, మీరు ఎగతాళి చేస్తూ ఎన్నేళ్ళు ఆనందంగా కాలం గడుపుతారు? బుద్ధిహీనులారా, మీరు ఎంతకాలం జ్ఞానాన్ని అసహ్యించుకుంటారు?
23నా గద్దింపు మాటలు వినండి. నా వైపు తిరగండి. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. మంచి సంగతులు మీకు తెలియజేస్తాను.
24నేను పిలిచినప్పుడు నా మాట మీరు వినలేదు. నా చెయ్యి చాపినప్పుడు ఎవ్వరూ అందుకోలేదు.
25నేను మిమ్మల్ని గద్దించి మంచి మాటలు బోధించినప్పుడు నా మాటలు లక్ష్యపెట్టలేదు, లోబడలేదు.
26కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. మీరు భయంతో వణుకుతున్నప్పుడు నేను మిమ్మల్ని ఎగతాళి చేస్తాను.
27తుఫాను వచ్చినట్టు మీకు భయం కలుగుతుంది, సుడిగాలి రేగినట్టు ప్రమాదం వచ్చి పడుతుంది. మీకు కష్ట సమయాలు, దుఃఖ సమయాలు సంభవిస్తాయి. అప్పుడు నేను మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తాను.
28అప్పుడు వాళ్ళు నా కోసం మొరపెడతారు, కానీ నేను ఎలాంటి జవాబూ ఇవ్వను. నా కోసం ఆసక్తిగా వెతుకుతారు కానీ నేను వాళ్లకు కనబడను.
29జ్ఞానం అంటే వాళ్లకు అసహ్యం వేస్తుంది. యెహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించడం వాళ్లకు ఇష్టం లేకుండా పోయింది.
30వాళ్ళు నేను చెప్పిన నా మంచి ఆలోచనలు అంగీకరించలేదు. నా మందలింపును నిర్లక్ష్యం చేశారు.
31కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. విరక్తి కలిగే దాకా తమ స్వంత ఆలోచనలు అనుసరిస్తారు.
32ఉపదేశం పొందని వారు దేవుణ్ణి తిరస్కరించి నాశనమవుతారు. మూర్ఖుల నిర్లక్ష్యం వారిని నిర్మూలం చేస్తుంది.
33నా ఉపదేశం విని దాని ప్రకారం నడుచుకునేవాడు సురక్షితంగా నివసిస్తాడు. కీడు కలుగుతుందన్న భయం లేకుండా ప్రశాంతంగా ఉంటాడు.”

Currently Selected:

సామెత 1: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in