YouVersion Logo
Search Icon

సామెత 12

12
1జ్ఞానం కోరుకున్నవాడు గద్దింపుకు లోబడతాడు. దిద్దుబాటును తిరస్కరించేవాడు పశువుతో సమానం.
2నీతిమంతుణ్ణి యెహోవా దయతో చూస్తాడు. చెడ్డ తలంపులు మనసులో ఉంచుకున్నవాణ్ణి ఆయన నేరస్తుడిగా ఎంచుతాడు.
3దుర్మార్గుల వలన అందరూ అల్లకల్లోలం అవుతారు. నీతిమంతుల పునాదులు స్థిరంగా ఉంటాయి.
4యోగ్యురాలైన భార్య తన భర్తకు కిరీటం వంటిది. భర్తకు సిగ్గు కలిగించే ఇల్లాలు అతని ఎముకలకు పట్టిన కుళ్లు.
5నీతిమంతులు చెప్పే ఆలోచనలు న్యాయసమ్మతం. దుర్మార్గుల సలహాలు మోసంతో కూడినవి.
6దుర్మార్గుల మాటలు హత్య చేయడానికి కాపు కాసి ఉన్న హంతకుల వంటివి. యథార్థపరుల మాట వల్ల వాళ్ళు విడుదల పొందుతారు.
7దుర్మార్గులు పాడైపోయి లోకంలో లేకుండా పోతారు. నీతిమంతుల నివాసం స్థిరంగా నిలుస్తుంది.
8ఒక్కొక్క మనిషి తన బుద్ధి కుశలతను బట్టి ఘనత పొందుతాడు. కపట వర్తనుడు తిరస్కారానికి గురౌతాడు.
9తినడానికి లేకపోయినా తన గురించి గొప్పలు చెప్పుకునేవాడి కంటే ఎదో ఒక చిన్న పని-సేవకుడుగా అయినా సరే-చేసుకుంటూ ఉండడం మంచిది.
10ఉత్తముడు తమ పశువుల ప్రాణాల పట్ల దయ చూపుతాడు. దుష్టులు చూపించే ప్రేమ క్రూరత్వమే.
11తన భూమిని సేద్యం చేసుకునే వాడికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. బుద్ధిహీనుడు వ్యర్థమైన వాటిని అనుసరిస్తాడు.
12దుర్మార్గులు చెడ్డవారికి దొరికిన దోపుడు సొమ్ము కోసం ఆశపడతారు. నీతిమంతుల ఉనికి వర్ధిల్లుతుంది.
13వ్యర్ధమైన మాటల వల్ల కలిగే దోషం ప్రాణాంతకమైన ఉరి వంటిది. నీతిమంతులు ఆపదలను తప్పించుకుంటారు.
14మనిషి తన నోటి మాటల ఫలం మూలంగా మంచితనంతో తృప్తి పొందుతాడు. ఎవరు చేసే పనులను బట్టి వాళ్ళకు ఫలితం దక్కుతుంది.
15మూర్ఖుడు నడిచే మార్గం వాడి దృష్టికి సరియైనదిగా అనిపిస్తుంది. జ్ఞానం గలవాడు మంచి మాటలు ఆలకిస్తాడు.
16మూర్ఖుల కోపం వెంటనే బయట పడుతుంది. వివేకం గలవాడు తనకు జరిగిన అవమానం వెల్లడి పరచక మౌనం వహిస్తాడు.
17సత్యం కోసం నిలబడేవాడు నీతిగల మాటలు పలుకుతాడు. అబద్ద సాక్ష్యం పలికేవాడు కపటపు మాటలు పలుకుతాడు.
18కత్తిపోటులాంటి మాటలు పలికే వాళ్ళు ఉన్నారు. జ్ఞానుల మాటలు ఆరోగ్యం కలిగిస్తాయి.
19నిజాలు పలికే పెదవులు ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. అబద్ధాలు పలికే నాలుక ఉనికి క్షణకాలం.
20కీడు తలపెట్టేవాళ్ళ హృదయాల్లో మోసం ఉంటుంది. శాంతి కోసం సలహాలు ఇచ్చేవాళ్ళకు సంతోషం కలుగుతుంది.
21నీతిమంతులకు ఎలాంటి హానీ జరగదు. దుర్మార్గులను కష్టాలు వెంటాడుతుంటాయి.
22అబద్ధాలు పలికే పెదవులంటే యెహోవాకు అసహ్యం. నిజాయితీపరులను ఆయన ప్రేమిస్తాడు.
23వివేకం ఉన్నవాడు తన ప్రతిభను దాచిపెడతాడు. తెలివితక్కువ వాళ్ళు తమ మూర్ఖత్వాన్ని బయట పెడతారు.
24ఒళ్ళువంచి పనిచేసే వాళ్ళు అధికారం సంపాదిస్తారు. సోమరిపోతులు ఊడిగం చెయ్యాల్సి వస్తుంది.
25విచారం నిండిన హృదయం క్రుంగిపోతుంది. దయగల మంచి మాట హృదయానికి సంతోషం కలిగిస్తుంది.
26ఉత్తముడు తన పొరుగువాడు సన్మార్గంలో నడిచేలా చేస్తాడు. దుర్మార్గుల దుష్ట ప్రవర్తన మూలంగా వారు దారి తప్పిపోతారు.
27సోమరిపోతు వేటకు వెళ్ళినా ఏమీ పట్టుకోలేడు. చురుకుదనం కలిగి ఉండడం గొప్ప వరం.
28నీతిమార్గంలో జీవం ఉంది. జీవమార్గంలో మరణం అనేది ఉండదు.

Currently Selected:

సామెత 12: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in